Suryaa.co.in

National

‘న్యాయ్ పాత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుద‌ల చేసిన కాంగ్రెస్‌

‘న్యాయ్ పాత్ర’ పేరుతో  కాంగ్రెస్ ఎన్నిక‌ల‌ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. రాబోయే ఐదేళ్లకు తన విజన్ డాక్యుమెంట్‌ను హ‌స్తం పార్టీ ఆవిష్కరించింది. ఈ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, చిదంబరం త‌దిత‌ర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాగా, శనివారం పార్టీ జైపూర్, హైదరాబాద్‌లలో ఒక్కొక్కటి చొప్పున రెండు ‘మేనిఫెస్టో లాంచ్ మెగా ర్యాలీలను’ నిర్వహించనుంది.

అయితే, ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటికే 25 హామీలను వెల్లడించిన విష‌యం తెలిసిందే. దీనిని ‘పాంచ్ న్యాయ్’ లేదా న్యాయానికి ఐదు స్తంభాలు అని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది. ఈ ఐదు స్తంభాల‌లో ఒక్కొక్క దాని కింద ఐదు ‘గ్యారంటీలు’ ఉన్నాయి. ‘యువ న్యాయ్’ (యువతకు), ‘నారీ న్యాయ్’ (మహిళలకు), ‘కిసాన్ న్యాయ్’ (రైతుల కోసం), ‘శ్రామిక్ న్యాయ్’ (కార్మికులకు) మరియు ‘హిస్సేదారి న్యాయ్’ (జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు).

మేనిఫెస్టో విడుద‌ల సంద‌ర్భంగా కాంగ్రెస్ చీఫ్ ఖ‌ర్గే మాట్లాడుతూ.. మోదీ పాల‌న‌లో అన్ని వ‌ర్గాల‌కు అన్యాయం జ‌రిగింద‌ని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాగానే అభివృద్ధి కొనసాగిస్తామ‌న్నారు. త‌మ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కులగ‌ణన చేప‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే పేద మ‌హిళ‌ల‌కు ఏడాదికి రూ. ల‌క్ష అందిస్తామ‌ని తెలిపారు. కిసాన్ న్యాయ్ పేరుతో రైతుల‌ను ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం తీసుకువ‌స్తామ‌న్నారు.

మ‌రోవైపు అధికార బీజేపీ సైతం దాని మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. 27 మంది సభ్యులు ఉన్న ఈ ప్యానెల్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కీలక హామీలు

-దేశవ్యాప్తంగా 8 కోట్ల గ్యారంటీ కార్డుల పంపిణీ
-పెట్రోల్‌, డిజీల్‌ ధరల తగ్గింపు
-వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
-దేశవ్యాప్తంగా కులగణన కనీస మద్దతు ధరకు లీగల్‌ గ్యారంటీ
-రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత
-రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
-అగ్నివీర్‌ స్కీమ్‌ రద్దు
-యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన
-కేంద్ర ఉద్యోగాలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌
-మహాలక్ష్మీ పథకంతో పేద కుటుంబాలకు ఏడాదికి రూ.లక్ష నగదు సాయం
-కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ
-ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌పై విచారణ
-కనీస మద్దతు ధర చట్టం
-విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం
-రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
-పెగాసెస్‌, రాఫెల్స్‌పై విచారణ

LEAVE A RESPONSE