నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపనకు ఆహ్వానం
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని క్రిబ్‌కో చైర్మన్ డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌లో నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో క్రిబ్‌కో బయో ఇథనాల్ ప్లాంట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. రూ. 300 కోట్లతో మొదటి దశ క్రిబ్‌కో నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు. దీంతోపాటు డీఏపీ కాంప్లెక్స్ ఎరువుల తయారీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏర్పాటుపై కూడా సీఎంతో క్రిబ్‌కో చైర్మన్ చర్చించారు. ఇందుకు సీఎం వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై ముఖ్యమంత్రితో డాక్టర్ చంద్రపాల్ సింగ్ యాదవ్ చర్చించారు. ఎలాంటి సహాయ, సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం వైయస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సీఎం వైయస్ జగన్ తెలిపారు. ఈ సమావేశంలో క్రిబ్‌కో వైస్ చైర్మన్ వల్లభనేని సుధాకర్ చౌదరి, క్రిబ్‌కో ఎండీ రాజన్ చౌదరి, మార్కెటింగ్ డైరెక్టర్ వీఎస్‌ఆర్ ప్రసాద్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.