ట్విట్టర్ లో స్పందించిన నాగబాబు.. కౌంటర్ ఇచ్చిన బ్రహ్మణ సంఘం..
అథ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి నరసింహరావు పేరు ప్రస్తావించకుండా ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని స్పందించారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు స్పందించాయి. నాగబాబు వ్యాఖ్యలకు ఆలిండియా బ్రహ్మణ ఫేడరేషన్ ఉపాధ్యాక్షులు ద్రోణంరాజు రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. ఆహార్యానికి అవధానానికి తేడా తెలియని మాయారంగం, నిత్యమూ తన ప్రవచనాలతో సమాచాన్ని సంస్కారవంతం చేస్తున్న ఒక సనాతనవాదికి, సమాజంతో నటనా వ్యాపారం తప్ప సమాజహితాన్ని మరచిన చిత్రవ్యాపారిని చూసి అసూయ చెందాడనడం ఆకాశం మీద ఉమ్మేయడం లాంటిదే.. చిడతలు కొట్టే వాడు కూడా సంగీత విద్వాంసులమని ట్వీట్లలో కూనిరాగాలాపన చేస్తే ఎలా అంటూ పేరు ప్రాస్తావించకుండానే ఘుటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ ఘటనపై చిరంజీవి అభిమానులు సైతం స్పందిస్తున్నారు. చిరంజీవికి గరికపాటి నరసింహరావు తక్షణమే క్షమాపణలు చెప్పాలని లేకుంటే గరికపాటి నరసింహరావు ప్రవచనాలను అడ్డుకుంటామని రాష్ట్ర చిరంజీవి యువత తెలిపింది.
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అక్టోబర్6వ తేదీ గురువారం అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణలో దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి తర్వాత రోజు బంధుమిత్రులను కలుసుకున్న సందర్భంగా పరస్పర ఆత్మీయాభిమానాలతో ఆలింగనం చేసుకుంటూ అలయ్ బలయ్ చెప్పుకుంటారు. తెలంగాణ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా.. బీజేపీలో ఉన్నసమయంలో బండారు దత్తాత్రేయ నిర్వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన గవర్నర్ హోదాలో ఉండటంతో ఆయన వాసరత్వంగా వారి కుమార్తె విజయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరిలో కొంతమంది ప్రముఖులు వేదికపై ఆశీనులయ్యారు. వీరిలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి, ప్రవచనకర్త అష్టావధాని గరికపాటి నరసింహరావు వేదికపై ఉన్నారుకార్యక్రమానికి వచ్చిన అనేకమంది చిరంజీవితో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు. అభిమానులు అడగడంతో వారితో చిరంజీవి ఫోటోలు దిగుతున్నారు. ఇదే సమయంలో గరికపాటి నరసింహరావు ప్రసంగిస్తున్నారు.
ఆయన ప్రసంగిస్తుండగా.. కార్యక్రమానికి హాజరైన వారు చిరంజీవితో ఫోటోలు దిగుతుండటంతో.. గరికపాటి నరసింహరావు మధ్యలో ప్రసంగం ఆపి.. ఫోటో సెషన్ ఆపాలని, లేకపోతే తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. ఈ మాట విన్న వెంటనే చిరంజీవి వచ్చి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. ఆ తర్వాత గరికపాటి నరసింహరావు తన ప్రసంగాన్ని కొనసాగించారు. అనంతరం గరికపాటి నరసింహరావు వద్దకు వెళ్లిన చిరంజీవి ఫోటో సెషన్ పై వివరణ ఇచ్చారు. గరికపాటి నరసింహరావు ప్రవచనాలంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు. భవిష్యత్తులో అవకాశం ఉంటే మిమల్ని మా ఇంటికి ఆహ్వానించుకుంటానని గరికపాటి నరసింహరావుని ఉద్దేశించి అన్నారు. గరికపాటి నరసింహరావు కూడా ఆ ఘటనను పక్కనపెట్టి చిరంజీవితో సరదాగా మాట్లాడారు. ఈ ఘటనపై చిరంజీవి, గరికపాటి నరసింహరావు కార్యక్రమం తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే చిరంజీవి సోదరుడు నాగబాబు మాత్రం పేరు ప్రస్తావించకుండా ట్విట్ చేశారు. దీనిపై బ్రహ్మణసంఘాలు స్పందించాయి. మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు, గరికపాటి నరసింహరావు అభిమానులు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.