– ప్రజల ప్రాణాలను కాపడటంలో ప్రభుత్వం పూర్తి వైఫల్యం
– నేటికీ కొనసాగుతున్న తురకపాలెం మరణాలు
– నేడు తురకపాలెంకు వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం
– వైయస్ జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువెళ్ళాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన గ్రామస్తులు
తాడేపల్లి: గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం తురకపాలెంలో గత ఆరునెలలుగా అంతుచిక్కని కారణాలతో జరుగుతున్న మరణాలను అడ్డుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందంటూ, తమ సమస్యను ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుతూ గుంటూరు జిల్లా వైయస్ఆర్సీపీ నేతలతో పాటు తురకపాలెం గ్రామస్తులు వైయస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసారు.
మరణించిన కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తోందని ఈ సందర్బంగా వారు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైయస్ఆర్సీపీ ప్రతినిధి బృందం తమ గ్రామాన్ని సందర్శించిన తరువాత మాత్రమే ప్రభుత్వం స్పందించిందని, అయినా నేటికీ మరణాలు జరుగుతూనే ఉన్నాయని, ఈ ప్రభుత్వం తమ ప్రాణాలను కాపాడటంలో చిత్తశుద్దితో వ్యవహరించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ జగన్ దృష్టికి సమస్యను తీసుకువెళితే తప్ప తమకు న్యాయం జరగదని సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద వారు మొరపెట్టుకున్నారు. తురకపాలెం బాధితుల విషయాన్ని వైయస్ జగన్ దృష్టికి మరోసారి తీసుకువెడతామని, గ్రామస్తులకు వైయస్ఆర్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు.