తెలంగాణలో కాంగ్రెస్ ‘కమ్మ’టి వార్త

కమ్మ కార్పొరేషన్ ఏర్పాటుతో కాంగ్రెస్ మేలు జరిగేనా?

పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లను గుండుగుత్తగా తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బలమైన అడుగు వేసింది. వాస్తవానికి ఇప్పటి వరకు కమ్మ ఓటు బ్యాంకు తటస్థంగా ఉంది. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ ఎస్ కు అనుకూలంగా కమ్మ ఓటు బ్యాంకు ఉంది. అందుకే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో పలు నియోజకవర్గాల్లో కమ్మ ఓట్టు బీఆర్ ఎస్కే పడ్డాయనే అంచనా ఉంది.

అయితే, బీఆర్ ఎస్ పార్టీని మరింత బలహీన పరిచేందుకు , తన ప్రభుత్వంపై చేస్తున్న కూల్చేస్తాం కూలిపోతుంది అనే కామెంట్లకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్రెడ్డి సంచలన నిర్ణయాలతో దూసుకు పోతున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు. బలమైన నాయకులను కూడా తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కమ్మ ఓట్లను తనవైపు తిప్పుకొనేందుకు తాజాగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

కమ్మ సామాజిక వర్గంలో వెనుక బడిన వారికి ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా సాయం అందించేందుకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తాజాగా ఇచ్చిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఈ జీవోను విడుదల చేయడం గమనార్హం. తెలంగాణ లో బలమైన సామాజిక వర్గంగా
గౌడలు, బలిజ, రెడ్లు ఉన్నారు. వీరితోపాటు కమ్మలు ఉన్నప్పటికీ మెజారిటీ కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా వెనుకబడి ఉంది.

ఈ క్రమంలో తమను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని ప్రభుత్వానికి వినతులు వస్తు న్నాయి. మరోవైపు మల్కాజిగిరి సహా చేవెళ్ల, సికింద్రాబాద్ వంటిపలు కీలక పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా కమ్మ ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో వారు కోరుతున్నట్టుగా కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గమనార్హం. దీనివల్ల వారిని సంతృప్తి పరిచినట్టు ఉండడమే కాకుండా రాజకీయంగా కూడా తమకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తుండడం గమనార్హం.

Leave a Reply