Suryaa.co.in

Andhra Pradesh

ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష

– కాలరాయాలని చూస్తే ఓటుతో గుణపాఠం
– అంబేద్కర్ ఆశాయాలు నెరవేరుద్దాం – సమానత్వం సాధిద్దాం
– వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి తెలుగువారిదే అగ్రపథం
– ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం – రాజ్యాంగాన్ని పూజిస్తాం
– మా ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో స్వేచ్ఛా స్వాతంత్రం
– రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి : ప్రజాస్వామ్యానికి రాజ్యాంగమే రక్ష అని, మన రాజ్యాంగం ఎంతో ధృడమైనదని.. దానికి ఎవరూ ఏమి చేయలేరని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అరాచకశక్తులు అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ప్రజలు రాజ్యాంగం ఇచ్చిన ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తమ ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి పునర్జీవం వచ్చిందన్నారు.
స్వాతంత్ర్యానికి పూర్వం ఎన్నో అసమానతల నుంచి సమానత్వం దిశగా భారతదేశం అడుగులు వేస్తోందంటే దానికి రాజ్యాంగం నిర్దేశించిన మార్గంతోనే సాధ్యమవుతోందని చెప్పారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగ స్పూర్తితో నడచుకోవాల్సి ఉందన్నారు. భారత రాజ్యంగ దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

అతి గొప్ప రాజ్యాంగం మనది

ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1949 నవంబరు 26న భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 75 సంవత్సరాలు పూర్తయ్యిందని, ఇంతటి శుభదినం మనందరికీ ఎంతో విశిష్టమైందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత దేశ రాజ్యాంగం అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని దీని రచనకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారధ్యంలోని 299 మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ రచనా సంఘం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ఒక గొప్ప రాజ్యాంగాన్ని మనకు అందించిందని గుర్తు చేశారు.

అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, జపాన్ వంటి పలు దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటిలో ఉత్తమమైన అంశాలను తీసుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారని కొనియాడారు. రాజ్యాంగ రచనలో నీలం సంజీవరెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్జీ రంగా, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ వంటి 11 మంది తెలుగువారు కీలకపాత్ర పోషించారన్నారు. అంతేగాక దేశం గర్వించేలా పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారని సియం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

భవిష్యత్ సవాళ్లకు తగ్గట్టుగా రాజ్యాంగ రచన

భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే ఊహించి అందుకనుగుణంగా తీసుకోవాల్సిన అంశాలను రాజ్యాంగంలో పొందుపరిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ముఖ్యంగా సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ అందాలనేది రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యమని అన్నారు. అంబేద్కర్ పేర్కొన్నట్టు రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు చేసే వ్యక్తులు చెడ్డవారైతే దానివల్ల సమాజానికి చెడే జరుగుతుందని చెప్పారు. ప్రాథమిక హక్కుల్ని సైతం గతంలో ఎలా కాలరాశారో మనం చూశామని గడిచిన ఐదేళ్శ పాలనే ఇందుకు నిదర్శనమని సియం పేర్కొన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం కూడా రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని తెలిపారు.

విధ్వంసం నుంచి విముక్తి

రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించకూడదని అన్నారు. గత ఐదేళ్లలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని, ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిన జీవోలను రహస్యంగా ఉంచారని మరలా మన ప్రభుత్వం పారదర్శకంగా అన్ని జీఓలను ఆన్లైన్లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నామని సియం చెప్పారు.

వందేళ్ల వేడుక ల్లో తెలుగువారిదే మొదటి స్థానం

2047 నాటికి మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతాయని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్‌లో భాగంగా ఏపీలో స్వర్ణాంధ్ర 2047 విజన్ ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి అన్నారు. ఆనాటికి తెలుగువారు దేశంలోనూ, ప్రపంచంలోనూ మొదటి స్థానంలో ఉండాలన్నదే తమ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. అంతేగాక తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ని దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని చెప్పారు. అదే విధంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను సంపన్న, ఆరోగ్య, సంతోషకర (Wealth, Health, Happy) రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్య ఆశయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో పాల్గొన్న అందరితో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించారు.

కార్యక్రమంలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ది, ఐటి శాఖమాత్యులు నారా లోకేష్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడారు. మంత్రులు ఎస్. సవిత, పి. నారాయణ, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవి కుమార్, బిసి జనార్థన రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కృష్ణబాబు, అనంతరాము, ముఖ్య కార్యదర్శులు ముకేష్ కుమార్ మీనా, శశి భూషణ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, పలువురు కార్యదర్శులు, శాఖాధిపతులు, సచివాలయ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A RESPONSE