దేశవ్యాప్తంగా అమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’

లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.

అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’’ అంటారు. సజావుగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కోడ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం టార్గెట్‌గా ఎన్నికల సంఘం ఈ నిబంధనలు రూపొందిస్తుంది. ఎన్నికల్ షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను ఎన్నికల సంఘం అమలు చేస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు కోడ్ అమల్లోనే ఉంటుంది. నిష్పక్షపాతంగా, సవ్యంగా ఎన్నికలను నిర్వహించాలంటే ఎన్నికల కోడ్‌ను పాటించాల్సి ఉంటుంది. ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ను అతిక్రమించే అభ్యర్థులు, పార్టీలపై చర్యలు తీసుకునే హక్కు ఎన్నికల సంఘానికి ఉంటుంది.

కోడ్ అమల్లోకి వచ్చాక రూల్స్ ఏమిటి?

-మీడియాలో రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అనుకూలంగా, పక్షపాతంగా ప్రచార కథనాలపై నిషేధం ఉంటుంది. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహించకూడదు.
-ఓటర్లను ప్రభావితం చేసేందుకు కుల, మతపరమైన వ్యాఖ్యలు చేయకూడదు. పుకార్లు వ్యాప్తి చేయడం నిషేధం. ఓటర్లను డబ్బులు పంచడం, భయపెట్టడానికి వీళ్లేదు.
-ఎన్నికలు షెడ్యూల్ విడుదలయ్యాక అభ్యర్థులు ఆర్థిక గ్రాంట్లు ప్రకటించడం నిషేధం.
-ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రారంభించకూడదు. కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయకూడదు.
-రోడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ అధికారులు వాగ్దానాలు చేయకూదదు.
-ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో తాత్కాలిక నియామకాలు చేపట్టకూడదు.
-ఎన్నికల్లో పోటీ చేసే మంత్రులు లేదా అభ్యర్థులు తమ పరిధిలోని నిధులను మంజూరు చేయకూడదు.
-ఎన్నికల ప్రచారం కోసం ప్రభుత్వ వనరులను ఉపయోగించకూడదు. ర-వాణా, యంత్రాలు, భద్రతా సిబ్బందితో సహా దేనిని ఉపయోగించకూడదు.
-ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ నాయకుల సమావేశాలకు మునిసిపాలిటీలు బహిరంగ ప్రదేశాల్లో మీటింగ్‌లకు ఉచిత ప్రవేశం కల్పించాలి.
-ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లు, భవనాలు, ఇతర ప్రభుత్వ వసతులను ఏ రాజకీయ పార్టీ లేదా అభ్యర్థులు ఎన్నికల్లో తమ ప్రయోజనం కోసం ఉపయోగించుకోవడానికి వీలుండదు.

Leave a Reply