న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు కూడా హరించడం దారుణం

– భూ తగాదాలపై కిందిస్థాయి కోర్టులను కాకుండా హైకోర్టును మాత్రమే ఆశ్రయించాలనడం హాస్యాస్పదం
– లక్షల భూ తగాదా కేసులను ఒక్క హైకోర్టు మాత్రమే పరిష్కరిస్తుందా?, హైకోర్టు లాయర్ల ఫీజులను సామాన్యులు భరించగలరా??
– కొత్త భూ హక్కు చట్టం ద్వారా రాష్ట్ర ప్రజలకు సరికొత్త సమస్యలు
– ఎమ్మెల్యేలతో ఆడుదాం కార్యక్రమంలో భాగంగా మరో పదిమందికి జగన్ ఝలక్
– అంగన్వాడీల, ఆశా వర్కర్ల డిమాండ్ సహేతుకమే
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

భూతగాదాలపై న్యాయ స్థానాలను ఆశ్రయించే హక్కును కూడా కొత్త భూ హక్కు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హరించాలని చూడడం దారుణమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. సలార్ చిత్రంలోని ఖాన్సర్ సామ్రాజ్యం తరహాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త నిబంధనలతో చట్టాలను తీసుకువచ్చి పరిపాలిస్తున్నారు. ఇదొక ప్రజాస్వామ్య దేశం, రాష్ట్రమని ఆయన మర్చిపోతున్నారు. రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, భూతగాదాలపై కోర్టులకు వెళ్లే హక్కులను కూడా హరించాలనుకోవడం తప్పన్నారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నూతన భూహక్కు చట్టం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నగరం, పట్టణం, విశాఖపట్నం తరహాలో మారిపోతుందే మోననే భయం ప్రజల్లో నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త భూ హక్కు చట్టాన్ని చదివితే భయం వేస్తుందన్నారు. కొత్త భూ హక్కు చట్టం ప్రకారం ఇప్పటికే వ్యవసాయ భూములకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు, వైకాపా రంగులతో ముద్రించిన పాసుబుక్ లను ఇచ్చినట్లుగానే ఇప్పుడు గృహాలకు, ఖాళీ స్థలాలకు పాసుబుక్ ఇవ్వనున్నారు.

ఆ పాస్ బుక్ పై యధావిధిగా జగన్మోహన్ రెడ్డి అమృత వదనంతో కూడిన ఫోటోతో పాటు, వైకాపా రంగులను ముద్రించడం జరుగుతుంది. గృహ, ఖాళీ స్థల యజమానులకు పాస్ బుక్ మంజూరు చేసే బాధ్యతను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఇందులో ఏమైనా భూతగాదాలు ఉంటే మున్సిఫ్, జిల్లా కోర్టును కాకుండా, ఏకంగా హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా ను ఇచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ విధానాన్ని అమలు చేస్తోంది . పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించాలనుకున్నప్పుడు టైటిల్ డిడ్ తో ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడానికి వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని నీతి అయోగ్ వారు ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు.

వ్యవసాయ భూముల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసిన డ్రాఫ్ట్ చట్టానికి ఏపీ ప్రభుత్వం విచిత్ర విన్యాసాలతో సవరణలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టంలో రెవిన్యూ అధికారి పాసుబుక్ ఇచ్చిన తర్వాత భూ తగాదాలు తలెత్తితే, సివిల్ కోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్టు, మున్సిప్ కోర్టు లకు, ఆ భూ తగాదాలను విచారించే అధికారం లేదని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి మాత్రమే భూతగాదాలను పరిష్కరించే అధికారాన్ని కట్టబెడుతూ, ఒకవేళ ఆయన చేత సమస్య పరిష్కారం కాకపోతే అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి మాత్రమే పరిష్కరించేలా అధికారాలను కట్టబెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తలెత్తే భూ తగాదాలతో కొన్ని లక్షల ఫిర్యాదులు అందితే రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారా? అన్నది సందేహాస్పదమేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

రాష్ట్ర రెవిన్యూ శాఖ కార్యదర్శి కూడా భూ తగాదాలను పరిష్కరించ లేనప్పుడు మాత్రమే హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటును ఈ చట్టం ద్వారా కల్పించారు. శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలకు చెందిన వారైనా, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన వారైనా తమ 100 సెంట్లు భూమి పంచాయతీ అయిన, ఒక్క సెంటు భూమి పంచాయతీ అయినా, వారు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాల్సిందే. హైకోర్టుకు లక్షలాదిగా వెల్లువెత్తే భూతగాదాలను పరిష్కరించే మెకానిజం ఉందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అమెరికాలో నివసించే వ్యక్తి, తనకు ఉన్న ఇంటిని ఎవరికైనా అద్దెకు ఇస్తే, అతను ఫేక్ డాక్యుమెంట్ సహాయంతో రెవెన్యూ అధికారిని మేనేజ్ చేసుకొని తన పేరిట పాసుబుక్ పొందితే, అమెరికాలో ఉన్నవారు కూడా రాష్ట్రానికి వచ్చే కోర్టు చుట్టూ తిరగాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ఆస్తి హక్కు పాస్ బుక్ లో ఓనర్ ఫోటో మాత్రం ఉండదు. గ్రీ క్, ఈజిప్షన్ నాగరికత మాదిరిగా పాలించే ప్రభువు ఫోటో మాత్రమే ఉంటుంది. మూడు నెలల తరువాత కనుమరుగయ్యే ముఖ్యమంత్రి ఫోటో శాశ్వత డాక్యుమెంటుపై అవసరమా?!. పొలాల, స్థలాల డ్యాకుమెంట్ పై ముఖ్యమంత్రి ఫోటో ముద్రించడం అన్నదే అనైతికం. భూతగాదాలు ఏర్పడితే రాజ్యాంగం ప్రకారం న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులు బాటు కల్పించారు. ఇప్పుడు జ్యుడిషరీ పవర్ ను కూడా ఎగ్జిక్యూటివ్ కు అప్పగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యను చేపట్టినందుకు న్యాయవాది చక్రపాణి ఇప్పటికే న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఇంకొంతమంది న్యాయవాదులు కూడా న్యాయస్థానంలో ఇదే తరహా పిల్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చట్టం ద్వారా ప్రజలు దారుణంగా నష్టపోబోతున్నారు.

గత చట్టం ప్రకారం 12 సంవత్సరాల పాటు ఆక్యుపేషన్లో ఉంటే భూ హక్కులు సంక్రమించేది. కానీ నూతన చట్టం ప్రకారం ఐదేళ్లకే భూ హక్కు ను కల్పించాలని నిర్ణయించారు. రెవెన్యూ అధికారి సహకారంతో ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఇంటిని కబ్జా చేసిన వారు, ఆ ఇంట్లోకి నిజమైన యజమానిని రానిస్తారా? అన్న భయాందోళనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ఈ చట్టం వల్ల మన ఆస్తి మనకు దక్కకుండా పోతుందేమోనన్న ప్రమాదం పొంచి ఉంది. ఎవరినైనా ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలనుకుంటే, ఈ చట్టం ద్వారా దారుణంగా ఇబ్బంది పెట్టే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రజలంతా మూకుమ్మడిగా నిరసనను తెలియజేయాలి. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కును తొలగించి తీసుకువచ్చే ఈ కొత్త చట్టం ద్వారా, కొన్ని లక్షల భూతగాదాలు కొత్తగా తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి .

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనాలోచితంగా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టింది. జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే విధంగా ఆయన సలహాదారులు సలహాలను ఇవ్వాలి. నూతన చట్టం ద్వారా ప్రజలు తీవ్రఆగ్రహం తో ఉన్నారని, ఈ చట్టాన్ని ప్రవేశపడితే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని జగన్ మోహన్ రెడ్డి కి చెప్పాలి. మూడు నెలల తర్వాత ఎలాగో ఈ ప్రభుత్వం అధికారంలో నుంచి దిగి పోతుంది. మూడు నెలల తర్వాత నూతనంగా ఏర్పడే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ డ్రాఫ్ట్ తో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అన్ వాంటెడ్ అడ్వాంటేజ్ తీసుకోకుండా జనమోదంతో ప్రజలకు తమ ఆస్తి హక్కు ను కల్పిస్తుంది. ఆస్తి హక్కు పత్రాలపై ఉంటే మీ ఫోటోలే ఉంటాయి. అంతేకానీ వెకిలి నవ్వులు చిలిపి నువ్వులతో కూడిన ఇతరుల ఫోటోలు ఉండవు. ఆస్తి మాదే ఫోటో మాదే అనే నినాదంతో ప్రజలు ముందుకు వెళ్లాలి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని కోర్టు నిలువరిస్తే సంతోషం. లేకపోతే పాలకులే వెనక్కి తీసుకుంటే మరి సంతోషమని రఘురామకృష్ణం రాజు అన్నారు.

500 కోట్ల ప్రజాధనంతో చిన్న ఇల్లు నిర్మించుకున్న ముఖ్యమంత్రి, అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంచరా?
విశాఖపట్నంలో 500 కోట్ల ప్రజాధనంతో చిన్న ఇంటిని నిర్మించుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడి, ఆశా వర్కర్లు జీతాలను పెంచమంటే పెంచరా? అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అంగన్వాడి, ఆశా వర్కర్ల డిమాండ్ సహితుకమైనదే. పొరుగు రాష్ట్రాలలో అంగన్వాడి, ఆశా వర్కర్లకు ఇస్తున్నంతగా జీతాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అందరి పిల్లలని తమ సొంత పిల్లల్లా చూసుకునే అంగన్వాడీలు, మహిళలు, బాలింతల బాగోగులను పట్టించుకునే ఆశా వర్కర్లకు 17 వేలు కాకపోతే 18వేల రూపాయల జీతాన్ని కోరుకుంటే తప్పేముంది.

ఇందులో సింహభాగం కేంద్ర ప్రభుత్వమే నిధులను మంజూరు చేస్తుంది. అవసరమైతే జీతాలను పెంచిన తరువాత, కేంద్ర ప్రభుత్వాన్ని నిధులను పెంచమని కోరుదాం. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో, జీతాలను పెంచకపోతే వారి జీవితం దుర్భరం అవుతుంది. మున్సిపాలిటీ సిబ్బంది కూడా తమను రెగ్యులరైజ్ చేసి, జీతాలను పెంచాలని సమ్మె చేస్తున్నారు. వాలంటీర్లు కూడా తమను కాంట్రాక్టు ఉద్యోగులుగా పరిగణించి జీతాలను పెంచాలనే వింత వాదనను తెరపైకి తెచ్చారు. వారి వాదనను నేను సమర్థించడం లేదు. వాలంటీర్ల చేత పార్టీ పనులనే పాలకులు ఎక్కువగా చేయించుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తరఫున వాలంటీర్లకు 5000 రూపాయల గౌరవ వేతనం ఇస్తుండగా, పార్టీ పనులు చేయించుకుంటున్నందుకు అదనంగా 10 నుంచి 15 వేల రూపాయలు ఇస్తారేమో చూడాలి.

వాలంటీర్ల ను చూసుకొని ప్రస్తుత పాలకులు, పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు పంచాయితీ వ్యవస్థ పూర్తిగా వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకం. కూర్చోమంటే కూర్చునే ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం. పులివెందుల ప్రజలు కూడా వ్యతిరేకమే. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తయారయింది. అయినా, జగన్మోహన్ రెడ్డికి చెప్పడం అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లేనని, అయినా నేను చెబుతున్నానని రఘురామకృష్ణం రాజు ఎద్దేవా చేశారు.

నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐడి నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిఐడి చీఫ్ సంజయ్, రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి లు వివిధ నగరాలలో పత్రికా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడిన తీరుపై , ఒక వ్యక్తి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయగా నేను ఇంప్లిడ్ అయ్యాను. ఈ కేసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్ లో బుధవారం మధ్యాహ్నం వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా సంజయ్, సుధాకర్ రెడ్డి లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది.

అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ఆసక్తి కలిగిన విద్యార్థుల చేత ఆటలను ఆడించండి. అంతేకానీ మార్చ్ లో పరీక్షలు పెట్టుకొని, ఇప్పుడు 45 రోజులపాటు విద్యార్థుల చేత బలవంతంగా ఆటలు ఆడించడం సరికాదు. ఇదే విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి చేత బ్యాటింగ్ మెలకువలను నేర్చుకున్న క్రీడా శాఖ మంత్రి రోజాకు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, ఉపాధ్యాయులను వేధించే విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు విన్నవించారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

మళ్లీ అధికారంలోకి వస్తున్నాం… రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తా నని మభ్యపెడుతున్న జగన్మోహన్ రెడ్డి
రాష్ట్రంలో మళ్లీ మనమే అధికారంలోకి వస్తున్నామని, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి భవిష్యత్తులో రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని పలువురు నాయకులను జగన్మోహన్ రెడ్డి మభ్యపెడుతున్నట్లుగా తెలిసిందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.ఎమ్మెల్యేలతో ఆడుదాం కార్యక్రమంలో భాగంగా మరో 10 మంది ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, సిద్ధారెడ్డి, కరుణం ధర్మ శ్రీ, ఉష శ్రీ చరణ్, ఆదాల ప్రభాకర్ రెడ్డిలకు రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్లుగా టీవీల్లో వార్త కథనాలు వచ్చాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన విందుకు ఆహ్వానం లేకుండానే వైకాపా ఎంపీలు హాజరయ్యారని, పిలవకపోయినా సహచర ఎంపీ, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో అభినందించారని నేను ఎంతో గొప్పగా చెప్పాను. అయితే తెలుగు ఎంపీ లను అందరిని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి కోరినట్లు తెలిసింది. ప్రస్తుత మా పార్టీ ఎంపీలు నా వ్యాఖ్యలతో నొచ్చుకున్నట్లయితే మన్నించాలని రఘురామకృష్ణం రాజు కోరారు.

Leave a Reply