– వరద నీటి లభ్యత, అంత:రాష్ట్ర అంశాల పరిశీలన తరువాతే కేంద్ర నిర్ణయం
– మేం మొదటి నుండి చెప్పినదానికే కట్టుబడి ఉన్నాం
-మోదీ ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే
– ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి
– బనకచర్లతో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు
– విజ్ఝులైన తెలంగాణ ప్రజలు ఆ రెండు పార్టీలకు తగిన బుద్ది చెప్పడం తథ్యం
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: బనకచర్ల ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడినవన్నీ డ్రామాలేనని మరోసారి స్పష్టమైంది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF), భారత ప్రభుత్వం నిపుణుల అంచనా కమిటీ (EAC) ప్రాజెక్టు ప్రతిపాదకుడికి కొన్ని కీలక సూచనలు చేసింది.
ప్రాజెక్టుకు అవసరమైన వరదనీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలని, ఇందుకోసం కేంద్రీయ జల కమిషన్ (CWC)తో సంప్రదింపులు జరిపాలని సూచించింది. అంతేకాకుండా, ఇతర రాష్ట్రాలతో ఉన్న సంబంధిత అంత:ర్రాష్ట్ర అంశాలపైనా CWC పరిశీలన జరిపి, అవసరమైన అనుమతులు పొందిన తరువాతే పర్యావరణ ప్రభావ అధ్యయనానికి (EIA Study) నిబంధనల యొక్క టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను (TOR) రూపొందించే ప్రతిపాదనను EAC ముందు సమర్పించాల్సిందిగా సిఫార్సు చేసింది.
నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలూ సమానమే. నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
భారతీయ జనతా పార్టీ పక్షాన మొదటి నుండి మేం ఇదే చెబుతున్నాం. అయినా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి విష ప్రచారం చేశాయి. బనకచర్ల విషయంలో తెలంగాణకు బీజేపీ అన్యాయం చేస్తోందని నిన్నటిదాకా గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఈరోజు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో యూ టర్న్ తీసుకున్నాయి. కేంద్ర నిర్ణయం తమ విజయంగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటు.
మంచి జరిగితే తమదే క్రెడిట్ అంటూ జబ్బలు చరుచుకునే ఈ పార్టీల నేతలు… చెడు జరిగితే ఇతరులపై నెట్టేయడం అలవాటుగా మారింది. తెలంగాణ ప్రజలు విజ్ఝులు. అన్ని గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం తథ్యం.