Suryaa.co.in

Political News

ఉమ్మడి పౌర స్మృతి.. రాజ్యాంగం కన్న స్వప్నం!

– పౌరులందరికీ ఒకే స్మృతి ఉండాలని అంబేద్కర్ స్పష్టంగా వాదించారు
– అన్ని మతాల వారు చట్టం ముందు సమానులే అయినప్పుడు మాత్రమే, ఈ లౌకిక రాజ్యం ఆచరణ సాధ్యం
– ఎవరివి ఓటు బ్యాంకు రాజకీయాలు?
– ఎవరు ప్రజలను మతాలవారీగా విభజిస్తున్నట్లు ?

దేశంలో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి) పేరిట ప్రజలను రెచ్చగొట్టడాన్ని మనం గమనిస్తున్నాం. ఒక్కొక్క వర్గానికీ ఒక్కో చట్టం అమలులో ఉండడం సరైంది కాదు. ఒక కుటుంబ సభ్యుడికి ఒక చట్టం, మరో కుటుంబ సభ్యుడికి మరో చట్టం ఉంటే ఇల్లు ఎలా నడుస్తుంది?

దేశం ఎన్నాళ్లీ ఈ ద్వంద్వ విధానాలను సహించాలి? అందరికీ సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది కదా.. అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భోపాల్ లో అన్నారు. భారతీయ జనతా పార్టీ బూతు స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడానికి, చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. మోదీ పౌరస్మృతి గురించి పార్టీ వైఖరిని మాత్రమే స్పష్టం చేశారు కానీ కొత్తగా చెప్పిందేమీ లేదు.

బిజెపి ఉమ్మడి పౌర స్మృతిని గత కొన్ని దశాబ్దాలుగా సమర్థిస్తూనే ఉన్నది. 1998, 2019 ఎన్నికల మేనిఫెస్టోల్లో బిజెపి ఈ అంశాన్ని చేర్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్ లో 370 అధికరణ రద్దుతో పాటు.. దేశమంతటా యుసిసిని అమలు చేయాలని బిజెపి ఏనాటినుంచో చెబుతూ వస్తోంది. 2014లో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడు అంశాలపై దృష్టి కేంద్రీకరించారు.

దాని ఫలితంగా అయోధ్యలో రామమందిర నిర్మాణం సఫలీకృతమైంది. కశ్మీర్ లో 370 అధికరణను రద్దు చేశారు. ఇక మిగిలింది ఉమ్మడి పౌర స్మృతి మాత్రమే. అందుకే ప్రజలకు బిజెపి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని, మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉండడంలో ఆశ్చర్యం లేదు.

ఉమ్మడి పౌర స్మృతి రాజ్యాంగం కన్న స్వప్నం. రాజ్యాంగ అసెంబ్లీలో బాబా సాహెబ్ అంబేద్కర్ పౌరులందరికీ ఒకే స్మృతి ఉండాలని స్పష్టంగా వాదించారు.కెఎం మున్షీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ కూడా ఈ దిశలో తమ వాదనలు వినిపించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల ప్రకారం 44వ అధికరణ క్రింద దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతిని అమలుచేయాలని స్పష్టం చేశారు.

కానీ కాంగ్రెస్ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. హిందూ ముస్లింలను వేరు చేయాలనే బ్రిటిష్ వారి విభజించు పాలించు సిద్దాంతాన్ని, కాంగ్రెస్ అనుసరించి ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంది. స్వాతంత్ర్యం తర్వాత హిందువులు, బౌద్దులు, జైనులు, సిక్కు మతస్తులకు వర్తింపచేసేందుకు చట్టాలు చేసినప్పటికీ కైస్తవులు, ముస్లింలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

1985లో షాబానో కేసులో పౌరులందరికీ వారి మతపరమైన కార్యకలాపాలతో సంబంధం లేకుండా కొన్ని హక్కులు సార్వత్రకంగా ఉండాలని, చట్టాలన్నీ అందరికీ సమానంగా వర్తింపచేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ అంశం తెర ముందుకు వచ్చింది. భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులను సంరక్షించాలన్న విషయంలో దేశంలో ఉన్న పౌరులందరికీ వారి మతంతో ప్రమేయం లేకుండా అఖిల భారత క్రిమినల్ కోడ్ నిబంధనలు వర్తిస్తాయని సుప్రీం స్పష్టం చేసింది.

అంతేకాక సార్వత్రక పౌర స్మృతిని అమలు చేయాలని ఆదేశించింది.కానీ షాబానో కేసులో సుప్రీం తీర్పును రద్దు చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేసింది. ముస్లింల జీవితాలను అఖిలభారత పర్సనల్ లా బోర్డు అనే ప్రైవేట్ సంస్థ కు కాంగ్రెస్ వదిలి వేసి, వారి మత భావోద్వేగాలను తమ రాజకీయాలకు ఉపయోగించుకుంది.

మనం భారత దేశాన్ని లౌకిక రాజ్యంగా చెప్పుకుంటాం.అన్ని మతాల వారు చట్టం ముందు సమానులే అయినప్పుడు మాత్రమే, ఈ లౌకిక రాజ్యం ఆచరణ సాధ్యం అవుతుంది. బహుభార్యాత్వం ఒక మతస్తులకు కూడదని చట్టం చేసినప్పుడు ఇతర మతస్తులకు ఆ విషయంలో ఎందుకు స్వేచ్చనీయాలి? తల్లిదండ్రుల ఆస్తి పొందే విషయంలో కొడుకు, కూతురుకు సమాన హక్కులుండాలనే నిబంధన అందరు మతస్తులు ఎందుకు పాటించకూడదు?

మత పరమైన సంప్రదాయాలు, పూజా విధానాలు, పద్దతులు, ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేకుండా అన్ని మతాలవారు మానవ విలువలను సమానంగా పాటించడం ఆధునిక సమాజంలో అత్యావశ్యకం. ఒక వర్గం ఆధునికంగా, ప్రగతిశీలంగా ఎదుగుతూ పోతుంటే మరో వర్గం అనాగరిక,ఆటవిక పద్దతులను అనుసరిస్తుండడం సరైనదేనా? ఇవాళ సమాజంలో ఎవరు వెనుకబడి ఉన్నారో స్పష్టంగా తెలుస్తోంది.

మీరు నిజంగా ముస్లింల సంక్షేమం గురించి పట్టించుకుని ఉంటే, వారు విద్య, ఉపాధి రంగాల్లో వెనుకబడి ఉండేవారు కాదు, అనేక కష్టనష్టాలను భరిస్తూ ఉండేవారు కాదు అని ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పారు
సుప్రీంకోర్టు షాబానో కేసులోనే కాదు, ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ విషయం స్పష్టం చేసింది.

ఎక్కువమందిని పెళ్లి చేసుకునేందుకు ఇస్లాంలోకి మారడాన్ని సుప్రీంకోర్టు 1995 సరళా ముద్గల్ కేసులో నిషేధించింది. ఉమ్మడి పౌర స్మృతి ఉంటే ఇలాంటి దుష్పరిణామాలు ఆగిపోతాయని, ప్రజలను మార్పును అంగీకరించే దిశలో చైతన్యపరచాలని సుప్రీం స్పష్టం చేసింది.

ప్రాథమిక హక్కులు, స్త్రీపురుష సమానత్వం, గౌరవంగా జీవించే హక్కుకు అనుగుణంగానే మతపరమైన స్వేచ్చ ఉండాలని సుప్రీంకోర్టు 2018లో భారత యువ న్యాయవాదుల సంఘం కేసులోస్పష్టం చేసింది. ప్రజల ప్రాథమిక హక్కులకూ, వ్యక్తుల మతసంప్రదాయాలకూ సంఘర్షణ ఏర్పడినప్పుడు ప్రాథమిక హక్కులకే ప్రాధాన్యత నీయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

అంతేకాదు,ఏ మతం వారీ తమ ఇష్టానుసారం వ్యవహరించే హక్కు లేదని, అటువంటప్పుడు చట్టాలు,న్యాయస్థానాలు ఎందుకని సుప్రీం 2015లో స్పష్టం చేసింది. విడాకులు, వారసత్వం, దత్తత, సంరక్షణ తదితర అంశాల విషయంలో ప్రజలందరికీ సమానమైన హక్కులు ఎందుకు ఉండకూడదు అని సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

రాజ్యాంగం ప్రజలందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలని నిర్దేశించిందని, ఈ అంశంపై 22వ లా కమిషన్ కు నివేదిస్తామని ప్రభుత్వం 2022 అక్టోబర్ లో సుప్రీంకోర్టుకు నివేదించింది. అయినప్పటికీ గత మూడేళ్లుగా సుప్రీంకోర్టు ప్రజల మత హక్కులు,వ్యక్తిగత చట్టాల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నది.

శబరిమల కేసు విషయంలో ప్రజల మత పరమైన స్వేచ్చ గురించి అనేక అంశాలు తెరమీదకు వచ్చాయి. చివరకు 22వ లా కమిషన్ ఉమ్మడి పౌర స్మృతిపై ప్రజల అభిప్రాయాలను ఆహ్వానిస్తూ నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ అసెంబ్లీ చర్చలు, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు, సుప్రీంకోర్టు పలు సార్లు తీర్పులు ఇచ్చిన విషయాన్ని మనం విస్మరించలేము. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉన్నది.

దుర్మార్గ మేమంటే, కాంగ్రెస్ పార్టీ ముస్లింలను వెనుకబాటుతనంలో ఉంచడం ద్వారా, వారిని తమ ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకోవడం. ముస్లింలకు రిజర్వేషన్లు, హజ్ యాత్రకు నిధులు వంటి తాయిలాలు ఇస్తూ బుజ్జగింపు రాజకీయాలు అమలు చేయడం, ముస్లిం వ్యక్తిగత చట్టాలకు మద్దతు నిస్తూ రాజ్యాంగాన్ని పార్లమెంట్ సాక్షిగా తుంగలో తొక్కడం, గోవధ నునిషేధించకపోవడం, పెరుగుతున్న ముస్లిం జనాభా పై హిందువుల ఆందోళనను విస్మరించడం, రామజన్మభూమి ఉద్యమాన్ని విస్మరించి, హిందువులను అణిచివేయడం, దేశ ద్రోహ చర్యలకు పాల్పడిన సంస్థల్ని విస్మరించడం వంటివి అనేక ఉన్నాయి.

ఇవంతా ఒక ఎత్తు అయితే భారతదేశంలో పాలన రాజ్యాంగంలో వ్రేళ్లూనుకుని ఉన్నది, ఏ మత గ్రంథంలో లేదని కూడా కాంగ్రెస్ గ్రహించలేకపోయింది. రాజ్యాంగంలో నిర్దేశించినట్లు మతంతో నిమిత్తం లేకుండా అందరూ సమానమే అయినప్పటికీ, ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించడంలో కాంగ్రెస్ విఫలమైంది.

నరేంద్రమోదీ ప్రభుత్వం మతంతో నిమిత్తం లేకుండా ప్రజలందరూ తమ హక్కులను సమానంగా అనుభవించేలా చూసేందుకు కృతనిశ్చయంతో ఉన్నది. అందుకే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ప్రసాదించేందుకు కృషి జరుగుతునే ఉన్నది. అందులో భాగంగానే ఆయన ముస్లిం మహిళలను త్రిపుల్ తలాఖ్ సంప్రదాయం నుంచి విముక్తి చేశారు.

కేవలం మూడు సార్లు తలాఖ్ అంటే భార్యను వదిలించుకునే దుష్ట సంస్కృతి నుంచి ఆయన కోట్లాది మంది అభాగ్య ముస్లింలను సంరక్షించారు. రాజ్యాంగం, ప్రజాస్వామిక సూత్రాలవిషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడే ప్రసక్తి లేదు. కానీ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సమాజ్ వాది పార్టీ, ఎంఐఎం, వైసీపీ, బిఆర్ ఎస్ లాంటిపార్టీలు ముస్లింల బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతూనే ఉన్నారు.
లా కమిషన్ ముందు ఈ పార్టీలు ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. లా కమిషన్ ఈ విషయం పరిశీలించడాన్నే కాంగ్రెస్ తప్పు పట్టింది. ఈ దేశంలోఎవరు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్లు? ఎవరు ప్రజలను మతాలవారీగా విభజిస్తున్నట్లు?

– వై. సత్యకుమార్ యాదవ్
(బిజెపి జాతీయ కార్యదర్శి)

LEAVE A RESPONSE