ఒకపక్క ప్రకృతి పగ పడితే… మరో పక్క ప్రభుత్వం దగా చేసింది

-దీవెన పేరిట వంచన… భరోసా పేరిట దగా
-మంగళగిరిలో లోకేష్ ను ఓడించడానికి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల పంపిణీ
-మీ స్థలం కాదు కదా అన్న న్యాయస్థానం వాళ్లకి ఇవ్వాల్సిన ప్లాట్లు ఇచ్చారా? లేదా?? అని ప్రశ్నించకపోవడం విడ్డూరం
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

రెక్కలు ముక్కలు చేసుకునే రైతన్నను ఒక పక్క ప్రకృతి పగ పడితే, మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం దగా చేసింది. అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రాంతాలలో ఒక్క మంత్రి కూడా పర్యటించకపోవడం దారుణం. ముఖ్యమంత్రి కొంపలో కూర్చొని జీవో నెంబర్ ఒకటిపై, పదవ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంపు గురించి సమీక్షా సమావేశాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. మూడు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ప్రకృతి విపత్తుల గురించి వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంటుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తీవ్రస్థాయి నష్టం జరగకుండా రైతులు జాగ్రత్త పడతారు. ఈ సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖకు 30 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉండగా, చెల్లించకపోవడం వల్ల రైతులకు ముందస్తు వాతావరణ సమాచారం తెలియకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి నాలుగు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తానన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, దమ్మిడి ఇచ్చింది లేదన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయి. రైతు భరోసా కేంద్రాలలో ధాన్యాన్ని అమ్మాలంటే ఈ క్రాఫ్ లో పేరు నమోదయి ఉండాలి. కౌలు రైతుల పేర్ల ను ఈ క్రాఫ్ లో నమోదు చేయరు. రైతు భరోసా కేంద్రాలలో విక్రయించిన ధాన్యానికి సకాలంలో డబ్బులు చెల్లించింది లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను దీవెన పేరిట వంచన, భరోసా పేరిట దగా చేస్తోందని మండిపడ్డారు. కౌలు రైతుల ఆత్మహత్యలు చూసి చలించి పోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బులలో నుండి కొంత మొత్తాన్ని అందజేసి ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే, ఆయనపై అధికార పార్టీ నాయకులు అవాకులు చవాకులు పేలడం సిగ్గుచేటు. పంట నష్టపోయిన ప్రాంతాలలో ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ, రైతుల మధ్య ఆరు రోజులుగా ఉంటున్నారు. ఆయన్ని పట్టుకొని వంగలేక క్రికెట్ స్టంప్ లపై కొబ్బరికాయ కొడుతున్న జగన్మోహన్ రెడ్డి ముసలివాడనడం విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో నరసాపురంలో పొలంలోకి తనని దిగమన్నావు. కానీ తాను దిగేందుకు నిరాకరించాను. పొలంలోకి దిగకపోతే కష్టం తెలిసేది ఎలా అని ప్రశ్నించి, ప్రజలను మభ్య పెట్టేలా నటించేందుకు నువ్వు పొలంలోకి దిగావు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎక్కడ? అని ప్రశ్నించావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు .

రజినీకాంత్ ను తిట్టించడానికి కేటాయించిన సమయం కూడా రైతుల కోసం కేటాయించవా?
ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ప్రశంసించినందుకు దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ పైకి పదిమంది మంత్రులను ఉసిగొలిపావు. రజినీకాంత్ ను తిట్టించడానికి వెచ్చించిన సమయం కూడా రైతుల బాగోగుల కోసం కేటాయించవా? జగన్మోహన్ రెడ్డి అంటూ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మంత్రులు సచివాలయంలో, తమ, తమ ఆఫీసులలో అందుబాటులో ఉండరు. ప్రజా సమస్యలపై చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ నిర్వహణకు ఆసక్తిని ప్రదర్శించదు. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజా సమస్యలే పట్టవు. ప్రజలను మభ్యపెట్టడానికి నటించే నటనలో ఐదవ శాతం నిజాయితీగా పని చేస్తే రైతు సమస్యలు పరిష్కారమవుతాయి. రైతులకు టిడిపి ప్రభుత్వ హయాంలో చేసిన సహాయం లో నాలుగవ శాతం సహాయమైన ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే, రైతులకు చేసిందేమిటని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు.

కోర్టును మభ్యపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం
రాష్ట్ర హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం, కోర్టును మభ్యపెట్టింది. రైతులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం కోర్టు తప్పు కాదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పది . గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని న్యాయ శాస్త్రంలో అక్షర జ్ఞానం లేని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన వాదనలను వినిపించారు. ఒకవైపు న్యాయస్థానంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని అంగీకరిస్తూనే, మరొకవైపు రాజధాని ప్రాంతాన్ని విధ్వంసం చేయాలనే కుట్ర చేస్తున్నారు. న్యాయస్థానం తీర్పును అనుసరించే రాజధాని అభివృద్ధిలో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానానికి విన్నవించింది. దానికి రాష్ట్ర రాజధాని రైతులు అడ్డుపడుతున్నారని పేర్కొంది. దీనితో మీది కానీ, మీకు రాని ప్లాట్ లలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసుకుంటే మీకెందుకు అభ్యంతరం అని రైతుల పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టి వేసింది. రాజధాని రైతులకు వ్యతిరేకంగా తీర్పు వెలువడనుందని తాను ముందే అంచనా వేశాను. ఇదే విషయాన్ని రచ్చబండ కార్యక్రమంలో తెలియజేశాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటూనే తుది తీర్పుకు లోబడి ఉండాలని ధర్మాసనం వెల్లడించింది. తుది తీర్పును వెలువరించడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో, ఎన్ని మాసాల సమయం పడుతుందో తెలియదు. రాజధానిపై ఏందిరా ఈ కుట్ర అని ఆరా తీస్తే… రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అధికార పార్టీ పెద్దలకు తెలిసింది. అందుకే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకువచ్చి ఓటర్లుగా చేర్పించాలని నిర్ణయించుకున్నారు. అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలని గత ప్రభుత్వం భావిస్తే, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉంది.

పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. అందరూ సపోర్ట్ చేస్తారు. తన ప్యాలెస్ బయట పేదల గృహాలను కూల్చివేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. నవ నగరాల నిర్మాణ కోసం కేటాయించిన స్థలం కాకుండా ఇతర ప్రాంతంలోని స్థలములో లేఅవుట్ వేసి అభివృద్ధి చేసి పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్న ప్లాట్లు మీవి కాదు కదా అని అమరావతి రైతులతో అన్న న్యాయదేవత, రాజధాని నగర నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములను ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాలను ఇచ్చారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రైతులు తమ వ్యవసాయ భూములను అప్పగిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ లక్ష్యానికి తిలోదకాలు ఇచ్చింది. గతంలో ఎలక్ట్రానిక్ సిటీ నిర్మిస్తామని చెప్పిన చోట ఇప్పుడు వల్లకాడు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ప్రశ్నించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లక్ష 80 వేల రూపాయలకు కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి అగ్గిపెట్టె లాంటి చిన్న ఇళ్లను కడితే, రేపు తీర్పు మరో రకంగా ఉంటే కూడా, ఆ ఇళ్లన్నీ కూల్చి వేస్తారా మీ లార్డ్ అంటూ సుధాకర్ రెడ్డి వంటి వారు అభ్యంతరాన్ని తెలియజేస్తారు. రాజధాని అమరావతి భూములకు సిఆర్డిఏ, రాష్ట్ర ప్రభుత్వం యజమాని కాదు. ఒక గొప్ప ఆశయంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించిన భూములవి. నవ నగరాల పేరిట రాజధానిని నిర్మిస్తామని చెబితే నమ్మి అమరావతి ప్రాంత రైతులు తమ వ్యవసాయ భూములు ఇచ్చారు. గత నాలుగేళ్లుగా అభివృద్ధి చేసింది లేదు. రైతులకు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పిన ప్లాట్లు ఇచ్చింది లేదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పసిపిల్లాడి మాదిరిగా తాను విశాఖపట్నం వెళ్లిపోతానని అంటాడు. ఆయన వంది మాగాదులు కూడా అదే మాట చెబుతుంటారు. రేపు రాష్ట్ర రాజధాని రైతుల పరిస్థితి ఏమిటి?. రాజధాని అన్నది లేకపోతే ఎవరి భూములు వారికే ఇవ్వాలి. రాజధాని ప్రాంతంలో ఒక అసెంబ్లీ మాత్రమే ఉంటుందని ఒకరు చెబుతుంటే, మరొకరు అది ఎడారి ప్రాంతమని అంటుంటే… 30 వేల ఎకరాల భూములు అవసరమా?. ఎవరి భూములు వారికి తిరిగి ఇవ్వగలరా?. ఇస్తే ఎలా ఇవ్వాలి. నష్టపరిహారంతోనా?, నష్ట పరిహారం లేకుండానా?? అన్నది నిర్ణయించుకోవాలి. సుప్రీం కోర్టులో ఒకవైపు రాజధాని కేసు పెండింగులో ఉండగానే, 1134 ఎకరాల్లో పాకలు వేసేందుకు పేదలకు ఇళ్ల స్థలాలు పంచడం న్యాయమా?. నువ్వు ఒక పాలకుడివా… గుండెల్లో ఇంత విషాన్ని పెట్టుకొని, పైకి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ నటిస్తావా??. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?. రైతులకు ఇవ్వాల్సిన భూములను లే అవుట్ వేసి ప్లాట్లుగా అభివృద్ధి చేసి ఇవ్వాలి. అలాగే నవ నగరాల నిర్మాణాన్ని యధావిధిగా కొనసాగించాలి. అదనపు భూములను పేదలకు పంచితే ఎవరికీ ఎటువంటి అభ్యంతరం ఉండదు. అవా భూముల్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు 7వేల కోట్ల రూపాయలు కొట్టివేసినట్లుగా అధికార పార్టీ నుంచి బయటికి వచ్చిన ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం అందరికీ ఇల్లు నిర్మించి ఇస్తానని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి గతంలో 5, ఆ తరువాత మరో 50 ఇళ్లను నిర్మించారని ఒక ప్రశ్నకు జవాబుగా పార్లమెంటులో వెల్లడించారు. పేదలకు ఇల్లు నిర్మిస్తానని చెప్పి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు లేఅవుట్ వేయకుండానే, 51 వేల మందికి ప్లాట్లను పంపిణీ చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. రాజధాని అమరావతి రైతులకు సుప్రీంకోర్టులో న్యాయం జరిగే అవకాశం ఉందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

తెలంగాణ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టిన అమర్ రాజా సంస్థ
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి దగ్గరగా అమర్ రాజా బ్యాటరీ సంస్థ ప్లాంటుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. తిరుపతి పరిసరాలను దాటి వెళ్లడం ఇష్టం లేని గల్లా రామచంద్ర నాయుడు, స్థానికంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 40 నుంచి 50 వేల మంది వరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించారు. నా జన్మభూమి పుణ్యభూమి అనుకునే గల్లా రామచంద్ర నాయుడు ఇప్పుడు తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్లలో పెట్టుబడులను పెడుతున్నారు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి అన్నది నిర్వివాదాంశం. తన చుట్టూ ఉన్న నలుగురితో మీటింగులు పెట్టి, ముఖ్యమంత్రి వారికి వేల ఎకరాల భూములను కట్టబెడుతున్నారు. వాటాలు ఇవ్వనందుకు పెట్టుబడులను పెట్టే పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమి వేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సంపదను సృష్టిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంపదను తుంచేస్తున్నారు. హైదరాబాద్ క్షణక్షణాభివృద్ధి చెందుతోంది. జగన్మోహన్ రెడ్డి బయోపిక్ లో తమిళ హీరో జీవా నటించనున్నారట. వారు బయోపిక్ తీస్తే, తాము భయో పిక్ తీస్తాం. జగన్మోహన్ రెడ్డి అరాచకాలన్నింటిని భయోపిక్ లో చూపిస్తాం. ఆ సినిమా షూటింగ్ ప్రారంభించిన రోజే, తమ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాం. అది రిలీజ్ చేసిన రోజే, ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం. ఆ సినిమా ఒక్కరోజు ఆడితే, తమ సినిమా రెండు రోజులు ఆడుతుంది. తెలంగాణ రాష్ట్ర నాయకుడు గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలతో తాను పరిపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. గతంలో నక్కకు నాగలోకానికి అనే సామెత వాడే వారని, రానున్న రోజుల్లో వైయస్సార్ పాలనకు, జగన్మోహన్ రెడ్డి పాలనకు ఉన్నంత తేడా అని మాట్లాడుకుంటారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత తమ పార్టీ పరిస్థితి శంకరగిరి మాన్యాలే అన్నట్టుగా తయారయిందని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తమ కనీస ప్రతిపక్ష హోదా అయిన దక్కుతుందో లేదో చూడాలి. నెల్లూరు, అనంతపురం, ఇప్పుడు ఒంగోలులో తిరుగుబాటు మొదలయ్యింది. త్వరలోనే చిత్తూరు జిల్లాలో ఒక రెడ్డి తిరుగుబాటు చేయనున్నారు. మే 14వ తేదీ నాటికి తనను నిర్బంధించి, లాకప్లో చిత్రహింసలకు గురిచేసి ఘటన రెండేళ్లవుతుంది . అయినా ఇప్పటివరకు తాను దాఖలు చేసిన కస్టోడియల్ టార్చర్ పిటిషన్ విచారణకు రాలేదు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో విచారణకు రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుపడ్డారు. లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ కూడా తనని హింసించిన అధికారులను పిలిచి విచారించలేదు. ఇదే విషయమై తాను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలవాలని నిర్ణయించుకున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రక్తపు మరకలు తుడిచింది ఎవరో స్పష్టంగా చెప్పిన సీఐ శంకరయ్య
వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనంతరం రక్తపు మరకలను తుడిచింది ఎవరో సీఐ శంకరయ్య స్పష్టంగా చెప్పారు. పనిమనిషి లక్ష్మి రక్తపు మరకలను తూడ్చగా, సాక్షాలను భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తారుమారు చేశారని సిబిఐ చార్జిషీట్లో వెల్లడించడం జరిగింది. ఈ దారుణ హత్య కాండ లో సాక్షాలను తారుమారు చేసిన వారి ప్రమేయం ఉందని స్పష్టంగా వెల్లడించిందని రఘు రామకృష్ణం రాజు తెలిపారు. సాక్షి రాతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కృష్ణారెడ్డి గతంలో ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా, మరొక టీవీకి ఇచ్చిన వాకింగ్ ఇంటర్వ్యూలో పేర్కొనడం పరిశీలిస్తే సాక్షులు ప్రభావితమవుతున్నారని స్పష్టమవుతుందన్నారు.

Leave a Reply