Suryaa.co.in

Andhra Pradesh

హెల్త్ హబ్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం జగన్

– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
-ఆషా హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రావాలంటూ ఆహ్వానం
గుడివాడ, అక్టోబర్ 9: రాష్ట్రంలో హెల్త్ హబ్స్ ఏర్పాటుపై సీఎం జగన్మోహనరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని ఆషా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ అలీ షేక్, డాక్టర్ ఆషా పర్వీన్ సయ్యద్ కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16 వ తేదీ ఉదయం 11.55 గంటలకు గుడివాడ పట్టణంలోని ఏలూర్ రోడ్డులో నూతనంగా ఆషా హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ఆసుపత్రిని ప్రారంభించేందుకు రావాలంటూ మంత్రి కొడాలి నానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆపరేషన్ థియేటర్ను డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పీఎస్ఎన్ మూర్తి ప్రారంభిస్తున్నారని చెప్పారు.
అనంతరం మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లోనే చికిత్స అందించే విధంగా సీఎం జగన్మోహనరెడ్డి చర్యలు చేపట్టారన్నారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆసుపత్రుల నిర్మాణంపై శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. అన్నిరకాల మెరుగైన వైద్యసేవలన్నీ స్థానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్న ఉద్దేశ్యంతో సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో స్పెషలైజేషన్తో కూడిన ఆసుపత్రుల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టారన్నారు. పీహెచ్సీల్లో నాడు, నేడు పనులు, కొత్త పీహెచ్సీల నిర్మాణం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు తదితరాలపై సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికపుడు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పీహెచ్సీల్లో జరిగే వైద్యుల నియామకాల్లో మహిళా వైద్యులకు ప్రాధాన్యమిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరోగ్యశ్రీ హెూర్డింగ్స్ పెట్టాలని సీఎం జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. ఆరోగ్య మిత్ర ఫోన్ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. రిఫరల్ ఆసుపత్రుల వివరాలను కూడా అందజేయడం జరుగుతోందన్నారు. కరోనా థర్డ్వేవు దృష్టిలో పెట్టుకుని అన్ని ముందస్తు ఏర్పాట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కూడా వేగవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చుండూరి శేఖర్, శరత్ చంటి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE