Home » ‘ఫసల్‌ బీమా యోజన’ శాస్త్రీయంగా లేదు: శాసనసభలో సీఎం కేసీఆర్‌

‘ఫసల్‌ బీమా యోజన’ శాస్త్రీయంగా లేదు: శాసనసభలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: దేశంలో ఫసల్‌ బీమా యోజన శాస్త్రీయంగా లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. ఫసల్‌ బీమా లేదా మరొకటి ఏదైనా అంతా బోగస్‌ అని వ్యాఖ్యానించారు. శాసనసభలో సీఎం మాట్లాడారు. ఫసల్‌ బీమాతో రైతులకు లాభం చేకూరడం లేదని.. దీనిపై కేంద్రానికి సూచనలు పంపుతామని చెప్పారు. దేశానికి బాధ్యత వహిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు ఉంటాయన్నారు. ఆహార ధాన్యాల కొరత రాకుండా కోల్డ్‌ స్టోరేజీలు నిర్మించాలని.. ఆ బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు చేసినట్లయితే ఆహార ధాన్యాల కొరత సమయాల్లో వాటిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశముంటుందన్నారు.
రాష్ట్రంలో ధరణి పోర్టల్‌ ద్వారా రైతులకు చాలా ఉపశమనం కలిగిందని కేసీఆర్‌ అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ తరహా ఘటనలు జరగకుండా ఉండేందుకు ధరణి తెచ్చామని చెప్పారు. కౌలుదారు మారినప్పుడల్లా మార్పులు చేయడం ప్రభుత్వం బాధ్యత కాదన్నారు. గులాబ్‌ తుపాను బాధితులను ఆదుకుంటామని.. క్షేత్రస్థాయిలో నష్టం అంచనాపై కేంద్రానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
బీసీ కులగణన తీర్మానానికి శాసనసభ ఏకగ్రీవ ఆమోదం
బీసీ కులగణనపై తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వచ్చే జనాభా లెక్కల్లో బీసీ కులగణన చేపట్టాలంటూ సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 2021లోనే జనగణన చేయనున్నారని.. రాష్ట్రంలో అత్యధికంగా 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రయోజనం చేకూరాలంటే కులగణన చేపట్టాలని కేంద్రాన్ని సీఎం కోరారు. బీసీలకు అనేక రంగాల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply