– రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సిఎస్ డా.రజత్ భార్గవ
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా సరఫరా అయ్యే మద్యం ఉత్పత్తులపై నిరాధారమైన ఆరోపణలు చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ భార్గవ తెలిపారు.
సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ మద్య కాలంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఏపి మధ్యంపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, వారి ఆరోపణలు ప్రభుత్వ పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్రం లోని మద్యం సీసాల నుండి తీసుకున్న శాంపిల్స్లో కొన్ని హానికరమైన పదార్థాలు కనుగొనబడినట్లు వారు ప్రస్తావించారన్నారు. తమకు అందిన సమాచారం ప్రకారం, కొంతమంది వ్యక్తులు అనధికారికంగా మద్యం నమూనాలను నెల్లూరు నుంచి చెన్నైకి తీసుకువెళ్లి ఎస్.జి.ఎస్. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ లో పరీక్షలు చేయించి వాటిలో హానికరమైన పదార్థాలు కనుగొన్నట్లు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అయితే ఈ నమూనాలను ఎక్కడ నుండి పొందారు, రాష్ట్రం నుండి కొనుగోలు చేసినవేనా? కాదా? ఎందుకు తీసుకెళ్లారనేది ప్రశ్నార్థకం అన్నారు. రవాణాలో ఏమైనా కల్తీ జరిగిఉండవచ్చు అనే ప్రశ్నకు సమాదానం అస్పష్టమైందని ఆయన అన్నారు.
AP డిస్టిలరీ (బీర్ మరియు వైన్ కాకుండా IMFL తయారీ) రూల్స్ 2006 లోని రూల్ 22 కింద నిర్దేశించిన ప్రామాణిక నమూనా మరియు పరీక్ష విధానాన్ని అనుసరించకుండా, అనధికారిక నమూనాలను పరీక్ష కోసం SGS ల్యాబ్‌లకు పంపబడ్డాయని ఆయన తెలిపారు. అధికారపూర్వకంగా నమూనా పరీక్షలు జరిపించేటప్పుడు, డిస్టిలరీ ఎక్సైజ్ అధికారుల సమక్షంలో మూడు నమూనాలను తీసుకుని భద్రంగా సీలు వేసిన తదుపరి, వాటిలో ఒక దానిని మాత్రమే విశ్లేషణ కోసం పంపబడుతుందని ఆయన తెలిపారు. ఇటు వంటి ప్రక్రియను ఏమాత్రం పాటించ కుండా అనధికారికంగా నమూనాలను పరీక్షలు చేయించడం జరిగిందన్నారు.
అయితే అనధికారికంగా పొందిన నివేదిక తమకు అందిన తదుపరి, దాని వాస్తవికతను నిర్థారించడానికి చైన్నైలోని ఎస్.జి.ఎస్. ల్యాబ్ ను APSBCL అధికారులు సంప్రదించడం జరిగిందన్నారు. తమకు నమూనాలను అందజేసిన వ్యక్తుల అభ్యర్థన మేరకు, ప్రామాణిక IS 4449(విస్కీ) మరియు IS 4450(బ్రాందీ) ప్రకారం నమూనాలను పరీక్షించలేదని SGS ల్యాబ్ తమ లేఖలో తెలిపినట్లు ఆయన తెలిపారు. అలాగే, SGS పేర్కొన్న సమ్మేళనాలలో హానికరం అని ఎటువంటి వివరణ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు.
మద్యం నమూనాల పరీక్షలను APSBCL పెద్ద ఎత్తున చేస్తున్నదని, ఇప్పటివరకు ఎటువంటి హానికరమైన పదార్ధాలు ఉన్నట్లు డిపార్టుమెంట్ దృష్టికి రాలేదని, ఫిబ్రవరి, 2019 తర్వాత కొత్త డిస్టిలరీ కూడా మంజూరు చేయడం జరుగలేదని ఆయన స్పష్టంచేశారు.
గుంటూరు కెమికల్ లాబొరేటరీకి చెందిన కెమికల్ ఎగ్జామినర్ జూలియట్ షకీలా దేవి మాట్లాడుతూ, సాధారణ నీటిని లేదా కొబ్బరి నీటిని పరీక్షించినా సరే క్రొమెటోగ్రామ్ (వర్ణరేఖా చిత్రం) లో స్వల్పంగా ఉండే హానికర పదార్థాలు స్పష్ణంగా గోచరమవుతాయని, అయితే వాటిలో హానికర పదార్థాలు ఉన్నట్లు మనం పరిగణించం అనే విషయాన్ని గుర్తించాలన్నారు.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్సులో ఒక ప్రామాణికమైన టేబుల్ ఉంటుందని, పరిమితి దాటి హానికర పదార్థాలు ఉంటే ఆ టేబుల్ స్పష్టంగా పొందుపర్చడం జరుగుతుందన్నారు. అయితే ఎస్.జి.ఎస్. వారి నివేదిక అందుకు అనుగుణంగా లేదని, అయినప్పటికీ వారి నివేదికలో ఎటు వంటి హానికర పదార్థాలు ఉన్నట్లు తెలుపలేదని ఆమె స్పష్టంచేశారు.