– రాంచందర్ రావు నాయకత్వంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
– భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల వేడుకలో రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్
బిజెపి తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్. రాంచందర్ రావు కి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాంచందర్ రావు ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొంది, విద్యార్థి పరిషత్ నాయకుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో నాయకత్వం వహిస్తూ, బిజెపిలో గత 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఓ నిజమైన కార్యకర్త. ఇది ఒక కార్యకర్తకు దక్కిన గౌరవంగా భావించాలి.
బిజెపిలో నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ కోసం నిరంతరం కష్టపడిన నాయకులకే పెద్ద పదవులు లభిస్తాయి. ఇతర పార్టీల్లో నాయకులు పదవులను అనుభవించేందుకు వస్తారు; కానీ బిజెపిలో మాత్రం బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు బాధ్యతగా పనిచేయాల్సి ఉంటుంది.
రాంచందర్ రావు సీనియర్ అడ్వకేట్. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో అనేక కేసులు వాదించారు. జాతీయ స్థాయిలో బిజెపి లీగల్ సెల్ కో-కన్వీనర్‌గా కూడా పనిచేశారు.
నేను రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 200 ఓట్ల తేడాతో ఓడినప్పుడు, ఎంతోమంది ఎన్నికల పిటిషన్ వేయమన్నారు. అప్పుడు నేను ఆ బాధ్యతను రాంచందర్ రావు కే అప్పగించాను.చాలామంది అడ్వకేట్లు ఆశ్చర్యపడ్డారు. రాంచందర్ రావు క్రిమినల్ లాయర్, మరి సివిల్ పిటిషన్ ఎలా వాదిస్తారని.
రాజ్యసభలో కొంతమంది సీనియర్ లాయర్లు ఉదయం కోర్టుల్లో లక్షల్లో సంపాదించి, ఆ తర్వాత రాజ్యసభకు వచ్చి సంతకాలు పెట్టే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్లకు తమ వృత్తిపట్ల, సంపాదన పట్ల మాత్రమే శ్రద్ధ కనపడుతోంది, రాజ్యసభ సభ్యులుగా బాధ్యతపట్ల కాదు. కానీ రాంచందర్ రావు దేశం కోసం, సిద్ధాంతం కోసం, క్రమశిక్షణతో పార్టీలో కొనసాగుతున్నారు.
ఈరోజు బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన ఎన్నికయ్యారంటే, అది ఒక సంస్థాగత ప్రక్రియలో భాగం. నేను ఈ రోజు జాతీయ స్థాయి ఎన్నికల అధికారిగా ఉన్నానంటే నరేంద్ర మోదీ , జేపీ నడ్డా , అమిత్ షా , బీఎల్ సంతోష్ నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారు. మేము ఈ స్థాయికి చేరుకోవడం కార్యకర్తల కృషి వల్లే.
ఈ రోజున 8 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో 14 రాష్ట్రాల్లో పూర్తయ్యాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగిలిన 6 రాష్ట్రాల్లో కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల తర్వాత జాతీయ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియ జరగనుంది.
బిజెపి 14 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచింది. దేశవ్యాప్తంగా 10 లక్షలపైగా పోలింగ్ బూత్‌లలో 7 లక్షల కమిటీలు, 18 వేల మండల కమిటీల్లో 15 వేలపైగా పూర్తయ్యాయి. 1093 జిల్లా కమిటీల్లో 900 పూర్తయ్యాయి. 37 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి.
మిగతా పార్టీల్లో మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా ఎన్నికలు జరగడం లేదు. సభ్యత్వాలు జరిపే ప్రక్రియ లేదు. బిజెపిలో మాత్రం సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న 14 కోట్ల మంది ఎలాంటి తాయిలాలు లేకుండానే సభ్యులయ్యారు.
ఇతర పార్టీల్లో ఆరోగ్య బీమా, జీవిత బీమా పేరుతో సభ్యత్వాలు ఇవ్వబడతాయి. కానీ బిజెపిలో మాత్రం దేశం కోసం పని చేయాలనే భావనతో కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలో రాంచందర్ రావు నాయకత్వంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. గతంలో పదేళ్లు బీఆర్ఎస్ కి అధికారం ఇచ్చారు. కానీ కుటుంబ పార్టీగా, అవినీతి పార్టీగా మారిపోయి తెలంగాణను కొల్లగొట్టారు. కాంగ్రెస్ కూడా రాష్ట్ర సంపదను దోచి ఢిల్లీకి కప్పం కడుతోంది. ప్రజలు ఇప్పుడు మార్పు కోసం బీజేపీ వైపు చూస్తున్నారు.
బిజెపి అనేది సమిష్టి నాయకత్వంతో నడిచే పార్టీ. Team decides, President presides. బూత్ ప్రెసిడెంట్ కూడా రాష్ట్ర అధ్యక్షునిగా భావించి కృషి చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ కు బిజెపియే ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. గత 11 ఏళ్లుగా మోదీ అవినీతిరహిత, కుటుంబరహిత పాలన అందిస్తున్నారు. అలాంటి పాలనే తెలంగాణలో కూడా కావాలి.
మనం కొత్త, పాత అనే తేడాలు లేకుండా పార్టీలో చేరే ప్రతి ఒక్కరిని స్వాగతించడం జరుగుతుంది. రాంచందర్ రావు నాయకత్వంలో కలిసి పని చేయాలి. భగవంతుడు ఆయన్ను ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే క్రమంలో మనమంతా ఆయనకు అందరం అండగా నిలబడతాం.