Suryaa.co.in

Features

“ఆ చల్లని సముద్ర గర్భం…” గీతంలో వైవిధ్యం

( మహాకవి దాశరథి జయంతి )

మహాకవి దాశరథి కృష్ణమాచార్య (1925-1987) తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో ప్రావీణ్యం గడించినట్టే — ప్రసంగం, సాహిత్యం మాత్రమే కాక రేడియో, సినిమా మాధ్యమాలలో నైపుణ్యం సాధించారు. అంతేకాదు కవిత్వం మాత్రమే కాక పాటలో కూడా కొత్త ఎత్తులకు పోయారు. ఆకాశవాణి లలిత గీతం, సినిమా గీతం సంబంధించి ఆయన చేసిన కృషి విలక్షణంగా కనబడుతుంది. అలాగే కవిత్వంలో, పాటలలో భావచిత్రాలే కాక, సామాజిక, చారిత్రక, సైన్స్ పరమైన విషయాలు ఎన్నో కనబడతాయి. శ్రీశ్రీ, ఆరుద్ర, దాశరథి వంటివారే విజ్ఞాన సంబంధమైన విషయాలను కవిత్వంలో అడపాదడపా ప్రస్తావించారు.

ఒక నాలుగైదేళ్ళుగా ఒక విషయం వెంటాడుతోంది. “అ చల్లని సముద్ర గర్భం…” పాటలో సైన్స్, చరిత్ర, సామాజిక కోణాల్లో కవి భావనలు మనకు ప్రత్యేకంగా దర్శనమిస్తాయి. ఒక పాతికేళ్ళుగా ఈ గీతం తెలుగునేల అన్ని చోట్ల వినబడుతూ వస్తోంది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మరింత విరివిగా వినబడుతోంది. అయితే, ఈ పాటలో కొన్ని పదాలు, పాదాలు ఒక్కోచోట, ఒక్కో సందర్భంలో వేరుగా వేరుగా వినబడుతున్నాయి. దీంతో మరింత ఆసక్తి కలిగి కొంత పరిశీలన చేశాను. ఇప్పుడు నా వద్ద మూల గీతంతో పాటు నాలుగు వెర్షన్లున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిద్దామని ప్రస్తుత ప్రయత్నం.

ఇరవయ్యేళ్ళలోపునే దాశరథి మంచి కవిత్వం రాయడం, పోలీసుల దృష్టిలో పడటం గమనార్హం. దాశరథి కృష్ణమాచార్య తొలి కవితా గ్రంథం 1949లో వెలువడిన ‘అగ్నిధార’. ఈ సంకలనంలోని కవితలు చాలావరకు తొలుత ప్రచారంలోకి వచ్చి జనులు నోట నానిన తర్వాత ప్రచురింపబడ్డాయి. నా కోటి రతనాల వీణ గీతం ఈ సంకలనం లోనిదే! అంతేకాదు ‘ఈ చల్లని సముద్రగర్భం…’ గీతం కూడా ‘అగ్నిధార’ లోనిదే.

1988 తర్వాత అక్షరాస్యత, మూఢనమ్మకాల నిర్మూలన, సైన్స్ దృష్టి వంటి విషయాలు కొన్ని సంస్థల ఎజెండాగా మారడంతో ఉదాత్తమైన పాటలు ప్రాచుర్యం పొంది మళ్ళీ వినిపించడం మొదలైంది. దానికి కొత్తగా వచ్చిన టెక్నాలజి దీనికి ఎంతో దోహదపడింది. ఈ కారణాలతో 1991 నుంచీ చాలాచోట్ల చాలా సందర్భాల్లో ఈ పాట విన్నాను.

‘అగ్నిధార’లో లభ్యమయ్యే గీతం పల్లవితో పాటు ఆరు చరణాలుగా సాగుతుంది. పల్లవీ, చరణం ప్రతిదీ నాలుగు పాదాలుగా, ప్రతి పాదం 14 మాత్రలుగా సాగుతుంది. పాటకు అవసరమైన దార్శనికత, భావం, లయ, భావుకత పుష్కలంగా ఉన్నాయి. ప్రకృతిని అవలోకింప చేసే పల్లవితోపాటు ఒక చరణం సైన్స్, మరో చరణం చరిత్ర మిగతా నాలుగూ సామాజిక దర్శనంతో తొణికిసలాడుతాయి.

ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడబానలమెంతో?
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భానువులెందరో?

భూగోళం పుట్టుక కోసం
కూలిన సురగోళాలెన్నో?
ఈ మానవరూపం కోసం
జరిగిన పరిణామాలెన్నో

ఒక రాజును గెలిపించుటలో
ఒరిగిన నరకంఠాలెన్నో?
శ్రమజీవుల పచ్చి నెత్తురులు
త్రాగని ధనవంతులెందరో?

అన్నార్తులు అనాధలుండని
ఆ నవయుగ మదెంత దూరమో?
కరువంటూ కాటక మంటూ
కనుపించని కాలాలెప్పుడో?

అణగారిన అగ్ని పర్వతం
కని పెంచిన “లావా” యెంతో?
ఆకలితో చచ్చే పేదల
శోకంలో కోపం యెంతో?

పసిపాపల నిదుర కనులలో
ముసిరిన భవితవ్యం యెంతో?
గాయపడిన కవిగుండెల్లో
వ్రాయబడని కావ్యాలెన్నో?

కుల మతముల సుడిగుండాలకు
బలిగాని పవిత్రులెందరో?
భరతావని బలపరాక్రమం
చెర వీడే దింకెన్నాళ్ళకో?
(అగ్నిధార, 1949)

వేదికల మీద, యూట్యూబ్ లో, రేడియోలో మాత్రమే కాక తెలంగాణ , ఆంధ్ర పల్లెప్రాంతాలలో నేడు విరివిగా వినబడే పాట ఇది. ఆకాశవాణిలో జాతీయస్థాయిలో ‘సాంగ్ ఆఫ్ ది మంత్’ అనే ప్రయోగం చాలా కాలం నడిచింది. ఆయా భాషలలో మంచి ఉదాత్తమైన పాటను పూర్తి సంగీతపు హంగులలో దీనిని రికార్డు చేసి నెలలో నాలుగు సార్లు వినిపిస్తారు. దీనితో మంచి ప్రాచుర్యం కూడా సిద్ధిస్తుంది.

అలా 1992లో డా. మహాభాష్యం చిత్తరంజన్ ఆకాశవాణి హైదరాబాదు రికార్డింగ్ ‘ఈ మాసపు పాట’లో ట్యూన్ కట్టారు. దాన్ని ప్రసిద్ధ గాయకులు కె.బి.కె.మోహన్ రాజు (కొండా బాబు కృష్ణమోహనరాజు), విజయలక్ష్మి శర్మ పాడారు. ఆరేళ్ళ క్రితం కె.బి.కె. మోహనరాజు ఫేస్ బుక్ లో షేర్ చేసినపుడు నేను జాగ్రత్తగా విన్నాను. ఇందులో ప్రత్యేకత ఏమంటే ఆరుచరణాలు కాకుండా 1, 3, 5 చరణాలు మాత్రమే ఉన్నాయి. ఎక్కువమంది గాయనీ గాయకులు అంటే వందేమాతరం శ్రీనివాస్, విమలక్క, వరంగల్ శంకర్, ప్రజానాట్య మండలి, జన విజ్ఞాన వేదిక ఇంకా పలు సంస్థలు ద్వారా పాడిన గీతంలో మూలంలో మూడింట రెండు వంతులు మనకు వినబడుతోంది. ఖమ్మం నివాసి బూరగడ్డ కందాడై విజయకుమార్ ఆచార్య ఈ గీతానికి ట్యూన్ కట్టారు. అదే ప్రాచుర్యంలోకి వచ్చింది.

అయితే రెండు చరణాలు కలిపి ఒక చరణంగా పాడటం ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఒకటో చరణం, 2, 6 చరణాలలో కొంత భాగం కలసి ఒక చరణంగానూ; మూడు, ఐదు చరణాలు ఒక చరణంగా ఇక్కడ మనకు వినబడతాయి. ఈ మొత్తం పాటలో నాల్గవ చరణం అసలు కనబడదు. మారుమాముల శశిధర శర్మ పాడిన వెర్షన్లో దాశరథి మొత్తం పాట మనకు లభిస్తుంది. ఈ వెర్షన్స్ అన్నింటిలో ప్రధానమైన తేడా పల్లవిలో ‘కానరాని భానువులెందరో’ ‘ కానరాని భాస్కరు లెందరో’ అనే తేడాను గమనించవచ్చు.

ఇవన్నీ కాకుండా జనవిజ్ఞాన వేదిక తెలంగాణ కొన్ని సంవత్సరాల క్రితం ఈ గీతాన్ని ఒక క్యాలండర్ గా చాలా ఆకర్షణీయంగా ముద్రించింది. ఇందులో మూలంలో లేని (రెండు చరణాలు నిడివిలో) ఒక చరణంగా మనం గమనించవచ్చు. ఆ పాదాలు ఇలా ఉన్నాయి:

మానవ కళ్యాణం కోసం
పణమొడ్డిన రక్తం యెంతో

రణరక్కసి కరాళనృత్యం
రాల్చిన పసిప్రాణాలెన్నో

కడుపుకోతతో అల్లాడిన
కన్నులలో విషాదమెంతో

ధనవంతుల దుర్మార్గాలకు
దగ్ధమైన బ్రతుకులుయెన్నో… llఆ చల్లనిll

ఇలా మార్పులు ఎందుకు వస్తాయి? ఆ మార్పులకు కవి ఆమోదం ఉందా? అది ఒక పాట బహుళ ప్రచారమైనపుడు సంభవించే విషయంగా పరిగణించాల్సి ఉంటుందా? అనే విషయాలు ఇప్పుడు తేల్చలేము. కేవలం వినడం ఆధారంగానే గుర్తు పెట్టుకుంటాం, ప్రతిసారి మూలాన్ని సంప్రదించే సౌకర్యం ఉండకపోవచ్చు. అందువల్ల మరింత శ్రావ్యంగా ఉండే పదాలు రావచ్చు లేదా మరింత ఆమోద‌కరమైన

భావంతో కొన్ని పదాలు మార్చబడవచ్చు ‘వ్రాయబడని కావ్యాలెన్నో’ అనే దానికన్నా ‘రాయబడని కావ్యాలెన్నో’ అనడం హాయిగా ఉంటుంది. ఇపుడు యూట్యూబ్ లలో చాలామంది పాడిన ఈ పాట చాలా రకాలుగా లభించడం దాశరథి గీతానికున్న ప్రాచుర్యానికి కొలమానం, సాహిత్యానికి బహుమానం!

– డా. నాగసూరి వేణుగోపాల్
9440732392

LEAVE A RESPONSE