– ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమకారులు, సామాజిక, సాహితీరంగాలలో మేధావుల ప్రకటన
అమరావతి: కొత్త సినిమాల బెనిఫిట్ షోలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వానికి వివిధ ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమ కారులు, సామాజిక, సాహితీ రంగాలలో పలువురు మేధావులు అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో కొత్త సినిమాలు విడుదల సందర్భంగా నిర్మాతలు బెనిఫిట్ షోల ద్వారా ప్రజల నుంచి డబ్బుని విచ్చల విడిగా కొల్లగొడుతున్నారని బుధవారం వారు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
ఈ అడ్డగోలు దోపిడీకి అడ్డు కట్ట వేసిన తెలంగా ణ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత మైనచర్య ఎంతైనా హర్షించ దగిందని పేర్కొన్నారు. ఒకనాడు సినిమా హాల్ బైట, అసలు రేటు కంటే ఎక్కువ ధరకు టికెట్లు అమ్మే వాళ్లను బ్లాక్ టికెట్లు అమ్మిన నేరం కింద పోలీసులు అరెస్టు చేసే వాళ్లు, నేడు నిర్మాతలు పబ్లిక్ గా, ఏ అదురు..బెదురూ లేకుండా దర్జాగా చాలా ఎక్కువ రేట్లకు బ్లాక్ టికెట్స్ అమ్ముకోవడానికి, ప్రభుత్వాలు అనుమతులివ్వటం ఎంత మాత్రం సమర్ధనీయం కాదన్నారు.
ఎవరైనా ఉదార స్వభావులైన నిర్మాతలు బెనిఫిట్ షోల ద్వారా వచ్చే సొమ్మును, ప్రజల అవసరాల కోసం వినియోగించ డానికి పూనుకుంటే, అటువంటి ప్రజా ప్రయోజన కార్యా న్ని ఎవరూ ఆక్షేపించరన్నారు. అటువంటి సేవా కార్యక్రమాన్ని తాము కూడా సమర్ధిస్తామని తెలిపారు. సినిమా అనేది ప్రజల ఆలోచనలను మంచి వైపు గానీ, చెడు వైపు గానీ మళ్లించే ఒక శక్తి వంతమైన ఆయుధమని, ఆ శక్తి వంతమైన ఆయుధం ఈనాడు ప్రజలను, ముఖ్యంగా యువతను చెడు వైపు మళ్ళేలా చేయటం చాలా అవాంఛనీయమని పేర్కొన్నారు. నేడు నూటికో కోటికో ఒకటి అర తప్ప, మిగిలిన అన్ని సినిమాలు సమాజం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండా, మితి మీరిన స్వార్ధమే పరమావధిగా రావటం ఎంతైనా శోచనీయమన్నారు.
ఒకనాడు సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోలు సినిమాను కేవలం లాభాలను ఆర్జించే వ్యాపార వస్తువుగా చూడలేదని, కుటుంబ సంబంధాలు,అనుబంధాలు – ఆత్మీయతలు, నైతిక విలువలు, అహింస, క్షమ, దయ, మానసిక పరివర్తన, పరోపకారం, మానవీయ భావనలు, దేశభక్తి, సంఘ సమైక్యత, మత సామరస్యం.. వంటి అనేక గొప్పవిషయాలను ప్రతిభావంతంగా సినిమాల్లో చూపించేవారని గుర్తు చేసుకున్నారు. నేటి నిర్మాతలు, దర్శకులు, హీరోలు అలనాటి సినిమా రంగం పాటించిన నీతిని, విలువలను, సమాజ క్షేమాన్ని అన్నిటిని ధ్వంసం చేయటమే పనిగా పెట్టుకుని, సినిమాలను రూపొందిస్తున్నారని మండిపడ్డారు.
సినిమాకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ముందు వారు కొన్ని అంశాలను ఉంచారు. సినిమాల్లో తీవ్రమైన హింస, అశ్లీలత, పచ్చి బూతు పాటలు, మాటలు, అంధ విశ్వాసాలు నివారించేందుకు సెన్సార్ బోర్డు సభ్యులకు సరైన మార్గ దర్శకం చేయాలని సూచించారు.
సెన్సార్ బోర్డు సభ్యులుగా ఎలాంటి వత్తిళ్ళకు లొంగని సామాజిక బాధ్యత గల మేధావులను, వివిధ ప్రగతిశీల సాంస్కృతిక ఉద్యమ కారులను, వివిధ సేవారంగ ప్రముఖులను నియమించాలని కోరారు. హీరోలు చట్ట విరుద్ధమైన, నేర స్వభావంతో సాగే కథాంశాలతో వచ్చే సినిమాలకు సెన్సార్ బోర్డు వారు ఎంత మాత్రం అనుమతి ఇవ్వకూడదని హితవు పలికారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బెన్ఫిట్ షోలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో మానవ వికాస మండలి కన్వీనర్ రేకా కృష్ణార్జునరావు, స్టెప్ (STEP) వ్యవస్థాపకులు డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు,ఓపీడీఆర్ ఆలిండియా అధ్యక్షుడు సి. భాస్కరరావు, అరసం ఏపీ అధ్యక్షులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ అబ్దుల్ నూర్ బాషా, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యారావు, లాల్ -నీల్ మైత్రి వేదిక ప్రతినిధి రేకా చంద్ర శేఖరరావు, అశ్లీలతా ప్రతిఘటనా వేదిక ఏపీ అధ్యక్షులు ఈదర గోపీ చంద్, ప్రజా వేదిక కన్వీనర్ కె.కుమార్ రెడ్డి, చైతన్య సాహితీ వేదిక కో- కన్వీనర్ గోలి మధు, సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు బొజ్జా భిక్షమయ్య, అడ్వకేట్ పాటి బండ్ల కోటేశ్వరరావు, సామాజిక ఆంధ్ర మహాసభ ప్రతినిధి చెముకుల సుధాకర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చిలువూరు నాగేశ్వరరావు, మహా జ్ఞాన సమాజం అధ్యక్షులు విశ్వనాథ్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి నాయకులు కంచర్ల కాశయ్య, విశ్వశాంతి కళా పరిషత్ కన్వీనర్ పొట్లాబత్తుని లక్ష్మణరావు, కవి, సాహితీ విమర్శకులు ఎ.రజాహుస్సేన్, కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి ప్రతినిధి బండారి లక్ష్మయ్య, మానవ హక్కుల వేదిక, సామాజిక కార్యకర్తలు మార్పు శరత్,ఆకురాతి సతీష్, కూరపాటి సాంబశివరావు, అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ప్రతినిధి లోకం భాస్కరరావు తదితరులు ఉన్నారు.