Suryaa.co.in

Andhra Pradesh Features Telangana

ఇంత చిన్నవాడివైపోయావా స్వామీ?

అంత పెద్ద ఆకాశమంత విగ్రహం పెట్టి ఇంత చిన్నవాడిపోయావేమి స్వామీ?

వామనుడిలో త్రివిక్రముడిని చూసినా…శుక్రాచార్యుడు వద్దని వారిస్తున్నా బలి చక్రవర్తి హాయిగా ఇష్టంగా నెత్తిన కాలు పెట్టించుకుని శాశ్వతంగా పాతాళంలోకి కూరుకుపోయాడు. ఎవరు జగద్గురువు? ఎవరు కాదు? అన్న సమకాలీన ప్రైమ్ టైమ్ టీ వీ డిబేట్ల స్థాయికి దిగి మీరు ఎక్కడ కూరుకుపోయారు స్వామీ?

వెంకన్నకు ఒక గురువున్నాడా స్వామీ? నిజమే. వెంకన్నకే పంగనామాలు పెట్టగలిగిన ఎందరో పుట్టి మట్టిలో కలిసిపోయినప్పుడు…ఒక గురువు కూడా ఉండే ఉంటాడు. ఏ పురాణంలో ఉన్నాడు స్వామీ ఈ గురువు?

శంఖు చక్రాలిచ్చిన ప్రతివారూ గురువే అయితే…పాపం! వెంకన్నకు ఎన్ని కోట్ల మంది గురువులో?

అద్వైతం ముందు విశిష్ట ఉంది కాబట్టి విశిష్టాద్వైతమే గొప్పదా స్వామీ? అద్వైతాన్ని శంకరాచార్యుడు పుట్టించలేదు. ఉన్నదాన్ని ప్రచారం చేశాడు. ఉన్నదానికి ఉన్నతస్థానం కలిగించాడు. జీవ బ్రహ్మైక్య

అద్వైతాన్ని అంత ఎగతాళి చేయడానికి, జగద్గురువుగా శంకరాచార్యులను నిరాకరించడానికి మీకు సమతామూర్తి పాదమే వేదికయ్యిందా స్వామీ?

అసలే హిందూ తాత్విక భావజాలం మీద దాడులు జరుగుతుంటే…శైవ- వైష్ణవ విభేదాలు; అద్వైత- విశిష్టాద్వైత వాదోపవాదాలు కూడా తోడయితే…అగ్గికి ఆజ్యం పోసిన పుణ్యంలో మీభాగం మీరు తీసుకోవాల్సి ఉంటుంది స్వామీ!

వెయ్యేళ్ల క్రితం రూపుమాపిన అంటరానితనం భౌతికమయినదే స్వామీ. నరనరాన బౌద్ధికమయిన అంటరానితనం అలాగే ఉంది స్వామీ!

మాకు…రియలెస్టేట్- భక్తి కలగలిసిన అద్వైతమూ తెలియదు. రియలెస్టేట్- రాజకీయం- భక్తి ముప్పేటలా

పెనవేసుకున్న విశిష్టాద్వైతమూ తెలియదు. మహాదాతలకు పంచె కట్టి పరమహంస పరివ్రాజక స్థాయి కల్పించిన ద్వైత ద్వైదీ భావమూ తెలియదు.

స్వామీ!
మాకు శంకరుడు- రామానుజుడు;
వెంకన్న- మల్లన్న;
లక్ష్మి- పార్వతి;
స్కంధుడు- గణపతి…అందరు దేవుళ్ళూ ఒకటే. తిరుమలకు వెళితే నామం పెట్టుకుంటాం. శ్రీశైలం వెళితే విభూతి పెట్టుకుంటాం. మీ విశిష్టాద్వైతంలో ఇది తప్పయితే మమ్మల్ను క్షమించండి స్వామీ! రౌరవాది నరకాల్లో పడి మా పాపాన మేము పోతాం!

జగద్గురువు శంకరాచార్యుడు విష్ణువును ద్వేషించాడా స్వామీ? పారమార్థిక దృష్టి లోపిస్తే…పరమ ప్లస్ ఆర్థిక పరమార్థిక దృష్టే మిగులుతుంది స్వామీ! విగ్రహానికి టికెట్టు; యాగానికి పేమెంటు; భక్తికి బుకింగు పరమ ఆర్థిక విషయాలే స్వామీ!

విగ్రహం నిగ్రహానికే స్వామీ! మీరు విగ్రహం ముందే నిగ్రహం కోల్పోతున్నారు. మీరంటున్నట్లు వెంకన్నకే గురువయిన రామానుజులు, జగత్తుకు ఒకే ఒక గురువయిన రామానుజులు మీకు నిగ్రహం కలిగించాలని మనసా వాచా కర్మణా కోరుకుంటున్నాం స్వామీ!

ఇట్లు,
సనాతన ధర్మ ప్రేమికులు

LEAVE A RESPONSE