Suryaa.co.in

Political News

ఎన్నికల వేళ నాట్యమాడుతున్నది దాదాగిరి.. ధనస్వామ్యమే!

-ఎన్నికల సంస్కరణలు అత్యవసరం ?
-బీజేపీ చిత్తశుద్ధి నిరూపించుకోవలసిన సమయమిది

నీతివంతమైన పాలనకు బాటలు వేయాల్సిన ఎన్నికల వ్యవస్తే నేడు మన దేశంలో భ్రష్ఠు పట్టి పోయింది. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికలు,ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈసీ నైతిక విలువలను ప్రశ్నార్ధకం చేసిన విషయం విదితమే. ప్రజాస్వామ్యానికి ప్రాణధారమైన ఎన్నికలను నిర్వహించే సమున్నత స్వతంత్ర వ్యవస్థ రాజీ పడరాదన్న సుప్రీం కోర్టు స్పూర్తిని పట్టించుకోవడం లేదు.

నేర గ్రస్త రాజకీయాలకు ముగింపు పలకడానికి దేశ అత్యున్నత న్యాయ స్థానం చూపుతున్న చొరవ అరణ్య రోదనగా మిగిలిపోతుంది.రాజకీయ అవినీతిని భూస్థాపితం చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించడంలేదు. నేరాలు,రాజకీయాలు పాలు,నీళ్లులా కలసి పోయి ప్రజాస్వామ్యాన్ని ప్రహసనంగా మార్చిన దుస్థితి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నా,సమగ్ర ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఏళ్ల తరబడి ఆదర్శాలు అరగదీతే తప్ప, ఆచరణ ఎరుగవు.

నేరారోపణలు వున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకట్ట వేసే శాసనం తోనే స్వచ్చ రాజకీయాలకు పునాది పడుతుందని,అటువంటి చట్టాన్ని పట్టలేక్కించాలని కొన్నేళ్ళ క్రితమే పార్లమెంటును సర్వోన్నత న్యాయస్థానం కోరింది.అయినా ఆచరించిన దాఖలాలు లేవు.దీనిని బట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ క్రతువు లో పాలకుల చిత్తశుద్ది ఏ పాటిదో అర్ధం అవుతుంది.

లెక్కకు మించి కుంభకోణాలతో కోటాను కోట్లు కోల్ల గొట్టిన నేతలు చట్టసభల్లోశాసన నిర్మాతలై వెలిగిపోతున్నారు.పార్లమెంట్ లో నేర చరిత్ర గలవారు,నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు 25 శాతం నుండి 43 శాతానికి ఎగబాకారు.ఈ అవ్యవస్థను రూపు మాపాలన్న ఆలోచన పాలక పక్షానికి రాకపోవడం ఆందోళన కలిగించే అంశం.

రాజ్యాంగంలోని 324 అధికరణ ద్వారా తనకి దఖలు పడిన విస్తృత అధికారాలతో ఎన్నికల సంఘం పటిష్ట చర్యలు తీసుకోవచ్చు.మిణుకు,మిణుకు అంటున్నప్రజాస్వామ్యం దీపం మళ్ళీ వెలుగొందాలి అంటే ఎన్నికల వ్యవస్థని సమూలంగా ప్రక్షాళించాలి.ప్రజాస్వామ్య వ్యవస్థని కంటికి రెప్పలా సర్వ స్వతంత్రంగా,స్వేచ్చగా,నిష్పక్ష పాతంగా ఎన్నికలు నిర్వహించే బలమైన అధికారం వున్న ఎన్నికల కమీషన్ నేడు కీలు గుర్రంగా మారి అధికారంలో వున్న పార్టీలకు అడుగులకు మడుగు లోత్తుతూ రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని తాకట్టు పెడుతున్నారు.

నేడు స్వయం ప్రతిపత్తి గల సుదృడ ఎన్నికల వ్యవస్థ అత్యవసరం. దశాబ్దాల క్రితమే ఎన్నికల సంస్కరణల ఆవశ్యకతను గుర్తించినా అవి నేటికీ పట్టాలెక్కలేదు.దానికి కారణం స్వార్ధ రాజకీయాలే.ఎన్నికల సంస్కరణలు అంటే నే వెనకడుగు వేస్తున్నారు.దశాబ్దాలుగా ఎన్నికల సంస్కరణలు ఎండమావిని తలపిస్తున్నాయి.

సమగ్ర ఎన్నికల సంస్కరణల కోసం ఈసీ, లా కమీషన్ సహ పలు నిపుణుల సంఘాలు మొరపెట్టు కొంటున్నా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లే ఇండియాలో, ఎన్నికల వేళ నాట్యమాడుతున్నది దాదాగిరి ధనస్వామ్యమే. దాని ధాటికి సమస్త యంత్రాంగాలు సర్వభ్రష్టమై పోతున్నాయి.ప్రజాస్వామ్యాన్ని కాపాడలేని,రౌడీ రాజకీయాన్ని,ధన బలాన్ని,దొంగఓట్లను నియంత్రించ లేని రాజ్యాంగ వ్యవస్థ ఎందుకు? రాజ్యాoగ వ్యవస్థలన్నిటినీ బ్రష్టు పట్టించిన తరుణంలో వాటిని బలోపేతం చెయ్యని పక్షంలో మొత్తం దేశ పరిపాలన వ్యవస్థే కుప్పకూలనున్నది.ఎన్నికల్లో ధనబలం,కండబలం అంతమోందించక పోతే స్వేచ్ఛాయుత ఎన్నికలకు అర్ధం ఉండదు. ఇందుకు నిర్మాణాత్మక ఎన్నికల సంస్కరణల దిశగా ముందుకు పోవడం తప్ప మరో మార్గం లేదు. భారత ప్రజాస్వామ్యాన్ని ప్రక్షాళించడం తక్షణావసరంగా మారింది. సమాజ శ్రేయాన్ని, దేశాభివృద్ధిని కాక్షించే వారికి స్వేచ్చాయుత ఎన్నికల వ్యవస్థే భరోసాగా నిలుస్తుంది.1990 లో గోస్వామి కమిటీనుంచి జస్టీస్ జె.ఎస్ వర్మ సారధ్యంలో ఏర్పాటు అయిన సంఘాల వరకు ఎన్నికల సంస్కరణలు అత్యావశ్యమని తేల్చి చెప్పాయి.

అందుకే ఇప్పటికైనా రాజకీయాల్లో విలువలు పెంచే విదంగా అన్ని వైపుల నుంచి కఠినాతి,కటిన మైన ఎన్నికల సంస్కరణల అమలుకు పూనుకోవాలి. ప్రజాతంత్ర వ్యవస్థ ధ్వంసం అవుతుందని అందుకు ఎన్నికల సంస్కరణలు తప్పనిసరి అని మాజీ ఎన్నికల కమిషనర్ శేషన్ ఎప్పుడో పునరుద్ఘాటించారు.
ఎన్నికల సంస్కరణల కోసం మొట్టమొదటిసారిగా నిర్మాణాత్మక చర్యలు చేపట్టి రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. అధికార దుర్వినియోగంతో అధికార ఫీఠాలను పదిలం చేసుకొంటున్న వారి వికృత పోకడలకు అడ్డుకట్ట వెయ్యాలి అంటే ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలకపాత్ర పోషించే ఎన్నికల సంఘం సర్వ స్వతంత్రంగా ఉండాలి. అధికారం ఉన్నవారి ఎదుట ధైర్యంగా నిలబడలేని బలహీనులను ఎన్నికల కమిషనర్లు గా నియమించకూడదని సర్వోన్నత న్యాయస్థానం కూడా దీటుగా స్పందించింది.

తమను నియమించిన వారికి రుణపడి ఉండాలని భావించే వ్యక్తులకు ఎన్నికల ప్రక్రియలో చోటివ్వరాదని, అధికారంలో ఉన్నవారికి దాస్యం చేయకుండా, బలహీనులను కాపాడటానికి ముందుకు వచ్చేలా ఎన్నికల కమిషనర్లు ఉండాలి .ప్రజాస్వామ్యానికి ఊపిరి వంటి ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగాలంటే ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

అలా చేసి చూపిన ఒకే ఒక్కడు టీఎన్ శేషన్ అని చెప్పాలి. ఆయన ఎన్నికల ప్రక్రియలో అనేక సంస్కరణలు అమలు చేశారు. అప్పటి వరకు ఉన్న వ్యవస్థలనే వాడుకుంటూ, అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించారు. తమ అధికార బలాన్ని ఉపయోగించి ఎన్నికల కమిషన్‌ రూపు రేఖలనే మార్చేశారు.భారత దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా 1990 డిసెంబరు 12 నుంచి 1996 డిసెంబరు11 వరకు సేవలందించారు.

ఆయన ఎన్నికల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేశారు. దొంగ ఓట్లను నిరోధించడం కోసం ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఈ పదవిని ఆయన చేపట్టేనాటికి ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆయన వచ్చిన తర్వాత దీనిని సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఎవరు ఏం చేసినా తన పదవి అంత తేలికైనది కాదని, తనను ఎవరూ ప్రభావితం చేయలేరని ఆయన రుజువు చేశారు.

టీఎన్ శేషన్ తన చర్యల ద్వారా సామాన్యుల్లో భారతీయ ఎన్నికల వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ఏ విధంగానూ ప్రలోభపెట్టకూడదని, బెదిరించకూడదని, వారికి మద్యం ఇవ్వకూడదని, ఎన్నికల ప్రచారానికి అధికార యంత్రాంగాన్ని వాడుకోకూడదని నిబంధనలు ఉన్నాయి. ఓటర్ల కుల, మతపరమైన మనోభావాల ఆధారంగా ఓట్లు అడగ కూడదని, మతపరమైన దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో ఎన్నికల ప్రచారం చేయకూడదని, లిఖితపూర్వకంగా ముందుగా అనుమతి తీసుకోకుండా లౌడ్‌స్పీకర్లను వాడకూడదన్న నిబంధనలు. వున్నాయి.

కానీ వాటిని ఆచరణలో పెట్టే సాహసం అంతకుముందు ఎవరూ చేయలేకపోయారు. శేషన్ సీఈసీగా పదవిని చేపట్టిన తర్వాత వీటిని అమలు చేయగలిగారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని శేషన్ కఠినంగా అమలు చేశారు.నిబంధనలను ఉల్లంఘించిన రాజకీయ నేతలపై కొరడా ఝళిపించారు. దీంతో ఆయనంటే ప్రజలకు ప్రత్యేక గౌరవం ఏర్పడింది.

శేషన్ దూకుడును తట్టుకోలేని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు అదనంగా ఇద్దరు కమిషనర్లను నియమించింది. కనీసం ఇద్దరు కమిషనర్లను నియమించాలని సంయుక్త పార్లమెంటరీ సంఘం సిఫారసు చేసింది.

ఇది ప్రతిపక్షాల ఏకగ్రీవ డిమాండ్ కావడం విశేషం. ముగ్గురు కమిషనర్ల విధానాన్ని అమలు చేయడాన్ని టీఎన్ శేషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎన్నికల వ్యవస్థకు పట్టిన జాడ్యాలను ప్రాలదోలాలి అంటే ఎన్నికల సంస్కరణలు ఒక్కటే మార్గం. కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వం అయినా సత్వరం ఎన్నికల సంస్కరణలకు శ్రీకారం చుట్టి రాజకీయ అవినీతి నిర్మూలనపై తన చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సి వుంది.

అనేక ప్రజాస్వామ్య దేశాలు రాజ్యాంగ వ్యవస్థలు బలోపేతమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు పటిష్ట సంస్కరణలు చేపడుతున్నాయి.అందుకే భారత్ లో కూడా నేరమయ రాజకీయాలపై సమరం సాగించాల్సిన సమయం ఆసన్నమైనది.కొందరికి అవినీతి జీవన విధానంగా మారి దేశాన్ని నాశనం చేస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ నిబంధనలు కాలరాసేందుకు వీలు లేకుండా ఎన్నికల సంస్కరణలు అమలు చేసి ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేస్తే తప్ప ఈ దుస్థితి మారదు.ఇందుకు సమగ్ర ఎన్నికల సంస్కరణలే రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు మార్గం కాగలవు.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

LEAVE A RESPONSE