– ఆలయం తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్ర ప్రదేశ్ లో..!!
-అధికారులకు తలనొప్పిగా మారిన పంచాయతీ..!
– వందల కోట్ల ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నం
-ఎండోమెంట్ అధికారులపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల దౌర్జన్యం.. బూతు పురాణం
– “భూములు కావాలంటే రాముడినే రమ్మను” అంటూ ఎగతాళి..!
– వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అండదండలతోనే కబ్జా
-భూములు కాపాడుకునేందుకు
– తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి..
తెలుగు ప్రజలు అయోధ్యగా పిలుచుకునే భద్రాద్రి శ్రీ రాములవారి ఆస్తులపై పరాయి మతస్తులు కన్ను పడింది. వందల కోట్ల విలువచేసే ఆస్తులు కబళించేందుకు కాచుకు కూర్చున్నారు. దాదాపు 916 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికార పార్టీ (వైయస్సార్ కాంగ్రెస్) ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు దేవుడి పొలాల్లో రాబందుల్లా వాలిపోయారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నారు. రాముడు అంటే విశ్వాసం లేని, హిందూ ధర్మం నుంచి క్రైస్తవ మతం మారిన వ్యక్తులు రాముడిని ఎగతాళి చేస్తూ.. భగవంతుడి భూములు కబ్జా చేస్తున్నారు. అడిగే వారు ఎవరూ లేకపోవడం.. ధైర్యం చేసి దేవాలయ అధికారులు అడిగితే కబ్జాదారులు దాడులకు దిగుతున్నారు. “శ్రీరాముడి భూములు కబ్జా చేస్తే మీకేంటి నష్టం..? దేవుడి ఆస్తులు కావాలనుకుంటే రాముడే స్వయంగా వచ్చి అడుగుతాడు.. మధ్యలో మీరెవరు..? అడగడానికి” అంటూ రాముడిని ఎగతాళి చేస్తూ దుర్భాషలాడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక అధికారులు బిక్కుబిక్కుమంటున్నారు.
అసలు విషయం..!!
అసలు విషయం ఏమిటంటే.. భద్రాద్రి రాముడు పరిస్థితి అయోమయంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది. అయితే 2014లో రాష్ట్రం విడిపోవడంతో ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలిశాయి. రాముల వారి మందిరం మాత్రం ఖమ్మం జిల్లాలోని మిగిలింది. కానీ భూములు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి వెళ్లాయి. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ రాష్ట్రంలోని జిల్లాలను విభజిస్తూ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాడు.
దీంతో భద్రాచలం, ఖమ్మం నుంచి విడిపోయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా అవతరించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. అందులో తూర్పుగోదావరి జిల్లాను పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాగా విడదీశారు. ప్రస్తుతం భద్రాద్రి శ్రీ రాములవారి భూములు ఉన్న ప్రాంతం ఎటపాక మండలం, పురుషోత్తమ పట్టణం గ్రామాలు పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిశాయి. కాబట్టి ఎటపాక మండలంలో 1 నుంచి 101 సర్వే నంబర్లలో దాదాపు 980 ఎకరాల శ్రీరాముడి భూములు ఉన్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోంది. అనంతబాబు అనే ఎమ్మెల్సీ (తన కార్ డ్రైవర్ ను చంపిన కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.) అండదండలతో వైఎస్ఆర్సిపికి చెందిన ఎటపాక ఎంపీటీసీ రామిరెడ్డి రాముడి భూములు కబ్జా చేస్తున్నాడు. ఇతను హిందుత్వాన్ని వీడి క్రైస్తవ మతం ఆచరిస్తున్నాడు. దేవుడి భూములలో ఇల్లు నిర్మాణం చేసుకుంటూ, ఇతరులను కూడా నిర్మించుకోవాలని ప్రోత్సహిస్తున్నాడు.
దేవుడి భూములలో నిర్మాణాలను ఆపాలని అధికారులు వెళితే.. “రాముడు లేడు దేవుడు లేడు. తన భూములు కావాలనుకుంటే రాముడిననే వచ్చి అడగమను. మధ్యలో మీరెవరు..? మీరు ఎందుకు వచ్చారు” అంటూ ఎండోమెంట్ అధికారులను దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. రాముడి పేరుతో ఎగతాళి చేస్తూ వెకిలీ చేష్టలు చేస్తున్నాడు. ఇదంతా అక్కడి పాలకుల సహాయ సహకారలతోనే జరుగుతున్నదని స్పష్టంగా చెప్పవచ్చు.
దేశానికి స్వాతంత్రం రాకముందే1867 లో పురుషోత్తముడు అనే ఓ రామ భక్తుడు ఆంగ్లేయులు దగ్గర భూములు కొన్నట్లు రికార్డులు ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడి పేరు మీదే పాసుపుస్తకాలు కూడా ఉన్నాయి. కబ్జా విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఇది సివిల్ సబ్జెక్ట్ అని తెలివిగా తప్పించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు కూడా కబ్జాదారులకు మద్దతుగా నిలుస్తున్నారు.
పట్టపగలే భద్రాద్రి శ్రీరామచంద్రుడి ఆస్తులను దోచుకుంటున్న దొంగలను హిందూ సమాజం నిలదీయాలి. రాముల వారి ఆస్తులను పరిరక్షించేందుకు ధైర్యంగా నడుము కట్టి నడవాలని విశ్వహిందూ పరిషత్ విజ్ఞప్తి చేస్తుంది. హిందువులంతా చైతన్యమైతే కబ్జాకోరులు.. దోపిడి దొంగలు తోకముడవక తప్పదు అని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తోంది. అవసరమనుకుంటే ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని సూచించింది.