Suryaa.co.in

Andhra Pradesh

చీకట్లు పోవాలి … వెలుగులు రావాలి…

– ప్రజా యుద్ధం క్యాలెండర్ ఆవిష్కరణ సభలో అమరావతి ఉద్యమకారుల ఉద్ఘాటన

2023 వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్ముకున్న చీకట్లు తొలగాలని, 2024 నూతన సంవత్సరంలో రాష్ట్రంలో వెలుగులు రావాలని పలువురు రాజధాని ఉద్యమ నాయకులు ఉద్ఘాటించారు. ఆదివారం గుంటూరు జిల్లా తుళ్ళూరు దీక్షా శిబిరంలో అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య రూపొందించిన ప్రజాయుద్ధం క్యాలెండర్ ను బాల బాలికలు ఆవిష్కరించారు.

అమరావతి రాజధాని పరిరక్షణ సమితి నాయకులు బెల్లంకొండ నరసింహారావు అధ్యక్షతన జరిగిన సభలో బాలకోటయ్య మాట్లాడుతూ 55 నెలల వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని, అన్ని సామాజిక వర్గాలు రోడ్లపై కొచ్చారని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి విధ్వంసంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధ్వంసం కూడా మొదలైందన్నారు. మూడు రాజధానుల మూర్ఖపు పట్టుదల కారణంగానే వైసిపి పార్టీలో ముసలం పుట్టిందని, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలో నుంచి వెళ్ళిపోతున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకతను సమర్థవంతంగా వినియోగించుకొని, ప్రతిపక్ష పార్టీలు పోరాడాలని, వారి పోరాటంలో ఉద్యమ శక్తులను గౌరవించి, అసెంబ్లీకి పంపాలని బాలకోటయ్య విజ్ఞప్తి చేశారు.

పారిశ్రామిక వేత్త వెలగపూడి గోపాల కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ తాను అమరావతికి మద్దతు పలికానని బిజెపి సస్పెండ్ చేసిందని, ఆ తర్వాత బిజెపి అమరావతికి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. రాజధాని రైతుల పోరాటం తెలుగు నేల మరువలేదని, మహిళలు పడ్డ కష్టాలు వర్ణనాతీతం అన్నారు. అమరావతి ఉద్యమంలో బలమైన గొంతుక గా గుర్తింపు పొందిన బాలకోటయ్యను అసెంబ్లీకి పంపాల్సిన అవసరం రాజకీయ ప్రతిపక్ష పార్టీలపై ఉందని మహిళల హర్షద్వానాల మధ్య ప్రకటించారు.

అమరావతి రాజధాని ఐక్య కార్యచరణ కమిటీ కన్వీనర్ పువ్వాడ సుధాకర రావు మాట్లాడుతూ రాజధాని ఉద్యమం ఇంతటితో ఆగలేదని, రేపటి నుంచి భవిష్యత్ కార్యాచరణతో ముందుకు వెళుతుందన్నారు. రాబోవు ఎన్నికల్లో అమరావతి సత్తా చూపిస్తామని చెప్పారు. నవతరం పార్టీ అధ్యక్షులు రావుల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుదీర్ఘమైన రాజధాని ఉద్యమం గిన్నిస్ బుక్ లో ఎక్కుతుందో , లేదో తెలియదు కానీ, తెలుగు నేల చరిత్ర లో ఎక్కిందన్నారు. రాజధాని రైతులకు ఇంటా, బయటా, ఖండాంతరాలలో కూడా మద్దతు వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

జనసేన పార్టీ నాయకులు యర్రగోపు నాగరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి అమరావతికి అండగా ఉన్నారన్నారు. రిటైర్డ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్ వేములపల్లి విఠల్ మాట్లాడుతూ వైసీపీకి మరో మారు అధికారమిస్తే, రాష్ట్రం అంథకారంలోకి వెళ్తుందని, తెలుగు రాష్ట్రాన్ని కాపాడుకోలేని దుస్థితి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.

రైతు సమాఖ్య నాయకులు కళ్ళెం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ లోనూ అమరావతిని కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాల్సి ఉందన్నారు. సభలో ఆకుల ఉమామహేశ్వరరావు, నార్ల రాజేష్, అప్పారావు, గోవిందమ్మ తదితరులు ప్రసంగించారు. నూతన సంవత్సర క్యాలెండర్ ను నేటి బాలలే రేపటి పౌరులంటూ గీర్వాణి, యోగేష్ పలువురు బాలలతో ఆవిష్కరింప చేశారు.

LEAVE A RESPONSE