-ఐదేళ్ల కుమార్తె కాళ్లు, చేతులు కట్టేసి మండుటెండలో మిద్దెపై పడేసిన తల్లి!
హోం వర్క్ చేయలేదని ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి తన ఐదేళ్ల కుమార్తెపై కర్కశంగా వ్యవహరించింది. కాళ్లు, చేతులు కట్టేసి మిట్టమధ్యాహ్నం ఇంటి మిద్దెపై వదిలేసింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎండవేడిమికి తాళలేక బాలిక పెడుతున్న
ఆర్తనాదాలు నెటిజన్లతో కన్నీళ్లు తెప్పించాయి. బాలిక ఒకటో తరగతి చదువుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని టుకుమీర్‌పూర్‌లో వీరి కుటుంబం నివసిస్తోంది.
మిద్దెపై నుంచి బాలిక ఏడుపులు వినిపిస్తుండడంతో చూసిన పక్కింటి వారు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్‌కు ట్యాగ్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆ తల్లిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
శారీరక దండన పిల్లల స్వేచ్ఛ, గౌరవానికి సంబంధించిన హక్కును దుర్వినియోగం చేస్తుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 చెబుతోంది. 14 ఏళ్ల వరకు పిల్లల విద్యాహక్కుతోపాటు జీవించే హక్కును, గౌరవాన్ని ఇది పరిరక్షిస్తుంది. అలాగే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(E) పిల్లల లేత వయసు దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటుంది. వీటితోపాటు పిల్లల స్వేచ్ఛను రక్షించేందుకు రాజ్యాంగంలో పలు సెక్షన్లు ఉన్నాయి. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు బాలిక తల్లిపై కేసు నమోదు చేశారు. బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించామని, బాలిక తల్లిపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.
After a video of a girl child tied up on the roof of a house surfaced on social media, all possible efforts were made by Delhi Police to ascertain her identity and circumstances. The family of the child has been identified and appropriate action initiated.#DelhiPoliceCares
— Delhi Police (@DelhiPolice) June 8, 2022
#Update The concerned authorities have taken immediate action, and the matter is currently being investigated. https://t.co/xpu36TM6PT
— Delhi Commission For Protection of Child Rights (@DCPCR) June 8, 2022