Suryaa.co.in

Political News

సీఎం జగన్‌ రాజకీయ నాయకుడు కాదు..రాజనీతిజ్ఞుడు, ఆర్థిక మేధావి..

(వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్)

జగన్ అంటే ఆయన ఒక్కడే కాదు కోట్లాది మంది జనం. జగన్ అడుగేస్తే ఆయన ఒక్క అడుగే కాదు ఆ అడుగులో అడుగేసే కోట్ల అడుగులు. జగనిన్నాదం ఒక్క గొంతుకు కాదు కోట్ల గొంతుకలు. ఈ నినాదాలు ఇప్పటివి కాదు..ఈ మాటలు..పదాలు ఇప్పటివి కాదు..!. నల్లకాల్వ సాక్షిగా పుట్టిన నినాదాలు, పదాలు. నల్లమల నల్లకాల్వ సాక్షిగా ఆ శివుడే తెలుగు ప్రజలకు ఓ నాయకుడ్ని ఇచ్చాడేమో..!.

“మా నాన్న నాకు ఓ పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు” అన్న జగన్‌ మాటలు తెలుగు లోగిళ్లలో మారుమోగాయి. ఆ నినాదాలు ఇప్పటికీ తెలుగు నాట ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రెండు చేతులు ఎత్తి దండం పెడుతూ నల్ల కాల్వ దగ్గర వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఆయనలోకి నాయకుడ్ని పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆయన వెనుదిరిగి చూసింది లేదు. నల్ల కాల్వ దగ్గరపడ్డ అడుగులు శతాబ్దం పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా తొక్కేశాయి.

కమిట్మెంట్ అంటే ఎలా ఉంటుందో నేటి రాజకీయ నాయకులు, రాజకీయాల్లోకి రావాలి అనుకునేవారు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలి. ‘ఇచ్చిన మాట కోసం’ కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చిన సీఎం వైఎస్ జగన్ ఆ మాటనే శాసనంగా చేసుకుని పాలన చేస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు కుట్రల కత్తులనుఎదుర్కొంటూనే ముందుకు సాగుతున్నారు. ఒక్కడిగా ఒకే ఒక్కడిగా నల్ల కాల్వ సాక్షిగా మొదలైన పయనం ప్రజాసేవలో ముందుకు సాగుతూనే ఉంది.

నాయకుడంటే స్ఫూర్తిని నింపేవాడు. నాయకుడంటే నేనున్నాని భుజం తట్టేవాడు. ఈ లక్షణాలు పుష్కలంగా ఉన్న నేత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. పాదయాత్రతో ఆయన పాదాలు ప్రతి పల్లెను ముద్దాడాయి. కృష్ణా, గోదారమ్మ నీళ్లు ఆయన పాదాలను తాకి వెళ్లాయి. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర ప్రజాగొలుసును ఏర్పాటు చేసింది.

అభిమానపు వంతెనలు నిర్మించింది. ప్రజలు రావాలి జగన్ ..కావాలి జగన్ అంటే నేనున్నానని కోట్ల మంది ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో ప్రజల మనసును అర్థం చేసుకోవడం కాదు, వారి మనసును అక్షరాలా చదివిన నాయకుడు సీఎం జగన్. అందుకే..ఆయన మేనిఫెస్టో లో రాజకీయ వాగ్దానాలు ఉండవు. ప్రజాసంక్షేమం, అభివృద్ధి మాత్రమే వైఎస్‌ఆర్ సీపీ మేనిఫెస్టోలో కనిపిస్తోంది.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర మొదలు పెట్టిన డే వన్‌ నుంచి ఆయను ఫాలో అవుతున్నాను. ఆయన కచ్చితంగా ప్రజల మెచ్చిన నాయకుడు అవుతాడని అంచనా వేశాను. నా అంచనాలు ఎక్కడా తప్ప లేదు. నా అంచనాలకు మించి ఆయన ఆలోచనలు పాలనా రథాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఆ పాలన రథ చక్రాలు కింద ప్రత్యర్ధులు చితికి నలిగిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం.

వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డిని కాంగ్రెస్ నుంచి దూరం చేశాం. ఇక జగన్‌ను ఈజీగా నలిపేయవచ్చునని చంద్రబాబు అండ్ కో కలలు కనడమే కాదు సంబరాలు కూడా చేసుకున్నారు. సోనియా గాంధీతో కుమ్మక్కై కుట్రలకు ప్రాణం పోశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేయాలనే కుట్ర చంద్రబాబు సాక్షిగా టెన్‌ జన్‌పథ్‌లో ప్రాణం పోసుకుంది. ఇంకేముందీ..లోటస్‌పాండ్‌లోని నివాసంలో సీబీఐ దాడులు, సాక్షి హెడ్ ఆఫీస్‌లో సీబీఐ ఎక్స్‌ట్రాలు. ఒకటా..రెండా చంద్రబాబు డైరక్షన్‌లో టెన్‌జన్‌ పథ్ కనుసన్నల్లో కుట్రలు పదును తేలుతున్నాయి.

కానీ…ఆ మోమొ మీద, ఆ పెదాల మీద చిరు నవ్వు చెరిగిపోలేదు.కానీ..మనసులో ఎక్కడో బాధ. ఆ బాధ ముఖంలో కనిపిస్తుంది. కానీ..తాను కూడా భయపడితే తనను నమ్ముకున్నవారు ఏమైపోతారని దానిని కూడా కనిపించకుండా..కోట్ల కుట్రలను ఎదుర్కొంటూ చిరు నవ్వుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చేవారు జగన్. తాను కష్టాల్లో ఉండి..ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పేవారు. ఇక్కడే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలోని నాయకత్వ లక్షణాలను ప్రజలు ప్రత్యక్షంగా చూశారు. తమ నాయకుడే అని మౌనంగా తమ గుండెలు సాక్షిగా తమ మనసులో నినదించుకున్నారు. ఆ రోజున కోట్ల మంది ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వకండా మాటే శాసనంగా పాలన చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.

చంద్రబాబు అండ్ కోకు కుట్ర రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య. తమ అడ్డు అనుకుంటే మనషులనే లేకుండా చేస్తారు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో చంద్రబాబు అండ్ కో లిస్ట్‌లో చాలా మంది బాధితులు ఉన్నారు. పదవులే ముఖ్యం ప్రజలు ముఖ్యం కాదు అనుకునేవారితో వైఎస్ జగన్ దశాబ్దం పోరాటం చేశాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ మీద హత్యాయత్నం జరిగినప్పుడు కోట్ల గుండెలు రగిలిపోయాయి.

కానీ..ఎక్కడా తొందర పడలేదు. భవిష్యత్తును అంచనా వేసుకుంటూ జగనన్నతో అడుగులు ముందుకు వేశారు. తమ కసిని, కోపాన్ని ఓటు రూపంలో చూపించి పచ్చ రాక్షసులకు పాతరేశారు. కానీ…పచ్చ కుట్రలు బుసలు కొడుతూనే ఉన్నాయి. ఏ మూలనో ప్రాణం పోసుకుంటూనే ఉన్నాయి. ఈ మధ్య వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ చంద్రబాబు అన్న మాటలు ” గాలిలోనే వస్తాడు..గాలిలోనే పోతాడు”అన్న మాటలు ఈజీగా తీసుకోకూడదు. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2014-19 మధ్య పచ్చ నేతలు రాష్ట్రాన్ని ఎంత మేయాలో అంత మేసేశారు. సీఎంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.వంద కోట్లే ఉంచారంటే వారి పైశాచిక ఆనందాన్ని అర్ధం చేసుకోవచ్చు. జగన్ ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టవని టీడీపీ నేతలు చేసిన కామెంట్లు వారిలోని రాక్షసానందానికి నిదర్శనం. నాడు అప్పులు పుట్టవని నవ్వుకున్నవారే..అయ్యో ఇప్పుడు లక్షలకోట్లు అప్పులు తెస్తున్నాడని, ఆ డబ్బులు ప్రజలకు పంచుతున్నాడని గుండెలు బాదుకుంటున్నారు.

నాలుగు పేజీల మేనిఫెస్టోతో ఇప్పటికే చంద్రబాబును నామరూపల్లేకుండా జగన్ చేయగలిగాడు. స్వాతంత్ర్య భారత దేశంలో అభివృద్ధికి నిజమైన నిర్వచనం చెప్పిన పాలకుడు. అభివృద్ధి అంటే రోడ్లుకాదు, అభివృద్ది అంటే బిల్డింగ్‌లు కాదు అభివృద్ధి అంటే ప్రజల గడప దగ్గరకు పాలన. అభివృద్ధి అంటే ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో సచివాలయం. అభివృద్ది అంటే వ్యవసాయ శాస్త్రవేత్తే రైతు దగ్గరకు వెళ్లడం. అభివృద్ధి అంటే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం. అభివృద్ది అంటే కరోనా కాలంలో కూడా పారిశ్రామిక విప్లవం. అభివృద్ధి అంటే విద్యా, వైద్య రంగాల్లో సంపూర్ణ విప్లవం. అభివృద్ది అంటే గ్రామాల్లో గేదెలు, ఆవులు గిట్టెల చప్పుళ్లు.
అభివృద్ధి అంటే సౌకర్యాల్లో పట్టణాలకు అనుగుణంగా పల్లెలను తీర్చిదిద్దడం. అభివృద్ధి అంటే పక్క రాష్ట్రాల అధికారులు, మంత్రులు మన రాష్ట్రంలో పర్యటించి ..వారి రాష్ట్రంలో అమలు చేయడం. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో ఇవన్నీ జరుగుతున్నాయి. కోవిడ్ ను ఎదుర్కొన్న తీరు, దేశ ప్రధానికే సలహాలు ఇచ్చిన తీరు ఆంధ్రులు గర్వించదగ్గవి. అందుకే..నీతి అయోగ్ నుంచి పీఎంవో వరకు వైఎస్ జగన్‌ పాలన భేష్ అంటున్నారు.

చరిత్ర చేసిన తప్పిదాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేయాలని అనుకోవడం లేదు. అందుకే ..అధికార వికేంద్రీకరణ తెర మీదకు తెచ్చారు. శ్రీ బాగ్ ఒప్పందాన్ని గౌరవించడం అంటే మన పెద్దల ఆలోచనలు, ప్రాంతాల అభిప్రాయాలను గౌరవించడం. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇదే చేస్తున్నారు. చంద్రబాబు అండ్ కో అబద్ధపు ప్రచారం చేస్తున్నట్లు అమరావతి నుంచి రాజధాని తరలి వెళ్లడం లేదు.
మూడు రాజధానుల్లో ఒక్కటిగా అమరావతి ఉంటుంది. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనేదే సీఎం జగన్ ఆలోచన. ఆ దిశగానే సీఎం వైఎస్ జగన్ ఉక్క సంకల్పంతో అడుగులు వేస్తున్నారు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కొందరు ఆటలు ఆడుతున్నప్పటికీ..ప్రజలు సీఎం జగన్‌ వైపే ఉన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన, నిర్ణయంలో నీతి,నిజాయితీ, న్యాయం ఉన్నాయి. చంద్రబాబు నిర్వహించిన తిరుపతి సభ పొలిటికల్ కిచిడీ సభ.

ఈ రోజున ఆంధ్రుల గుండెల గుడిలో కొలువై ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. ఆయన సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాల సీఎంల టేబుళ్ల మీదకు వెళ్లాయి. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలు పంచుకోమని, ఆయన బాటలో నడవమని ఇతర రాష్ట్రాలకు పీఎంవో,నీతి అయోగ్ సలహాలు ఇస్తున్నాయి. ఇవన్నీ ఒక్క రోజులో సాధ్యం కాలేదు. ఈ ప్రశంసలు వెనుక కోట్ల కుట్రలను ఎదుర్కొన్న కష్టాలున్నాయి. ప్రజల కోసం చేసిన అంతులేని ఆలోచనలున్నాయి. అందుకే..ఈ ప్రశంసలు, ఈ విజయాలు. తెచ్చిన ప్రతి పైసాకు, పంచిన ప్రతి పైసాకు లెక్క చెప్పే దమ్ము సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉంది. లెక్కలు చెబుతుంటే వినే ధైర్యం ప్రతిపక్షాలకు ఉందా..?.

ఆనాడు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్న మాట “మా నాన్న అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు” ఈ రోజున ఆ అతి పెద్దకుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. కరోనా నియంత్రణలో ఏపీని టాప్‌ 3 రాష్ట్రాల్లో నిలిపారు. పెట్టుబడులు తీసుకురావడంలో, ఎగుమతులు చేయడంలో రాష్ట్రాన్ని దేశంలోనే టాప్‌లో నిలిపారు. కరోనా సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఇవన్నీ చూసిన తరువాత సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిలో రాజకీయ నాయకుడు కాదు, రాజనీతిజ్ఞుడు, ఆర్థిక వేత్త కనిపించారు. అందుకే..మరో మూడు దశాబ్దాలు ఏపీలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి తిరుగుండదు. ఆయన పాలకుడు కాదు ప్రజాసేవకుడని నిరూపించుకున్నారు .ప్రజలు ఇదే నమ్ముతున్నారు.

LEAVE A RESPONSE