– విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అనాలోచిత నిర్ణయం
పెద్ద నోట్ల రద్దు నిరంకుశ చర్య. ఈ నిర్ణయంతో ఫలితం తక్కువ.. ఇబ్బందులు ఎక్కువ. ఒక్కమాటలో చెప్పాలంటే, నోట్ల రద్దు నిర్ణయం భారత్ వంటి ఓ విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. –ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్
పెద్ద నోట్ల రద్దు ఓ విఫల ప్రయత్నం, ఈ నిర్ణయం వద్దని ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించా. నల్లధనం వెలికితీతలో నోట్ల రద్దు కంటే ఉత్తమమైన ప్రత్యామ్నాయాలను సూచించా. అయితే, వాటిని పట్టించుకోలేదు. – ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్
నోట్ల రద్దు ఓ పెద్ద వైఫల్యం. నల్లధనానికి, దానికి అసలు సంబంధమే లేదు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం గొప్పగా సాధించిందేమీ లేదు.– ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి
పెద్ద నోట్ల రద్దు చట్ట విరుద్ధమైన చర్య. ప్రజాప్రతినిధులు ఉన్న పార్లమెంట్‌లో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. అలా జరగలేదు. ఒకేసారి అన్ని సిరీస్‌ల నోట్లను రద్దు చేయడం ఎంతో తీవ్రమైన అంశం. దేశ ఆర్థిక వ్యవస్థపైనే కాకుండా ప్రతి సామాన్య పౌరుడిపై ఈ నిర్ణయం ఎంతో దుష్ప్రభావాన్ని చూపించింది.– సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బీవీ నాగరత్న
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ కు పెద్దగా లభించలేదని పిస్తుంది. గొప్ప ఫలితాన్ని ఆశించి తీసుకున్న నిర్ణయం నిరాశనే మిగిల్చింది. సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. కొందరు దళారీలకు లాభించింది. పెళ్లిళ్లు, ఇతర అవసరాలకు సామాన్యులు పెద్ద నోట్లు భద్రపరుచుకుంటే, వాటి రద్దు నిర్ణయం పిడుగు పడినట్లయింది. వాటిని మార్చుకోవటానికి బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. రోజుల కొద్దీ పడిగాపులు కాశారు. విదేశాల్లో ఉన్నవారు గడువులోగా రాలేక, వాటిని వదులుకోలేక ఇబ్బందుల పాలయ్యారు.
ధనవంతులు తమ పలుకుబడి ఉపయోగించి, పెద్దనోట్లు మార్చుకోగలిగారు. నల్లధనం ప్రభుత్వం అనుకున్నరీతిలో బయట పడలేదని ఆర్థిక వేత్తల అభిప్రాయం. ప్రధాని మోదీ ఆరున్నరేండ్ల కిందట తీసుకొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని వెల్లడైంది. నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడానికి, దొంగనోట్లు ముద్రణను అడ్డుకోవడానికి, ఉగ్రవాదులకు నిధుల సరఫరాను అరికట్టడానికి ఈ నిర్ణయం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిందని తేలిపోయింది.
నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశవ్యాప్తంగా 62 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వేలాది కంపెనీలు మూతబడ్డాయి. నగదు కోసం బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలైన్లలో నిలబడి 108 మంది మృత్యువాతపడ్డారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే సర్కారీ దవాఖానల్లో ఇచ్చే రూ.2 వేల కోసం దాదాపు 265 మంది ఈ ఆపరేషన్లు చేయించుకొన్నారు. నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టం – రూ. 5 లక్షల కోట్లు . నోట్ల రద్దుతో పట్టుబడిన నకిలీ నోట్ల విలువ – రూ. 250 కోట్లు.
మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టడానికి ముందు అంటే 2014 మార్చి నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.13 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా. 2022 మార్చి నాటికి ఈ మొత్తం రూ.31.33 లక్షల కోట్లకు చేరింది. 2014లో జీడీపీలో 11.6 శాతంగా ఉన్న నగదు విలువ. 2022 మార్చి 25 నాటికి 13.7 శాతానికి పెరిగింది. నగదు డబుల్‌నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అలాంటప్పుడు, నోట్ల వాడకం తగ్గాలి.
అయితే, నోట్ల రద్దు నిర్ణయం తీసుకొన్న 2016 నుంచి ఇప్పటివరకూ నోట్ల వాడకం దాదాపుగా రెట్టింపు కావడం గమనార్హం. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం.. 2016లో రూ.16.41 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉండగా, 2022 డిసెంబర్ 23 నాటికి ఇది 32.42 లక్షల కోట్లకు చేరింది. దాదాపుగా రెట్టింపైంది. ప్రజల వద్ద ఉన్న నోట్ల సంఖ్య కూడా 30% పెరిగినట్టు గత డిసెంబర్‌లో నిర్మల పార్లమెంట్‌లో వెల్లడించారు.
దేశ చరిత్రలో పెద్ద నోట్ల రద్దు జనానికి ఒక పెద్ద పీడ కల, పాలకులకు ఘోర వైఫల్యం. ఆరు సంవత్సరాల తరువాత ‘పెద్ద నోట్ల రద్దు లక్ష్యాన్ని సాధించిందా?’ అన్న అంశాన్ని విచారించేందుకు ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్డు డివిజన్ బెంచ్ అంగీకరించింది. తీర్పు తీరు తెన్నులు ఎలా ఉన్నప్పటికీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయ ఫలితాలు, పర్యవసానాల మంచి చెడ్డల గురించి జరిగే చర్చలో అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి.
లెక్కాపత్రం లేని ధనాన్ని పన్ను అధికారులకు వెల్లడించటం లేదా బ్యాంకుల్లో జమ మినహా మరొక మార్గం లేదన్న ఎందరో దాన్ని అవినీతి, నల్లధనంపై మెరుపు (సర్జికల్) దాడిగా పేర్కొన్నారు. ఆ తరువాత తెలంగాణలో జరిగిన హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నిక, గుజరాత్, ఇప్పుడు కర్ణాటక ఎన్నికలో లెక్కా పత్రం లేని డబ్బు ప్రవాహాన్ని చూసిన తరువాత మోడీ అమాయకుడై అలా చెప్పారా లేక జనాలను వెంగళప్పలుగా భావించినట్లా?
నోట్ల రద్దు జరిగి నెల తిరక్కుండానే బిజెపి నేత శేఖర్ రెడ్డి ఇంట్లో వందల కోట్లు దొరకడం, గత సంవత్సరం పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చటర్జీ, అతని సన్నిహితురాలు అపర్ణా ముఖర్జీ ఇళ్లలో అధికారికంగా ప్రకటించిన రూ.49.80 కోట్ల నగదు కట్టలు, ఐదు కోట్ల విలువైన బంగారం వారి వద్దకు ఎలా చేరినట్లు? ఇది సముద్రంలో కాకి రెట్ట వంటిది. నిజానికి చిత్తశుద్ధితో దాడులు చేస్తే దేశంలో అలాంటివి ఇంకా ఎన్ని దొరికేదీ చెప్పాల్సిన పని లేదు.
నగదు చెలామణిని తగ్గించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేసింది. కానీ ఆచరణాత్మకలో కేంద్ర ప్రభుత్వం సాధించిందేమీలేదని రిజర్వుబ్యాంక్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత పదేళ్లుగా రిజర్వు బ్యాంకు వెలువరించిన వార్షిక నివేదికల్లో కేంద్రం వైఫల్యం స్పష్టమవుతోంది. పెద్ద నోట్ల రద్దు తరువాత కూడా నగదు చెలామణి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా వార్షిక నివేదికల్లో ప్రచురించిన డేటా, గత పదేళ్లలో దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీ నాణేలు) సిఐసి, జిడిపి నిష్పత్తిని కేంద్రం తెలిపింది.
నకిలీ కరెన్సీ అరికట్టడం, నల్లధనం వెలికితీత, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నియంత్రించడం తదితర అంశాల్లోనూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. నకిలీ నోట్ల సమస్య మళ్లీ తీవ్రమైంది. మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో నకిలీ నోట్లు 10.7శాతం పెరిగాయని ఆర్‌బిఐ నివేదించింది. రూ.2000 నకిలీ నోట్లు 54.16శాతంపెరిగాయని గతేడాది నివేదికలో బహిర్గతమైంది.
పెద్ద నోట్ల రద్దు వలన సుమారు నాలుగున్నర లక్షల కోట్ల మేర నగదు చలామణి నుంచి అదృశ్యమౌతుందని ఎస్‌బిఐ ప్రధాన ఆర్ధిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ 2016 నవంబరు 14వ తేదీన బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో రాసిన విశ్లేషణలో పేర్కొన్నారు (అంటే ఆమేరకు ప్రభుత్వానికి లబ్ధి చేకూరినట్లే). పోపుల డబ్బాల్లో దాచుకొని నోట్ల రద్దు తెలియని వారు, ఇతర కుటుంబ సభ్యులకు తెలపకుండా కొంత మొత్తాలను దాచుకొని అవి వెల్లడైతే కుటుంబంలో కలతల గురించి భయపడినవారు తప్ప నల్ల ధనికులందరూ తమ సొమ్మును తెల్లగా మార్చుకున్నారని అధికారిక గణాంకాలే చెప్పాయి.
ఆశించిన ఫలితాలు రాకపోవటంతో భంగపడిన అధికారపార్టీ పెద్దలు పెద్ద నోట్ల రద్దు వలన అసలెందుకు చేశారో చెప్పటం మానేసి దీని వలన డిజిటల్ చెల్లింపులు పెరిగాయి కదా అని వాదించారు. అది కూడా నిజం కాదు. కార్డుల ద్వారా చెల్లిస్తే రెండు శాతం అదనంగా వసూలు చేస్తుండటంతో జనాలు తిరిగి నగదుకే మొగ్గారు. అనేక దుకాణాల్లో యుపిఐ చెల్లింపులను అంగీకరించటం లేదు.
కార్డులు లేదా యుపిఐ లావాదేవీలను పెంచేందుకు ప్రపంచంలో ఏ దేశంలో కూడా పెద్ద నోట్ల రద్దు అనే పిచ్చిపనులు చేయలేదు. కానీ కొందరు ఈ ఘనతను నరేంద్రమోడీకి ఆపాదించేందుకు మరో సాకు లేక పెద్ద నోట్ల రద్దుకు ముడిపెట్టారు.
పెద్ద నోట్ల రద్దు తరువాత నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మారిందని చెప్పే పెద్దమనుషులతో, డిజిటల్ లావాదేవీలు పెరిగాయంటూ టీ స్టాల్, కూరల దుకాణాల ఉదాహరణలు చెప్పే అమాయక జనం నోళ్లు మూతబడ్డాయి.
పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలకు అవినీతితో సంబంధం ఉంటుందని పెద్ద నోట్ల రద్దు ప్రసంగంలో నరేంద్ర మోడీ నే చెప్పారు. నోట్ల రద్దు జరిగి ఏడేళ్లు కావస్తున్నా , నల్లధనం ఎలా జడలు విరుచుకొని తిరుగుతోందో రిజిస్ట్రారు కార్యాలయాలను సందర్శించిన వారికి తెలిసిందే.
పెద్ద నోట్ల రద్దుకు ముందు 2015-16లో నగదు చెలామణి జిడిపిలో 12.1 శాతం ఉంది. రద్దు తరువాత సంవత్సరం అది 8.7 శాతానికి తగ్గింది. నగదును తీసుకొనేందుకు బ్యాంకులు పడిన ఇబ్బంది గురించి వాటిలో పని చేసే వారికి తెలుసు. తరువాత అది ఇంతింతై వటుడింతై అన్నట్లుగా నరేంద్రమోడీ ఏలుబడిలో కొత్త రికార్డులను బద్దలు చేసింది. నగదు చెలామణి – అవినీతికి ఉన్న సంబంధం గురించి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా వరదలపుడు గోదావరి నీటి మట్టం పెరిగే మాదిరి 2021-22లో 16.8 శాతానికి పెరిగింది.
మోడినోమిక్స్ ప్రకారం ఉక్రెయిన్ సంక్షోభం లేకున్నా నగదు చెలామణితో ద్రవ్యోల్బణం, ధరలు పెరిగి ఉండేవి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం చమురు మీద పన్నులు తగ్గించినపుడు బంకుల వద్ద పన్నుల గురించి బోర్డులు పెట్టాలని బిజెపి పెద్దలు చెప్పినట్లుగా ఇప్పుడు అవినీతి స్థాయి గురించి బోర్డులు పెడితే తప్ప జనానికి అర్ధం కాదు.
పెద్ద నోట్ల రద్దు వలన పన్నుల వసూలు పెరిగిందని చెప్పవచ్చు తప్ప దానికి ఆధారాలు చూపటం చాలా కష్టం. ఎందుకంటే అది జరిగిన కొద్ది నెలలకే 2017 జులైలో జిఎస్‌టి విధానాన్ని తీసుకు వచ్చారు.ఆ తరువాత కార్పొరేట్ పన్ను మొత్తాన్ని గణనీయంగా తగ్గించారు. అందువలన పన్ను లక్ష్యాలను ఏ మేరకు సాధించిందీ, దాన్ని పెద్ద నోట్ల రద్దుకు ముందు తరువాత చూడాలన్నది కొందరి అభిప్రాయం. తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టినా దీర్ఘకాలంలో పరిస్థితి మెరుగు పడుతుందని చెప్పారు. కానీ జరిగిందేమిటి?
పెద్ద నోట్ల రద్దుకు ముందు 2011-12 నుంచి 2016-17 వరకు జిడిపి వృద్ధి రేటు 5.2 నుంచి 8.3 శాతానికి పెరిగింది. తరువాత దానికి భిన్నంగా కరోనాకు ముందు 2019-20 నాటికి నాలుగు శాతానికి దిగజారింది. మరుసటి ఏడాది కరోనాతో 7.3 శాతం తిరోగమనంలో పడింది. తరువాత వృద్ధి రేటు ఇంకా కరోనా పూర్వపు స్థితికి చేరుకోలేదు. అలాంటపుడు ఏ శాస్త్రీయ పరిశీలన ప్రాతిపదికన పెద్ద నోట్ల రద్దుకు-పన్నుకు ముడిపెట్టారు?
అదేవిధంగా యుపిఐ చెల్లింపుల పెరుగుదల గణనీయంగా ఉంది. అది పెద్ద నోట్ల రద్దుకు ముందే ప్రారంభమై ఉంటే తరువాత పెరుగుదల ఎక్కువగా ఉంటే దాని ఫలితమే అనవచ్చు. యుపిఐ సౌకర్యాన్ని ప్రవేశపెట్టిందే 2016 ఏప్రిల్ పదకొండున, ఆ ఏడాది అసలు లావాదేవీలు జరగలేదు. 2017 నవంబరు నాటికి కూడా నామమాత్రమే. అందువలన దానికి పెద్ద నోట్ల రద్దుకు సంబంధమే లేదు.
పన్ను ఎగవేత, ఆర్థిక నేరాలకు తావు లేకపోతే గత ఎనిమిదిన్నర సంవత్సరాల్లో విపరీతంగా పెరిగిన దాడులకు ఏ భాష్యం చెబుతారు? పోనీ దాడులతో సాధించింది ఏమిటో చెప్పాలి. 2004 నుంచి 2014 వరకు 112 ఇ.డి దాడులు జరిగితే 2014 నుంచి 2022 వరకు 3,010 దాడులు చేసినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.
నూటపన్నెండు దాడుల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం రూ.5,346 కోట్లు. సగటున 47.73 కోట్లు. కాగా 3010 దాడుల్లో స్వాధీనం చేసుకున్నది రూ.99,356 కోట్లు సగటున 33 కోట్లు ఉంది. దేశంలో అక్రమ లావాదేవీలు ఇంతేనా? ఎంతకాలం జనాన్ని మభ్య పెడతారు. 3010 కేసుల్లో శిక్షలు పడింది కేవలం 23 ఉదంతాల్లో, అందుకే వీటిని ప్రతిపక్షాల నేతల మీద బెదిరింపు దాడులని జనాలు అనుకుంటున్నారు.
ఏటా జిఎస్‌టి 85 వేల కోట్ల మేరకు ఎగవేస్తున్నట్లు బ్రిటన్‌కు చెందిన రుబిక్స్ సంస్థ అంచనా వేసింది. ప్రభుత్వం కూడా దాదాపు ఇలాంటి మొత్తాల గురించి అధికారికంగా ప్రకటిస్తున్నది. ఇలాంటి వైఫల్యాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు.