Suryaa.co.in

Features

నాణ్యతలేని హోటల్స్ పై నియంత్రణ లేదు

– డబ్బే పరమావధిగా దోచుకుంటున్న హైవే దాబాలు

బ్రిటిష్ హయాంలో 1800 లో ఏర్పడిన ఇండియన్ సరైస్ చట్టంలో హోటళ్లు లాడ్జీలు టాయిలెట్ కి అనుమతి ఇవ్వాలని బాటసారులకు ఉచిత నీటిని అందించాలని ఉంది. దీని అర్థం కస్టమర్ అయినా కాదా అనే దానితో సంబంధం లేకుండా యాక్సెస్ ఉచితం . ఈ చట్టం ప్రకారం, హోటళ్లలో నీటిని ఉచితంగా అడగవచ్చు వాష్‌రూమ్‌ను ఉపయోగించవచ్చు.

దేశంలోని అనేక రాష్ట్రాలు జిల్లాలు సరైస్ చట్టం, 1867 కింద హోటళ్ల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేశాయి. ఈ చట్టం ప్రకారం మీ పెంపుడు జంతువులకు నీటిని కూడా అడగవచ్చు. కాబట్టి, హోటళ్లలో ఉచితంగా నీరు త్రాగడానికి వాష్‌రూమ్ సౌకర్యాలను ఉపయోగించుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. మహిళలు, పిల్లలు హోటళ్లలో మంచినీరు, మరుగుదొడ్లు వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. హోటల్ రెస్టారెంట్ బార్ వారు తిరస్కరించి నట్లయితే, వారి ఆరోగ్య లైసెన్స్ రద్దు చేయబడే ప్రమాదం ఉందని వారి ట్రేడ్ లైసెన్స్ పునరుద్ధరించబడదని ఈ చట్టంలో పేర్కొంది.

ఈ చొరవ కింద కొన్ని రాష్ట్రాల్లో, హోటళ్లలోనే కాదు, పబ్బులు బార్‌లలో కూడా వాష్‌రూమ్‌లను ఉచితంగా ఉపయోగించవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి ప్రణాళికలు లేకపోయినా, టాయిలెట్లను ఉపయోగించవచ్చు, ఉచిత నీటి కోసం అడగవచ్చు. గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన ప్రజలు సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో టాయిలెట్లను ఉపయోగించాలని డిమాండ్ చేశారు. దీనిపై హోటల్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో పిల్ దాఖలైంది.

హోటల్ బయట పబ్లిక్ టాయిలెట్ నిర్మించాల్సి వచ్చింది. పౌరులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది, మన జీవితాలను సులభతరం చేయడానికి ఇటువంటి హక్కులు ఉన్నాయి. కాబట్టి, దానిని సరైన మార్గంలో ఉపయోగించుకునే బాధ్యత కూడా మనదే. హైవేల వెంబడి హోటళ్ల వ్యాపారుల చేతిలో కస్టమర్లు మోసపోవడం సాధారణమైంది. ప్రభుత్వ నియమం ప్రకారం, హోటల్ యజమానులు వారు అందించే ఉత్పత్తులు/సేవ, మెనూ, ధర ట్యాగ్‌ను పోస్ట్ చేయాలి. అయినప్పటికీ, ఇది సక్రమంగా అమలు చేయబడదు. వారు అందించే ఆహార నాణ్యతలో కూడా ఎటువంటి మెరుగుదల లేదు.

చాలా మంది ప్రయాణికులు గత్యంతరం లేక హోటళ్లకు వెళుతున్నారు. రహదారి వెంట ఉన్న హోటళ్లలో నాణ్యత ఏమాత్రం ఉండదు. మంచినీరు ఉండదు, నీరు కావాలంటే ప్లాస్టిక్ బాటిల్ కొనాల్సిందే. కస్టమర్లు ఎక్కువమంది ఉన్నప్పుడు రెండు లీటర్ల బాటిల్స్ కూడా ఉండవు. మంచి నీరు ఉండదు కానీ ఫౌంటెన్ నుండి నీరు పడుతుంటుంది. టర్కీ కోళ్లు, ఫారం కోళ్లు, కుందేళ్లు, బాతులు కృతిమ వాతావరణంలో పెంచుతుంటారు. కస్టమర్లను దోచుకోవడం పరమావధిగా ప్రవర్తిస్తుంటారు. కస్టమర్లు బిల్లు కూడా చూడకుండా డబ్బులు కడుతున్నారు.

నగరాల్లో ఉండే రద్దీ హోటల్స్ లోనే వారం రోజుల క్రిందటి చికెన్ మటన్ దర్శనమిస్తుంది, ఎక్కడో అడవిలో ఉండే హోటల్స్ లోని తిండిపదార్థాల గురించి చెప్పక్కర్లేదు. వీటిని నియంత్రించడానికి ఎవరూ ఉండరు, సానిటరీ ఇన్స్పెక్టర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఎవరూ పట్టించుకోరు. ఒక్క హోటల్ లోను ధరల పట్టిక ఉండదు. టీ వాటర్ బాటిల్ కొని వంద రూపాయలు ఇస్తే చిల్లర రాదు. ఇద్దరు టిఫిన్ చేస్తే ఐదు వందల రూపాయలు. మరిన్ని హోటళ్లు ధర్మల్ స్టేషన్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ కేవలం వీరి వెలుగు కోసం అన్నట్లు జిగేల్ జిగేలమని వెలుగుతుంటాయి.

ఎవడెట్లా పోతే నాకేంటి అని కస్టమర్లు నోరు మెదపక ఉన్నారు. తరచూ ప్రయాణాలు చేసే వారికి వేరే మార్గం లేదు, వినియోగదారులు తక్కువ నాణ్యత గల ఆహారం కోసం ఎక్కువ ధర చెల్లించవలసి ఉంటుంది. బస్సు ప్రయాణం చేసే వారికి మధ్యస్థంగా ఉండే హోటల్స్ దగ్గర బస్సులు నిలుపుతున్నారు. అక్కడ రుచి శుచి శుభ్రత ఏమాత్రం ఉండదు. టాయిలెట్స్ ఛండాలంగా ఉంటున్నాయి, హోటల్ పరిసర ప్రాంతాలల్లో మూత్ర విసర్జన చేయడంతో దుర్గంధం వెదజల్లుతుంటుంది.

సిగరెట్లు బీడీలు బహిరంగంగా త్రాగడం వలన మహిళలు పిల్లలు కూర్చోవడానికి ఇష్టపడరు. డ్రైవర్లకు హెల్పర్లకు కొంతమేర బెనిఫిట్స్ చెల్లించాలని, డ్రైవర్, హెల్పర్లకు కూడా ఉచితంగా భోజనం అందించాలి కావున కస్టమర్ల నుంచి డబ్బు గుంజుతున్నారు. ఆహార కల్తీని నిరోధించలేకపోతున్నారు. కల్తీ ఆహారం తిని ప్రయాణికులు జబ్బులు పాలవుతున్నారు. కల్తీ నూనెలు, వంట నూనెలు కందెను తలపిస్త ఉంటుంది. ఈ మధ్యకాలంలో చికెన్ లాలీ పాప్, పకోడాలలో చికెన్ వేస్ట్ కాళ్ళు, స్కిన్, ప్రేగులు కలపడం సాధారణం. హై వే డాబా లో కుళ్ళిన మాంసం పెడుతున్నారని, చికెన్ బిర్యానీ బదులు కుక్క బిర్యానీ పెడుతున్నారని చాల వార్తలు చదువుతూనే ఉన్నాం.

ఒక్క మాంసమే కాదు బయట చేసే ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలో ఆహార కల్తీ ఉంటుంది. అన్ని కూడా ఆహారంలో కల్తీ అవుతూనే ఉంటున్నాయి. పరిమితికి మించి రంగులు వాడకం ఎక్కువగా ఉంటున్నది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ కాపీ టీ స్టాల్స్ లో సింథటిక్ పాలు వినియోగం ఎక్కువగా ఉంటున్నది. ఇక ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనెలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పానీ పూరి చేసే ఇళ్లల్లో పందులు కూడా నివసించవు. ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్, ఐస్, నూడుల్స్ తయారు చేసే ప్రదేశాలలో శుచి శుభ్రత పాటించక అవి తిన్న వారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు.

రంగు రంగుల కూల్ డ్రింక్ బాటిల్స్ కొన్ని వాటికి ఊరు పేరుండదు, కుర్ కురే, లేస్, చిప్స్, బిస్కెట్, ముంగ్ దాల్, బాదాం మిల్క్, రోజ్ మిల్క్ అన్నీ నకిలీ ఉత్పత్తులు. ఎప్పుడో వండి పెట్టిన సమోసా, బజ్జిలు దుమ్ము పట్టి ఉంటాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతి రోజు తనిఖీ చేయాలి, తయారీ కేంద్రాలను పరిశీలించాలి, ఎక్కువ మోతాదులో రంగుల వాడకాన్ని , కల్తీ పాల వాడకాన్ని నియంత్రించి తగిన చర్యలు తీసుకోవాలి.

ప్రభుత్వం ఇలాంటి విషయాల పట్ల ఉదాసీనంగా ఉండటం సిగ్గుచేటు. వినియోగదారులు, ప్రజలు జాగరూకత అవసరం సామాజిక మాధ్యమాలలో హైవే దోపిడీ గురించి పోస్ట్ చేయాలి, అశుభ్రత, కనీస వసతులు కల్పించలేని హోటల్స్ పై ఫిర్యాదు చేయడానికి టోల్ నంబర్లు ప్రకటించాలి.

డా. యం.సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజా సైన్స్ వేదిక
9989988912

LEAVE A RESPONSE