– 2022- 23 వ సంవత్సరంలో 12 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం తగదు
– కార్పొరేట్లకు విద్యుత్ సంస్థలను ధారాదత్తం చేయడం అక్రమం
– విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణలో విజయవాడలో సిపిఎం నిరసన
– విచారణలో పాల్గొని అభ్యంతరాలు తెలిపిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు
బహిరంగ విచారణలో సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పాల్గొని తమ అభ్యంతరాలను రెగ్యులేటరీ కమిషన్ కు సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ………
2022-23 సంవత్సరంలో 9222 కోట్ల రూపాయలు ట్రూ అప్ చార్జీలు, పేద, మధ్యతరగతి ప్రజల పై స్లాబ్ లో మార్పిడి పేరుతో 887 కోట్ల రూపాయలు, డెవలప్మెంట్ చార్జీల పెంపు, స్థిర ఛార్జీలు ,ఒక ఇంటికి ఒక మీటరు విధానం తదితర రూపాల్లో 12 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజలపై పడనుంది.పేద దిగువ మధ్యతరగతి ప్రజలపై 50 యూనిట్ల లోపు వారికి 38 శాతం, 75 యూనిట్లలోపు వినియోగించే వారికి 26 శాతం, 100 యూనిట్లు వినియోగించే వారికి 54% , 200 యూనిట్లు వినియోగించే వారికి 45 శాతం భారం పడుతుంది.పేదలపై భారం వేసి పెద్దలకు రాయితీలు ఇచ్చే ప్రతిపాదనలను మార్చాలి.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో విధించిన షరతులకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయి విద్యుత్ సంస్థను సర్వనాశనం చేస్తోంది. క్రాస్ సబ్సిడీ ఎత్తివేత, ప్రభుత్వ సబ్సిడీల నిలిపివేత, ఓకే స్లాబు దిశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడవటం ప్రమాదకరం.ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గటం, విద్యుత్ కొనుగోలు రేట్లు తగ్గటం తదితర కారణాల వల్ల విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి. కానీ ఛార్జీలు పెంచడం అన్యాయం. ట్రూ అప్ చార్జీల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి.చార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలి.దొడ్డిదారిన, కనపడకుండా, పరోక్షంగా కొత్త రూపాలలో వైఎస్సార్ ప్రభుత్వం విద్యుత్ బాదుడు ప్రారంభించింది. కృష్ణపట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 25 సంవత్సరాల పాటు పేరుతో కారుచౌకగా ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం ఆత్మహత్యా సదృశ్యం.
సమర్థత కలిగిన వారికి ధర్మల్ కేంద్రాన్ని అప్పగిస్తామని రాష్ట్ర మంత్రివర్గం భావించటం రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ లను అసమర్థులుగా చిత్రీకరించుకోవడం అవమానకరం. విద్యుత్ ఉత్పత్తి సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడం దీనితో ప్రారంభం అయ్యి దశలవారీగా సాగుతుంది.ప్రజల సొమ్ముతో నెలకొల్పిన విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే అధికారం ఈ ప్రభుత్వాలకు లేదు. ఈ ప్రతిపాదన విరమించుకోవాలి.25 సంవత్సరాల పాటు అదానీ కంపెనీ నుండి సౌర విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలకు హానికరం. గత ప్రభుత్వాలు చేసుకున్న ప్రైవేటు విద్యుత్ ఒప్పందాలు రద్దు చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం అదే దారిలో ప్రయాణించి విద్యుత్ ప్రైవేటీకరణ సంపూర్ణంగా చేయడానికి పూనుకోవడం గర్హనీయం.
ఒకవైపు ఇప్పటికే మిగులు విద్యుత్ ఉండి, ప్రభుత్వ ధర్మల్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేస్తూ ఉండగా, అదనంగా మరో 7 వేల మెగావాట్ల విద్యుత్తు అదానీ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించడం అత్యంత ప్రమాదకరం. ఈ ఒప్పందానికి రాష్ట్రప్రభుత్వం, విద్యుత్ నియంత్రణ మండలి ఆగమేఘాల మీద ఆమోదించటం శోచనీయం.విద్యుత్ పంపిణీ సంస్థల లోటు, నష్టాలు, అప్పులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రజలు కారణం కాదు. లోటు పేరుతో ప్రజలపై భారాలు మోపడం అన్యాయం.
ప్రభుత్వం సబ్సిడీలు సక్రమంగా చెల్లించకపోవడం, ప్రభుత్వ సంస్థల నుండి వేల కోట్ల రూపాయల విద్యుత్ బిల్లుల బకాయిలు పేరుకుపోవడం, ప్రభుత్వ విద్యుత్ సంస్థ ఉత్పత్తి నిలిపివేసి మార్కెట్లో ప్రైవేటుగా, భారీగా విద్యుత్ కొనుగోలు చేయటం తదితర ప్రభుత్వ విధానాల వల్లే లోటు ఏర్పడుతున్నది.కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి బాధ్యత వహించాలి. అప్పులు, నష్టాలు పేరుతో ప్రభుత్వ, ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న ప్రభుత్వ విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడం దారుణం.దుబారాతో పాటు విశృంఖల అవినీతి వలన ఖర్చులు పెంచి వినియోగదారులపై భారాలు వేస్తున్నారు. వ్యవసాయ విద్యుత్కు మీటర్లు కొనుగోళ్లు, మెటీరియల్ కొనుగోళ్లు అంచనాలు, జగనన్న కాలనీ
విద్యుత్ సౌకర్యాల కల్పనలో అధిక అంచనాలు తదితర రూపాలలో వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నది.
ప్రజా ప్రతినిధులు, కొందరు ఉన్నతాధికారులు, బడా కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు సిండికేట్లుగా ఏర్పడి విద్యుత్ సంస్థలను దోచుకుంటున్నారు.ప్రజలపై భారాలు మోపుతున్నారు. రైతు పంపుసెట్లకు మీటర్లు పెట్టీ రైతులకు ఉరితాళ్లు బిగిస్తున్నారు, ఈ పేరుతో వేల కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారు.సబ్ స్టేషన్ల ఆటోమేషన్ పేరుతో 25 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులోనూ భారీ అవినీతికి ఆస్కారం ఉంది. వీటికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. విద్యుత్ నియంత్రణ మండలి అనుమతించరాదు. విద్యుత్ భారాలకు, విద్యుత్ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి వ్యతిరేకంగా భవిష్యత్తులో ఆందోళన చేస్తాం.
నియంత్రణ మండలి తప్పులు సరిదిద్దాలి. భారాలు తగ్గించాలి. నేడు విజయవాడ ఎలక్ట్రిసిటీ ఎస్. ఇ. ఆఫీస్ లో జరిగిన బహిరంగ విచారణలో ఆన్లైన్లో బాబురావు పాల్గొని వివరంగా ప్రజల తరఫున అభ్యంతరాలు తెలియజేశారు. 15 రోజులు ముందుగానే 32 పేజీల వివరమైన అభ్యంతర పత్రాన్ని సిపిఎం తరపున అందజేశారు. నేడు సిపిఎం కార్యకర్తలు ప్లే కార్డులు చేతబూని బహిరంగ విచారణ సందర్భంలో నిరసన తెలిపారు.