మరో రెండు రోజుల్లో తెలంగాణ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు నడవ బోతున్నారు. వారు ఇప్పటికే, దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు…., ఎవరికి ఓటు వేయాలి అనే విషయం లో.
నిజానికి, ఓటర్ మనసులో ఏముందో కనుక్కోవడం అంత సులభం కాదు. వారు పైకి ఒకటి చెప్పినా…., వారి మనసులో ఏముందో తెలియదు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళేటప్పుడు ఒకటి అనుకుని ; బ్యాలట్ బాక్స్ కనపడే సమయం లో మరొకటి అనుకోవచ్చు. అందువల్ల, ఇప్పుడు సోషల్ మీడియా వీడియోల్లో మనం చూస్తున్న సర్వేలన్నీ కాకుల లెక్కలే.
పది పెద్ద జిల్లాలు ఉన్న ఒక రాష్ట్రం లో 119 నియోజక వర్గాలలో అతి తక్కువ సమయం లో ఒక సర్వే చేయాలంటే…. ఎంతమంది సర్వేయర్లు కావాలి? ఎంత మౌలిక సదుపాయాల యంత్రాంగం కావాలి? సోషల్ మీడియా లో ఏదో ఒక వీడియో చేసి, యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసే సోషల్ మీడియా యూ ట్యూబర్ల కు అన్ని వనరులు ఉన్నాయా?
మనకు గ్రామాల్లో రైతులు ఓసారి మబ్బులు పట్టిన ఆకాశం లోకి చూసి…. వర్షం వస్తుందా, రాదా చెబుతుండే వారు.ఈ సర్వేలూ అదే బాపతు.
అయితే, తెలంగాణ లో ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుంది అనే వాతావరణం మాత్రం కనిపించే విధంగా ఆ పార్టీ నాయకులు గొప్ప సమయనం పాటిస్తున్నారనే చెప్పాలి. కాంగ్రెస్ కు కాంగ్రెస్ నాయకులే ప్రధమ శత్రువులు అంటుంటారు. వాళ్ళ నోళ్లు అలాటివి.
ఈ సారి మాత్రం, వీ. హనుమంతరావు తో సహా, సీనియర్ నాయకులు ఎవరూ నోళ్లకు పని చెప్పలేదు. దీనికి తోడు, కర్ణాటక లో కాంగ్రెస్ మంత్రం పని చేసింది. దాంతో, తెలంగాణ లో కూడా కాంగ్రెస్ కు మంచి ఊపు వచ్చింది.
ఆ ఊపుకు రేవంత్ రెడ్డి దూకుడు, భట్టి విక్రమార్క ‘ పెద్ద మనిషి ‘ ఇమేజ్ తోడయ్యాయి.
మరో పక్క, కేసీఆర్ అహంభావ పూరిత వ్యవహార శైలి అనే ఊబి లో పీకల దాకా కూరుకు పోయిన బీ ఆర్ ఎస్ పార్టీ ని ఇనుప గొలుసులేసి ఒడ్డుకు లాక్కు రావడానికి కేటీఆర్, హరీష్ రావు విశ్వప్రయత్నం చేస్తున్నారనడం లో సందేహం లేదు.
బీ ఆర్ ఎస్ పై పైకి కనపడే మైనస్ లే అనేకం ఉన్నాయి. కనపడనివి బోలెడు ఉంటాయి. మొత్తం మీద,
1. పార్టీ పేరు ను టీ ఆర్ ఎస్ నుంచి బీ ఆర్ ఎస్ కు మార్చడం….
2. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం లో కవిత పేరు చాలా ప్రముఖం గా రావడం…..
3. ఆమెకు ఈ డీ, సీ బీ ఐ వాళ్ళు నోటీసులు ఇచ్చి, హడావుడి చేసి కూడా ఆమెను అదుపులోకి తీసుకోవడం….
4. ఆమె కూడా ఎన్నికల ప్రచారం లో పాల్గొంటూ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు చేయడం…
5. సిపిఐ, సిపిఎం పార్టీల సహకారం గతం లో మునుగోడు కోసం తీసుకుని, ఇప్పుడు గాలికి వదిలేయడం….
6. సర్వీస్ కమిషన్ పిల్లిమొగ్గలు….
7. ప్రతి పక్ష పార్టీల నేతలను ఏ దశ లోనూ ఏ అంశం పైనా విశ్వాసం లోకి తీసుకోక పోవడం,
8. ఎన్ని స్కీములు ప్రకటించినా, వాటి అమలు లో పారదర్శకత, చిత్తశుద్ధి, నిజాయతీ, ఫెయిర్ నెస్ జనానికి కనిపించక పోవడం,
9. అవసరం కోసం కేసీఆర్ ‘ అవసరం మాటలు ‘ మాట్లాడి, తరువాత అసలు పట్టించుకోక పోవడం…
బీ ఆర్ ఎస్ ప్రతిష్ట ను మసక బార్చాయి.
నిజానికి, కేటీఆర్…. హరీష్ రావు తమ తమ శాఖలలో అద్భుతం గా పని చేస్తున్నారు. వర్షాలు కురిసినప్పుడు ఏవో ఒకటి… రెండు దురదృష్టకర సంఘటనలు జరిగినప్పటికీ ; జంట నగరాలలో అభివృద్ధి స్టాంపు కనిపిస్తుంది.
కానీ, ప్రజలు నెగెటివ్ అంశాలకే ఎక్కువగా ఆకర్షతులు అవుతారు. దానిని కాంగ్రెస్ నేతలు బాగా క్యాష్ చేసుకున్నట్టు కనబడుతున్నది..
కాంగ్రెస్ లో లబ్ద ప్రతిష్టు లైన నేతలు అనేక మంది ఉన్నారు. వారు ఎవరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోలేదు. కాంగ్రెస్ కు వారు చేసిన ఉపకారం అది.
కేసీఆర్ పై ప్రజలలో కనిపిస్తున్న వ్యతిరేకతతో కాంగ్రెస్ అలెర్ట్ అయింది. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్ర గాంధీ, మల్లిఖార్జున ఖర్గే , కే సీ వేణుగోపాల్ కూడా తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మీడియా లో కూడా కాంగ్రెస్ అనుకూల ధోరణి కనిపించింది.
సాగినప్పుడు సాగించుకుంటే ; సాగనప్పుడు…. తాళ్ళు కూడా పాముల అవతారం ఎత్తుతాయి.
ఈ కారణాలు అనేకం నేపథ్యం లో, పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలం గా ఉన్నాయి అనే అభిప్రాయం ఒకటి తెలంగాణ ను కమ్మేసింది.
ఆకాశం లో కమ్మేసిన మబ్బులను చూసి, వర్షం గ్యారెంటీ అనుకుంటాం. చివరికి కురవ వచ్చు. మబ్బులు తేలిపోవచ్చు.
*అలాగే, రోడ్ మీద కనిపించే ‘ప్రజాభిప్రాయం (పబ్లిక్ పెర్సెప్షన్ )’ బాలట్ బాక్స్ దాకా వెళ్ళాలి.
* మాట్లాడే వాళ్లందరికీ ఓటు హక్కు ఉండక పోవచ్చు.
* ఉన్నప్పటికీ పోలింగ్ బూత్ కు వెళ్లలేక / వెళ్లక పోవచ్చు.
*ఒక గుర్తుపై బటన్ నొక్కబోయి, మరో గుర్తు పై నొక్కేయవచ్చు.
*నోటా కు గణనీయమైన సంఖ్య లో ఓట్లుబడి , గెలిచే వారు ఓడిపోవచ్చు….. లేదా, ఓడిపోతారు అనుకునే వారు గెలవ వచ్చు.
* కాంగ్రెస్ లో దాదాపు 30 మంది అభ్యర్థులు మొదటి సారి పోటీ చేస్తున్నారు. అందువల్ల, పోల్ మేనేజ్ మెంట్ కు వారు కొత్త.
* బీ ఆర్ ఎస్ లో దాదాపు గా అందరూ పోల్ మేనేజ్ మెంట్ లో ముదుళ్ళు. డబ్బు కు కొరత ఉండే అవకాశం లేదు.
* బీజేపీ కూడా పోటీ లో ఉంది కదా ; ఆ పార్టీ ఎవరికి గండి కొడుతుందో చూడాలి.
వీటన్నిటినీ క్రోడీకరించి చూడాల్సి ఉంటుంది.
కానీ, పబ్లిక్ పెర్సెప్షన్ మాత్రం కాంగ్రెస్ కు అనుకూలం గా ఉన్నదనడం లో సందేహం లేదు.
ఈ ఎన్నికలలో…. బీ ఆర్ ఎస్ గెలిచినా, ఓడినా…. జనజీవితం తో ఎలా వ్యవహారించాలో అది నేర్చుకోవాలి. పీకల మీద కు వచ్చినప్పుడు కాళ్ళ బేరానికి రావడం అనేది ఆ పార్టీ క్రెడిబిలిటీ ని పెంచదు.