Suryaa.co.in

Andhra Pradesh

అమ్మ ఒడి పథకం 5 ఏళ్లు కాదు 4 ఏళ్లే అమలు

– గత ఏడాది రూ.6వేల కోట్లు పైబడి ఎగ్గొట్టారు
-నాడు విద్యార్ధుల లెక్క చెప్పి నేడు తల్లుల లెక్కతో సరిపెట్టి దగా చేసి అమ్మ ఒడి అమలు
-అమ్మఒడిలో మెయింటెన్స్ పేరుతో ఒక్కో విద్యార్ధికి రూ.2వేలు కోత పెట్టి ఏడాదికి రూ.800 కోట్లకు పైబడి నొక్కేస్తున్న జగన్ రెడ్డి
-అమ్మ ఒడిలో కోత పెడుతున్న మెయింటెన్స్ నిధుల్లో ఒక్క ప్రైవేట్ పాఠశాలకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా?
-విద్యార్ధులకు 75 శాతం అటెండెన్స్ నిబంధన పెట్టిన జగన్ రెడ్డి ప్రతి శుక్రవారం తన కోర్టు అటెండెన్స్ విషయమై ఏం సమాధానం చెబుతారు?
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలను నేడు తుంగలో తొక్కి ప్రజలను మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ‘జగన్ మోసం రెడ్డిగా’ మారారు. అమ్మ ఒడి ద్వారా ఇచ్చే డబ్బులతో ప్రజలకు మేలు జరగకపోగా, ఇచ్చిన డబ్బులను నాన్న బుడ్డిలో లాగేస్తున్నారు. జులై 08, 2017న గుంటూరు వైసీపీ ప్లీనరీలో జగన్ రెడ్డి మాట్లాడుతూ… రేపు అధికారంలోకి వస్తే 6 నుండి 10వ తరగతి వరకు నెలకు ఒక్కో విద్యార్ధికి రూ.750 చొప్పున కుటుంబంలో ఇద్దరు పిల్లలుంటే ఏడాదికి ఒక్కో తల్లికి రూ.18వేలు ఇస్తానని, అదే విధంగా ఇంటర్ విద్యార్ధులకు ఒక్కో విద్యార్ధికి నెలకు రూ.1000 చొప్పున ఇద్దరు పిల్లలుంటే రూ.2000 చొప్పున ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు ఇస్తామని హామీనిచ్చి నేడు అధికారంలోకి వచ్చిన తరువాత పిల్లల లెక్కతో సంబంధం లేదు తల్లికి మాత్రమే రూ.15వేలు ఇస్తామని మాట మార్చారు.

2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతీ రెడ్డి ఇంటింటి వెళ్లి మేము అధికారంలోకి వస్తే ఒక పిల్లవాడిని బడికి పంపితే రూ.15వేలు, ఇద్దరు పిల్లలుంటే ఏటా రూ.30వేలు ఇస్తానని హామీనిచ్చారు. దీనికేమి సమాధానం చెబుతారు? నేడు జరుగుతున్నది మోసం కాదా?

82 లక్షల 31వేల విద్యార్ధులు నేడు ఉన్నారని చెబుతున్న మీరు ఎన్నికలకు ముందు మీరు చేసిన వాగ్దానం ప్రకారం ఒక్కో విద్యార్ధికి రూ.15వేలు చొప్పున దాదాపు రూ.13వేల కోట్లు విద్యార్ధులకు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉండగా నేడు దానిలో సగానికి సగం కోత పెట్టారు. మీ భార్యా, భర్తలిద్దరూ ఊరూరా తిరిగి చెప్పింది ఏంటి? నేడు చేస్తుంది ఏంటి?

నేడు జగన్ రెడ్డి విద్యార్ధులకు మేనమామ కాదు కంసమామగా చూస్తున్నారు. నేడు ఇచ్చిన సొమ్ముతో కలిపి గత మూడు సంవత్సరాలలో రూ.19,617 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. నేడు 2021-22 విద్యా సంవత్సరానికి నిధులు వేస్తున్నామని ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం నడుస్తున్నది 2022-23 విద్యా సంవత్సరం మీరు గడిచిపోయిన 2021-22కి నిధులు ఇస్తున్నామని ఎలా చెబుతారు? వాస్తవానికి 2021-22 విద్యా సంవత్సరానికి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు.

2019-20, 2020-21 సంవత్సరాలలో జనవరి నెలలో అమ్మ ఒడి నిధులు విడుదల చేశారు, కాని 2022 జనవరిలో ఒక్క పైసా నిధులు విడుదల చేయలేదు, 2021-22 విద్యా సంవత్సరంలో ఒక్క పైసా నిధుల విడుదల కాకుండానే ఆ విధంగా ఆ విద్యా సంవత్సరం ముగిసింది. ఇదే అంశం 2022-23 బుగ్గన రాజేంద్ర నాథ్ బడ్జెట్ కాగితాలలో చాలా స్పష్టంగా పేర్కొనబడింది. 2021-22కి గాను అమ్మ ఒడి పథకం కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనట్లు చాలా స్పష్టంగా బుగ్గన బడ్జెట్ పత్రాలలో ఉంది.

2021-22 సంవత్సరానికి గాను గత సంవత్సరం మే నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ స్పీచ్ పేరాగ్రాఫ్ 51లో బుగ్గన గారు చాలా స్పష్టంగా 2021-22 సంవత్సరానికి రూ.6,105 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించి ఆ సంవత్సరం ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఇది మోసం కాకమరేమిటి? 2022-23 బడ్జెట్ ఎనక్సర్ లోని డీబీటీ కింద సీరియల్ నెంబర్ 21లో అమ్మ ఒడి పథకం 2021-22 కింద నిధులు కేటాయించింది సున్నా అని పెట్టారు. 2021-22 సంవత్సరంలో అమ్మ ఒడి పథకానికి డబ్బులు ఎందుకు జమ చేయలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి? అంటే రూ.6వేల కోట్ల డబ్బులు ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు?

అమ్మ ఒడి పథకం కింద డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని దగా చేశారని రాష్ట్రంలోని ప్రతి ఒక్క విద్యార్ధికి, ప్రతి ఒక్క తల్లి అర్ధం చేసుకోవాలి. ఆ రకంగా గత సంవత్సరం దగా చేసి నేడు ఏ మొఖం పెట్టుకొన శ్రీకాకుళం వెళ్లాడు జగన్ రెడ్డి. ప్రస్తుతం నేడు జగన్ రెడ్డి విడుదల చేసింది మూడో విడత అమ్మ ఒడి. 2023 జూన్ లో 4వ విడత జమ చేయాల్సి ఉంటుంది. 2024 ఏప్రెల్/ మే తో జగన్ రెడ్డి పదవి కాలం ముగుస్తుంది. అంటే అమ్మ ఒడి పథకం 5 ఏళ్లు ఇస్తానని చెప్పి నేడు కేవలం 4 విడతలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. ఇది మోసం కాదా జగన్ రెడ్డి?

ఇస్తున్న రూ.15వేలలోను మళ్లీ కోతలు పెడుతున్నారు
2019-20లో రూ.15వేలు ఇచ్చారు, 2020-21లో మరుగుదొడ్ల మెయింటెన్స్ కోసం వెయ్యి కోత పెట్టి రూ.14వేలు, ఇప్పుడు స్కూల్ మెయింటెన్స్ పేరుతో మరో వెయ్యి కోత పెట్టి రూ. 13వేలు మాత్రమే ఇస్తున్నారు. మెయింటెన్స్ కింద ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం లేదు. ఆఖరికి ఆయాలకు జీతాలు ఇవ్వకపోడంతో వారంతా తిరగబడుతున్న పరిస్థితి. 44 లక్షల మంది తల్లులకు గాను ఒక్కో తల్లి కింద రూ.2వేలు కోతల పెడితే దాదాపు రూ.800 కోట్లకు పైబడి నొక్కేస్తున్నారు.

రాష్ట్రంలోని విద్యార్ధుల్లో 45 శాతం మంది ప్రైవేట్ స్కూల్స్ లో విద్యను అభ్యసిస్తున్నారు. అంటే దాదాపు 20 లక్షల మంది తల్లులు తమ బిడ్డలను ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తున్న పరిస్థితి. మరి వారికి మెయింటెన్స్ పేరుతో కోత పెడుతున్న రూ.2000 ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు మీరు ఇవ్వడం లేదు కదా? 20 లక్షల మందికి రూ2వేల చొప్పున సంవత్సరానికి రూ.400 కోట్లు కోత. ఇందులో ఒక్క రూపాయి అయినా ఒక్క ప్రైవేట్ పాఠశాలకు మీరు మెయింటెన్స్ కోసం జమ చేశారా? దమ్ముంటే జగన్ రెడ్డి రుజువు చేయాలి. ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి జగన్ రెడ్డి అమ్మ ఒడి మెయింటెన్స్ నిధులు చెల్లించడం లేదు.

ఈ ఏడాది అమ్మ ఒడి పథకానికి రకరకాల కారణాలతో 52,463 మంది లబ్దిదారులకు కోత పెట్టి సమర్ధించుకునేందుకు 75 శాతం అటెండెన్స్ లేకపోతే అమ్మ ఒడి డబ్బులు జమకావని చెబుతున్నారు. స్కూల్ కు వెళ్లే పిల్ల వాడికి 75 శాతం అటెండెన్స్ లేకపోతే రూ.15వేలు కోత పెడతానని చెబుతున్న జగన్ రెడ్డి నువ్వు మాత్రం శుక్రవారం కోర్టుకు అటెండ్ అవ్వకుండా కుంటిసాకులతో ఎగ్గొడుతున్నారు. నీకు కోర్టు అటెండెన్స్ ముఖ్యం కాదా? గత మూడు సంవత్సరాలలో నీ కోర్టు అటెండెన్స్ సున్నా.

మరి దీనికి నీకు ఏం కోత పెట్టాలి ఏం వాత పెట్టాలి జగన్ రెడ్డి. కోర్టు ఇచ్చిన బెయిల్ పై జీవిస్తున్న నీకు కోర్టు అటెండెన్స్ ఏ రోజు గుర్తుకు రాదా? దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? రాష్ట్రాలకు డబ్బులు ఇవ్వాలంటే ప్రపంచ బ్యాంక్ నిబంధనలు పెట్టినట్లుగా అమ్మ ఒడి వర్తించాలంటే అన్ని నిబంధనలు పెడుతున్నారు. కాని సరస్వతి ఇండస్ట్రీస్ కి మాత్రం కేంద్ర ఎన్విరాన్ మెంట్ శాఖ విధించిన నిబంధనలు కాకుండా ఇష్టానుసారంగా రెండింతలు నీటిని కేటాయించుకుంటున్నట్లుగా జీవో ఇచ్చుకున్నావు. హెటిరో వంటి నీ బినామీలకు భూములు కేటాయించడానికి మాత్రం నిబంధనలు గుర్తుకు రావు. కాని విద్యార్ధులకు పథకాలు అమలు చేయమంటే మాత్రం నీకు నిబంధనలు గుర్తుకు వస్తాయా జగన్ రెడ్డి.

మెరుగైన సౌకర్యాలతో విద్యార్ధుల తలరాతలు మారుస్తున్నానని చెబుతున్న నువ్వు మొన్న 10వ తరగతి ఫలితాలలో 2 లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్ తలకిందులు అవ్వడానికి కారకుడయ్యాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2 లక్షల మంది 10 తరగతి ఫెయిల్ అయ్యారు. 10 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నీ విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో National Achievement Survey 2021 బయటపెట్టింది. 3వ తరగతికి జాతీయ ఎచీవ్ మెంట్ సగటు 59 శాతం ఉంటే మన రాష్ట్రం 54 శాతం. 5వ తరగతికి జాతీయ ఎచీవ్ మెంట్ సగటు 49 శాతం ఉంటే మన రాష్ట్రం కేవలం 43 శాతంగా ఉంది.

అదే విధంగా 8వ తరగతి 42 శాతం జాతీయ ఎచీవ్ మెంట్ ఉంటే మన రాష్ట్రంలో 38.7 శాతం మాత్రమే. ఈ విధంగా అనేక అంశాలలో జాతీయ సగటు కంటే అత్యంత అధ్వానంగా మన రాష్ట్రం సగటు ఉండటం దేనికి సంకేతం. మన విద్యావ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి. అమ్మఒడి డబ్బులు నాన్న బుడ్డికే సరిపోతున్నాయి. 2018-19లో 6,200 కోట్లు ఉన్న ఎక్సైజ్ ఆదాయం 2021-22 నాటికి రూ.15వేలు కోట్లు దాటిపోయింది. అంటే దాదాపు సంవత్సరానికి రూ.9వేల కోట్లు పెంచేశావు. ఇప్పుడు నువ్విచ్చే అమ్మ ఒడి డబ్బుల కంటే అది ఇంకా ఎంతో అధనం. దీనిని బట్టే అమ్మ ఒడి నాన్న బుడ్డికే సరిపోతుందని అర్ధమౌతుంది.

2014-19 మధ్య 5వేల పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, వర్చువల్ తరగతులు, చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దాదాపు ప్రతి పాఠశాలకు హై స్పీడ్ ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించారు. ఆనాడు రూపాయి అవినీతికి తావు లేకుండా మెరుగైన సౌకర్యాలు పాఠశాలలకు కల్పిస్తే నేడు జగన్ రెడ్డి నాడు నేడు పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారు. పాఠశాలల్లో పైకప్పులు ఊడి విద్యార్ధులు గాయపడటం జగన్ రెడ్డి అవినీతికి ప్రత్యక్ష ఉదాహరణ.

బైజూస్ వ్యవహారంలో కూడా రూ.500 కోట్లు ఎవరికి దోచిపెడతారో త్వరలోనే తేలుతుంది? అదే విధంగా ట్యాబ్ లు ఎవరి దగ్గర ఎంత పెట్టి కొంటారో కూడా చూస్తాం. గతంలోనే చంద్రబాబు నాయుడు గారి హాయాంలో ఏర్పాటు చేసిన కంటెంట్ కార్పొరేషన్ ను జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. నేడు ఆ కార్పొరేషన్ అందుబాటులో ఉండి ఉంటే విద్యార్ధులకు ఈపాటికే ఉచితంగా డిజిటల్ కంటెంట్ అందుబాటులో వచ్చి ఉండేది.

నేడు జగనాసుర అనే రాక్షసుడిపై చేస్తున్న పోరాటంలో ఒక్క మీడియానే కాదు ప్రతి ఒక్కరు ఏకమవుతున్నారు. జగనాసురుడు చేస్తున్న మోసాన్ని భరించలేక చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలు కోరుకుంటూ ఎక్కడి వెళ్లిన నీరాజనాలు పలుకుతున్నారు. మీడియా ఏం తప్పు చేసిందని జగన్ రెడ్డికి ఉక్రోశం.

ప్రతి నిముషం ఈనాడు రామోజీరావు గారిని, ఆంధ్రజ్యోతి రాధా కృష్ణ గారిని, టీవీ -5 బీఆర్ నాయుడు గారిని ఆడిపోసుకోకుండా నేడు వారు ప్రజల పక్షాన అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పు. ఉపాధ్యాయులను వైన్స్ షాపుల ముందు ఉంచినప్పుడు దానిని మీడియా చూపించడం తప్పా? గతంలో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి నేడు నీవు చేస్తున్న మోసాన్ని మీడియా ప్రశ్నించడం తప్పా? ప్రజల పక్షానా నిలుస్తున్న మీడియాను తప్పుపట్టడం మాని అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు జగన్ రెడ్డి.

LEAVE A RESPONSE