Suryaa.co.in

Andhra Pradesh

పల్నాడులో ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్‌ కోసం పోటెత్తిన జనం

– వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి

తాడేప‌ల్లి: పల్నాడులో మాజీ సీఎం, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటనకు కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా ఎన్ని ఆటంకాలు కల్పించినా, ప్రజలు వాటిని అధిగమించి ప్రభంజనంలా జగన్ వెంట నిలిచారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌రెడ్డి అన్నారు.

తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పోలీసులను ఉపయోగించి అనుమతులను నిరాకరించడం, జనం రాకుండా బారికెట్లను అడ్డుపెట్టి దౌర్జన్యం చేయించినా సరే జగన్ కోసం జనం పోటెత్తారని అన్నారు.

పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్ కోసం తరలివచ్చారు. తాడేపల్లి నుంచి రెంటపాళ్లకు చేరుకునేందుకు 9 గంటల సమయం పట్టిందంటే ఎంతగా జనప్రవాహం వైయస్ జగన్ వెంట పయనించిందో అర్థం చేసుకోవచ్చు. దీనిని చూసిన కూటమి నేతల గుండెలు బద్దలయ్యాయి.

సీఎంగా చంద్రబాబు ఏడాది పాలనలో రోజురోజుకు దిగ‌జారిపోతున్నారు. ధుర్యోధ‌నుడి కబంధ హ‌స్తాల్లో చిక్కుకుని ధృత‌రాష్ట్రుడు ఎలాగైతే కౌర‌వ ‌సామ్రాజ్య ‌ప‌తనానికి కార‌ణ‌మ‌య్యాడో, అలాగే లోకేష్ ప‌ద‌వీ కాంక్ష వ‌ల్ల చంద్ర‌బాబు రాష్ట్రాన్ని, తెలుగుదేశం పార్టీని స‌ర్వ‌నాశ‌నం చేసే పరిస్థితి తెచ్చుకుంటున్నాడు. మ‌హానాడు పేరుతో క‌డ‌పలో స‌భ నిర్వ‌హించి వేల వాహ‌నాల్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను తర‌లించడానికి లేని ఆంక్ష‌లు మా నాయ‌కుడు వైయస్ జగన్ పర్యటనకు ఎలా విధిస్తున్నారో ఆత్మపరిశీలన చేసుకోవాలి.

కూటమి ప్రభుత్వ వేధింపుల వల్ల నాగమల్లేశ్వరావు చ‌నిపోతే ఆయ‌న విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్ వెళ్తుంటే బెట్టింగ్‌కి బానిసై ఆత్మ‌హత్య చేసుకున్నాడ‌ని టీడీపీ నాయ‌కులు త‌ప్పుగా మాట్లాడుతున్నారు. నా బిడ్డ బెట్టింగ్ వ‌ల్ల చ‌నిపోయాడ‌ని నిరూపిస్తే ఏ శిక్ష కైనా సిద్ధ‌మ‌ని నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు తండ్రి స‌వాల్ విసిరాడు. దానికి స‌మాధానం చెప్పే ద‌మ్మున్న టీడీపీ నాయ‌కులు బ‌య‌ట‌కు రావాలి.

LEAVE A RESPONSE