– మెట్రో రైల్‌ను మేడ్చెల్-శామీర్‌పేట వరకూ పొడిగించడంపై మంత్రి పొన్నం హర్షం
హైదరాబాద్: నూతన సంవత్సర కానుకగా శామీర్ పెట్,మేడ్చల్ వరకు మెట్రో మార్గాలను పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే గతంలో శామీర్ పేట వరకు మెట్రో ను పొడిగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయారు.
సుదీర్ఘ కాలంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు కరీంనగర్ , మెదక్ , నిజామాబాద్ , అదిలాబాద్ వైపు వెళ్లే వాహనాలు నగర శివారు వరకు నిత్యం ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే ఈ రూట్లలో ఇప్పటికే డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కి మంజూరు కావడం, తాజాగా తమ ఇబ్బందులు తొలిగేలా జేబిఎస్ నుండి శామీర్ పెట్ (22 కిలోమీటర్లు) , ప్యారడైజ్ నుండి మేడ్చల్ (23 కిలోమీటర్లు) వరకు మెట్రో మార్గానికి మెట్రో రైల్ ఫేజ్ -2 ‘బి’ భాగంగా డీపీఆర్ తయారు చేయాలని మెట్రో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో తమ ప్రాంత కష్టాలు తొలగనున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మెట్రో మార్గాన్ని శామీర్ పేట ,మేడ్చల్ వరకు పెంచడానికి డీపీఆర్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మెట్రో పూర్తయితే రాజధాని హైదరాబాద్ నగరం నుండి ఉత్తర తెలంగాణ జిల్లాలకు చాలా సమయం ఆదా అవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.