Home » ఇక కరెంట్ పోలీసులు!

ఇక కరెంట్ పోలీసులు!

– పంపిణీ ప్రయివేటుకు
– పెత్తనం కేంద్రానిది కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు 2021
– నామమాత్రం కానున్న డిస్కామ్‌లు
సెల్ రిచార్జి మాదిరి డబ్బు కడితేనే విద్యుత్‌
వ్యవసాయ విద్యుత్‌కూ ఛార్జీలు చెల్లించాల్సిందే
ఇప్పటిదాకా లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులనో, సిఆర్‌పిఎఫ్‌ సిబ్బందినో చూసి ఉంటారు. ఇక నుండి కరెంటు పోలీసులు కూడా రానున్నారు. ఈ మేరకు ప్రత్యేక పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. విద్యుత్‌ రంగంలో సంస్కరణల అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు అందిన ‘పంపిణీరంగ పునరుద్దరణ పథకాంసంస్కరణల ఆధారిత, ఫలితాలతో అనుసంధానించిన స్కీమ్‌ (రీ వాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌, ఏ రీ ఫామ్మ్‌ బేస్డ్‌ అండ్‌ రిజల్ట్‌ లింక్డ్‌ స్కీమ్‌) ముసాయిదాలో ఈ విషయాన్ని పేర్కొంది.
సంస్కరణల్లో భాగంగా తప్పనిసరిగా చేపట్టాల్సిన చర్యల్లో విద్యుత్‌ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు ఒకటి కావడం, వాటి అమలుకు నిధుల విడుదలకు ముడిపెట్టడంతో త్వరలోనే కరెంటు పోలీసులు ప్రత్యక్షం కానున్నారు. డిస్కామ్‌లను నామమాత్రం చేయడం, పంపిణీ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌ సంస్థలకు, ఫ్రాంచైజీలకు అప్పచెప్పాలన్నది ఈ ముసాయిదా సారాంశం! దీంతో ఆ సంస్థల తరపునే కరెంటు పోలీసులు ప్రజలపై పెత్తనం చేయనున్నారు. అంటే ప్రభుత్వం నుండి జీతాలు తీసుకుని కార్పొరేట్ల కోసం పనిచేయనున్నారు. 2003 నాటి విద్యుత్‌ చట్టం ఆధారంగా ఈ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ల్రాకు సూచించింది.
ఏమిటీ పథకం…?
విద్యుత్‌ పంపీణీ రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. దీనిలో భాగంగా అన్ని నగరాలు, పట్టణాల్లోని పంపిణీ వ్యవస్థ మొత్తం ప్రైవేటు సంస్థలకు, ఫ్రాంచైజీలకు అప్పగిస్తారు. ఇళ్ళకు ప్రీపెయిడ్‌ మీటర్లను బిగిస్తారు. ఇప్పటి మాదిరి ఇంటింటికి తిరిగి వినియోగం నమోదు చేసి బిల్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. సెల్‌ఫోన్ల మాదిరి ముందుగా రీ ఛార్జి చేయించుకుంటనే కరెంటు సరఫరా జరుగుతుంది. చేసుకున్న ఛార్జి అయిపోతే నిలిచిపోతుంది. ఈ ప్రీ పెయిడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసిన తరువాత డిస్కామ్‌లు పంపిణీ రంగం నుండి తప్పుకుంటాయి. ఈ మొత్తం పథకం అమలుకు 3,03,758 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. దీనిలో 97,631 కోట్ల రూపాయలను కేంద్రం బడ్జెట్‌ ద్వారా రాష్ట్రాలకు సమకూర్చనుంది. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డిస్కామ్‌ల త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదర్చుకోవాల్సిఉంది. ఒక్కసారి ఈ ఒప్పందం అమలులోకి వస్తే రాష్ట్రాల్లోని విద్యుత్‌రంగంపై పెత్తనమంతా కేంద్రం చేతుల్లోకి వెళ్లనుంది. వివిధ కమటీలు, ఏజెన్సీల పేరుతో కేంద్రం చేసే ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయక తప్పనిస్థితి ఏర్పడుతుంది.
రైతులకూ కష్టమే!
ఈ పథకం అమలులోకి వస్తే వ్యవసాయరంగానికీ సమస్యలు తప్పని స్థితి ఏర్పడనుంది. మొత్తం వ్యవసాయ కనెక్షన్లు అన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ‘కుసుమ్‌’ పథకంలోకి తీసుకురానున్నారు. ఈ పథకం కింద పగటిపూట తక్కువ, నామమాత్ర ధరకు సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తామని ముసాయిదాలో కేంద్రం పేర్కొంది. దీంతో వ్యవసాయ కనెక్షన్లు రాష్ట్ర పరిధినుండి కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లిపోతాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ప్రశ్నార్ధకంగా మారుతాయి. సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుకు అవసరమైన పరికరాల ఖర్చును ప్రభుత్వాలు ఇస్తాయా? రైతులే భరించాలా అన్న విషయం స్పష్టత లేదు.
అధికారం కేంద్రానిదే!
పథకం అమలుకు కేంద్రంతో ఒప్పందం చేసుకున్న తరువాత వివిధ మంత్రిత్వశాఖలతో మానిటరింగ్‌ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. రాష్ట్రాలు పంపించే అన్ని డిపిఆర్‌లను ఈ కమిటీ పరిశీలిస్తుంది. దీనితో పాటు పథకం ముందస్తు షరతులను డిస్కామ్‌లు అమలు చేశాయా అన్న అంశాన్ని, సంస్కరణల అమలు అనంతరం నిర్ధేశించిన ఫలితాలను సాధించే విషయంలో అవసరమైన నిర్ణయాలను ఎప్పటికప్పుడు చేస్తుంది. ఇది కాకుండా మరో నోడల్‌ఏజెన్సీని కూడా కేంద్రం ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా సలహాదారులను కూడా కేంద్రమే నియమిస్తుంది. రాష్ట్రాలు, ప్రాంతాల వారిగా అవసరమైన పథకాలను వీరే రూపొందించి కేంద్రానికి నివేదిస్తారు. విద్యుత్‌ రంగ ప్రైవేటీకరణకు అవసరమైన అన్ని సూచనలనూ వీరు చేస్తారని ముసాయిదాలో కేంద్రం పేర్కోంది.

Leave a Reply