Home » పెనం మీదనుండి పొయ్యిలోకి..

పెనం మీదనుండి పొయ్యిలోకి..

-పదేళ్లయినా ‘‘నీళ్లు నిధులు, నియామకాలనే’’ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలే…
-బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది
-అవినీతితో రాజ్యమేలుతూ తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మార్చింది
-6 గ్యారంటీలుసహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది
-ఏ వర్గం ప్రజలను కదిలించినా ఆశాంతి, ఆగ్రహమే కన్పిస్తోంది
-ఉద్యమ ఆకాంక్షల అమలుకు మరో పోరుకు బీజేపీ సిద్ధం
-ఆశీర్వదించి అండగా నిలవాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దశాబ్ధి వేడుకలు జరుపుకుంటున్న వేళ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. అమరుల బలిదానాలతో ప్రజలంతా కలిసికట్టుగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమించిన కవులు, కళాకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మేధావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, రాజకీయ పార్టీల నాయకులందరికీ నా అభినందనలు. లాఠీదెబ్బలు, కేసులు, అరెస్టులు, జైళ్లకు వెరవకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నా.

పార్లమెంట్ లోపల, బయట తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర అత్యంత కీలక పాత్ర పోషించింది. నాటి అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిస్తూ తీర్మానం చేస్తే…పార్లమెంట్ లో తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు కొందరు ఎంపీలు పెప్పర్ స్ప్రే చల్లి గొడవకు దిగితే… వాటిని సహిస్తూ నిలబడి బిల్లును ఆమోదించిన మహానేత సుష్మస్వరాజ్ ను ఈరోజు మనమంతా స్మరించకుండా ఉండలేం.

బాధాకరమైన విషయం ఏందంటే…. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లయినా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు-నిధులు-నియామకాలు నినాదం అమలు కానేలేదు. గతంలో తెలంగాణకు దక్కాల్సిన నీళ్లను పరాయి పాలకులు పక్క రాష్ట్రానికి దోచిపెడితే… స్వరాష్ట్రం సిద్దించాక తెలంగాణ పాలకులే స్వార్ధ ప్రయోజనాల కోసం పొరుగు రాష్ట్రానికి నీటిని తాకట్టు పెట్టారు. ధనిక రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అవినీతి, నియంత, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ పాలకులను గద్దె దించి పదేళ్ల పాలన పీడ విరగడైందని సంతోషిద్దామంటే…అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది. 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే 6 గ్యారంటీలుసహా ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది. వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది.

కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లుసహా కన్పించిన ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది. ఏ ఆశయాలు, ఆకాంక్షలతో ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికై ఉద్యమించారో అవి నేటికీ నెరవేరలేదు. పదేళ్లుగా అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది. ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేదనే అశాంతి, ఆగ్రహం ఉద్యమకారులను కలిచి వేస్తూనే ఉంది.

రాష్ట్రంలో ఏ మారుమూలకు పోయి ఏ రైతన్నను పలకరించినా కన్నీళ్లే కారుస్తున్నడు. అన్నం పెట్టిన చేతులు వడ్లకుప్పలపై జీవచ్చాలుగా మారుతూనే ఉన్నయ్. ఏ నిరుద్యోగ తమ్ముడిని పలకరించినా ఉద్యోగం రాక రోడ్లపై బతుకీడుస్తున్నడు. ఏ కార్మిక సోదరుడిని, ఏ ఉద్యోగిని కదిలించినా కసితో రగిలిపోతున్నడు… ఏ అక్క, చెల్లెమ్మను చూసినా రాణిరుద్రమ్మలా, కాళికాదేవిలా హుంకరిస్తోంది? ఏ దళిత బిడ్డను పలకరించినా దగాపడ్డామనే భావనే కన్పిస్తోంది. ఏ గిరిజన బిడ్డను కదిలించినా తెలంగాణ వచ్చినా మా బతుకులెందుకు మారలేదనే ప్రశ్నలే విన్పిస్తున్నయ్.

ఏ బీసీ బిడ్డను అడిగినా… కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కూడా మేం ఇంకా వెనుకబడి ఉండాల్సిందేనా? అని నిలదీస్తున్నరు. అగ్రవర్ణాల పేదలు సైతం… తెలంగాణ వచ్చినా మాకు ఒరిగిందేమిటని ప్రశ్నిస్తున్నరు? బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే… కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని ముక్తకంఠంతో ఆవేదనను వ్యక్తం చేస్తున్నరు.

అయినా ఇవేవీ పట్టించుకోని కాంగ్రెస్ పాలకులు బీఆర్ఎస్ మాదిరిగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో ‘తెలంగాణ పదేండ్ల పండుగ’ పేరుతో ప్రకటనలిస్తూ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ విచిత్ర పోకడలను అనుసరిస్తున్నరు.

అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం భారతీయ జనతా పార్టీ మరో ఉద్యమానికి సిద్ధమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదల పక్షాన బీజేపీ అలుపెరగని పోరాటాలకు సన్నద్దమైంది. ఈ పోరాటంలో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవాలని, తెలంగాణ ఉద్యమకారులంతా మద్దతివ్వాలని, అమరుల కుటుంబాలు ఆశీర్వదించాలని కోరుతున్నాం.

ఏ ఆశయాలు, ఆకాంక్షలతో ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికై ఉద్యమించామో అవి నెరవేరేదాకా మడమ తిప్పకుండా కొట్లాడతామని, ఈ మహా పోరాటంలో తెలంగాణ బిడ్డలంతా బీజేపీకి సంపూర్ణ మద్దతు పలకాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నా.

Leave a Reply