మేం యుద్ధానికి వెనకాడం

-తైవాన్ విషయంలో యూఎస్ కు చైనా వార్నింగ్

బీజింగ్‌: తైవాన్‌ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చింది. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని తేల్చిచెప్పింది.సింగపూర్‌ వేదికగా జరిగిన సమావేశంలో చైనా రక్షణ మంత్రి వీఫెంగ్.. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌కు స్పష్టం చేశారు.’ఎవరైనా చైనా నుంచి తైవాన్‌ను విడదీసే ధైర్యం చేస్తే.. చైనా ఆర్మీ యుద్ధాన్ని ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడదు. ఎంత ఖర్చుకైనా సిద్ధమే. తైవాన్ స్వాతంత్ర్యం కోసం చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా బద్దలు చేస్తాం. మాతృభూమి ఏకీకరణను సమర్థిస్తున్నాం. తైవాన్ అంటే చైనాకు చెందిన తైవాన్ మాత్రమే. ఈ ప్రాంతాన్ని పావుగా వాడి, చైనాను కట్టడిచేసే ప్రయత్నాలు ఎన్నటికీ ఫలించవు’ అంటూ వీఫెంగ్‌ను ఉటంకిస్తూ చైనా రక్షణ శాఖ వెల్లడించింది. తైవాన్‌ వైపుగా అస్థిరపరిచే చర్యలకు దూరంగా ఉండాలని ఆస్టిన్‌ చేసిన సూచనల నేపథ్యంలో డ్రాగన్‌ నుంచి ఈ ఘాటు స్పందన వచ్చింది.తైవాన్ స్వయం పరిపాలన కలిగిన ఓ ఐలాండ్ ప్రాంతం. అయితే దానికి చైనా దురాక్రమణ ముప్పు పొంచి ఉంది. ఇది తమ దేశ భూభాగంగా చెప్పుకొంటున్న చైనా.. ఏదో ఒకరోజు దానిని స్వాధీనం చేసుకుంటామని పలుమార్లు ప్రకటించింది. అవసరమైతే బలం ఉపయోగించడానికి వెనుకాడమని వెల్లడించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన దగ్గరి నుంచి చైనా నుంచి తైవాన్‌కు అదే పరిస్థితి ఎదురవుతుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డ్రాగన్ ముప్పును దృష్టిలో పెట్టుకొని.. తైవాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. యుద్ధం వస్తే పౌరులు ఎలా స్పందిచాలనే దానిపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది.

Leave a Reply