– అమరావతిపై హైకోర్టు తీర్పు మహిళా రైతుల విజయం
– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ
జై అమరావతి. జైజై అమరావతి. అమరావతిపై హైకోర్టు తీర్పు మహిళా రైతుల విజయం. న్యాయస్థానమంటే దేవస్థానమని మరోసారి రుజువైంది. మహర్షి, కర్మయోగి అయిన చంద్రబాబు మొదలుపెట్టిన అమరావతి యాగానికి న్యాయదేవత ఊపిరి పోసింది. ఆనాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అమరావతి అంటే మరణం లేనిదని నామకరణం చేశారు. ప్రపంచంలోనే ఎక్కడా జరగని ఉద్యమమిది.
ఏనాడు ఇల్లు దాటి బయటకు రాని మహిళలు అమరావతి కోసం 807 రోజుల పాటు సుదీర్థంగా ఉద్యమం చేసి ప్రపంచమంతా తమ వైపు చూసేలా చేసి న్యాయాన్ని గెలిపించుకున్నారు. కరోనాను లెక్కలేయలేదు. పండుగ లేదు. శుభకార్యం లేదు. విరామం లేకుండా పోరాడారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు మహిళల పొత్తికడుపులపై కొట్టారు. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడ్డారు. స్టేషన్ కు లాక్కెళ్లారు. తాళిబొట్లు తెంచేశారు. 189 మంది రైతులను పొట్టనపెట్టుకున్నారు. అమ్మవారికి నైవేధ్యం తీసుకెళ్తుంటే నేలపాలు చేశారు.
అయినా మొక్కవోని దీక్షతో పోరాడిన మహిళా రైతులకు విజయం దక్కింది. బెజవాడ దుర్మమ్మ తల్లి న్యాయదేవత రూపంలో వచ్చి తీర్పునిచ్చింది. జగన్ అరాచక పాలనకు చరమగీతం పలికేలా తీర్పు వచ్చింది. నిన్నటివరకూ అమరావతిలో చావు డప్పులే వినిపించాయి. నేడు అంబరాలు మిన్నంటాయి. అమరావతిపై తీర్పునిచ్చిన న్యాయదేవతకు తెలుగుదేశం పార్టీ సాష్టాంగ నమస్కారం చేస్తోంది. ఇంత జరిగినా చేసిన తప్పు తెలుసుకోకపోగా వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.
జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఒక్కరైనా సెంటు భూమికానీ, రూపాయి డబ్బులు కానీ ఇస్తే నా రాజకీయ జీవితం వదిలేస్తా. చంద్రబాబు ని నమ్మ 34 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. 2 లక్షల కోట్ల ఆదాయానికి చంద్రన్న శ్రీకారం చుడితే తన అసమర్థ చర్యలతో జగన్ రెడ్డి మొత్తం నాశనం చేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతున్నారు. ప్రాంతాల మధ్య విధ్వేషాలు రగిల్చారు. వైసీపీ నేతలు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది చంద్రబాబు.
ఉత్తరాంధ్రలో ఐటీని డెవలప్ చేశారు. చంద్రబాబు దేశ విదేశాలు తిరిగి ఎంతో శ్రమించి విశాఖకు తీసుకొచ్చిన అదానీ సెంటర్, లూలూ గ్రూప్ ను తరిమేశారు. మిలీనియం టవర్స్ ను స్మశానం చేశారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి వైజాగ్-చెన్నై కారిడార్ ను పక్కన పెట్టేశారు. ఇన్ని చేసి ఏమీ ఎరగనట్టుగా 13 జిల్లాల అభివృద్ధిపై వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు, చెవాకులు పేలుతున్నారు.
రాయలసీమను రతనాల సీమగా చంద్రబాబు తీర్చిదిద్దారు. శ్రీ సిటీ, కియా, మెగా సీడ్ పార్క్, సోలార్ పవర్ ప్లాంట్, హీరో ప్లాంట్స్ , హెచ్ సీఎల్ సహా ఎన్నో పరిశ్రమలు తెచ్చారు. చంద్రబాబు గారు మహానుభావుడు. మూడేళ్ల వైసీపీ పాలనలో విధ్వంసాలు సృష్టించి శునకానందం పొందారు. ప్రజావేదిక, ఐకానిక్ బ్రిడ్జ్ కూల్చేశారు. టీడీపీ కార్యాలయం ధ్వంసం చేశారు. బడుగు, బలహీన వర్గాలవారు ప్రాతినిధ్యం వహించే 15 నియోజకవర్గాల మధ్యలో అమరావతి ఉందనే విషయం వైసీపీ నేతలు మర్చిపోయారు. అమరావతిపై విషం కక్కారు.
అమరావతి శ్మశానం, ఎడాది , రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెయిడ్ ఆర్టిస్టులు అని అవహేళనగా మాట్లాడారు. మూడు రాజధానులు సరికాదని చట్టసభ సాక్షిగా చంద్రబాబుగారు నమస్కారం పెట్టి చెప్తే జగన్ రెడ్డి వెటకారంగా నవ్వారు. చంద్రబాబు పాలనపై ఉన్న నమ్మకంతో రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. కానీ అమరావతిపై వైసీపీ నాయకులు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్లేందుకు రాజధాని రైతులు చేపట్టిన న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్రకు ఆటంకాలు సృష్టించి రాక్షసానందం పొందారు.
వారికి తిండి లేకుండా చేశారు. పాదయాత్రలో వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ఉన్నా కనికరం లేకుండా వ్యవహరించారు. జగన్ రెడ్డీ…నువ్వు ముఖ్యమంత్రివా లేక మట్టిగడ్డవా? అమరావతి రైతులపై అక్రమంగా పెట్టిన 3,852 కేసులు ఎత్తివేయాలి. అమరావతి కోసం అశువుల బాసిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందించాలి. న్యాయదేవత ఇచ్చిన తీర్పును వైసీపీ నేతలు గౌరవించాలి.
అమరావతిపై చేసిన విష ప్రచారానికి వైసీపీ నేతలు చెంపలేసుకుని మహిళా లోకానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఇంత జరిగినా వైసీపీ నేతలు బుద్ధి తెచ్చుకోకపోతే యావత్ ఆంధ్ర రాష్ట్ర మహిళా లోకం ఆగ్రహానికి గురికాక తప్పదు.