స్మార్ట్ పేరుతో జగన్ రెడ్డి దగా

– నిధుల కోసం ఆర్భాటంగా టౌన్ షిప్ లు
– జగనన్న కాలనీల పేరుతో పేదలను దగా చేసిన సీఎం
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్

విజయవాడ : జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ అంటూ మళ్ళీ ప్రజలను దగా చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొత్త పధకానికి శ్రీకారం చుట్టారని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాధ్ విమర్శించారు. ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి స్వర్గం వేసినట్లు ఇప్పటికే పధకాలకు, జీతాలకు, ఫించన్లకు చిల్లి గవ్వ కూడా లేకున్నా అప్పులు చేసి పరిపాలన కొనసాగిస్తున్న జగన్ రెడ్డి సర్కారు ఇళ్ళ పేరుతో మధ్యతరగతి ప్రజలను మోసం చేసేందుకు దీన్ని ప్రారంభించిందని విమర్శించారు. ఈ మేరకు మంగళవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.

కేంద్రం నిర్దేశించిన లెక్క ప్రకారం రాష్ట్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.44,396 కోట్లు అప్పు చేసుకోవచ్చని, రాష్ట్రం లెక్క ప్రకారం ఇప్పటికే రూ.40,778 కోట్లు అప్పు తెచ్చారని, ఇంకా కేంద్రం నుంచి అప్పుల కోసం రావాల్సిన అనుమతి రూ.3,618 కోట్లు మాత్రమే కాగా రాష్ట్ర ప్రభుత్వం తమకు రూ.23,000 కోట్ల అప్పులకు అనుమతి రావాలని కోరిందని, ఈ పరిస్థితుల్లో ఇళ్ల నిర్మాణాలకు నిధులు ఎక్కడ నుంచి తీసుకు వస్తారని ప్రశ్నించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కంకణం కట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలో ఎన్ని ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అందించిందో స్పష్టం చేయాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు. జగనన్న కాలనీ ల పేరుతో ఆర్భాటంగా 30లక్షల మందికి స్థలాలు కేటాయించినట్లు ప్రకటించుకున్న ప్రభుత్వం వాటిని అభివృద్ధి చేయడంలో విఫలమైందని ఎద్దేవా చేశారు.

రూ.34వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న జగన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు వాటి కోసం ఎన్ని నిధులు కేటాయించిందో స్పష్టం చేయాలని కోరారు. పేదల కోసం రికార్డు స్థాయిలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వం వీటిని ఎప్పటికి పూర్తి చేస్తుందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పేద ప్రజలకు ఉచితంగా కేటాయించిన ఇళ్లకు సైతం వన్ టైం సెటిల్మెంట్ పేరుతో డబ్బులు కట్టాలని వేధించడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు.

మూడు రోజుల్లో మూడు లక్షల ఇళ్ళు అని ప్రకటించిన ప్రభుత్వం ఎన్ని లక్షల ఇళ్ళు పూర్తి చేసిందో ప్రజలకు వివరించాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పట్టాలు తీసుకున్న లబ్ధి దారులు మొత్తం 56,69,000 మంది కాగా ఇందుకోసం గ్రామాల్లో అయితే 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కడుతున్నారని, దాదాపు 40 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ నుంచి రుణం తీసు కున్నారని, సుమారు 43 వేలమంది గత ప్రభుత్వ హయాంలో అసలు, వడ్డీ కూడా గృహ నిర్మాణాల రుణం నిమిత్తం చెల్లించారని, గృహ నిర్మాణ రుణాలపై వడ్డీ మాఫీ చేయాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోకుండా ఓటీస్ అంటూ వేధిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టాలి కానీ కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కొనే పథకాలు కాదని శైలజనాథ్ హితవు పలికారు.

Leave a Reply