Suryaa.co.in

Andhra Pradesh

జీవో..నెం.13తో కల్లు గీత కులస్తుల అభివృద్ధి

– లైసెన్స్ ఫీజులో 50% రాయితీతో కనుమరుగైపోతున్న గౌడ కులాన్ని చంద్రబాబు కాపాడారు
– గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి

విజయవాడ: గీత కులస్తులకు యువత నేత నారాలోకేష్ యువగళం పాదయాత్రలో ఇచ్చిన హమీ మేరకు, కూటమి ప్రభుత్వం జీవో నెం. 13 ద్వారా గీత కులస్తులకు మద్యం దుకాణాల్లో 10 శాతం వాటా కింద 335 మద్యం దుకాణాలను కేటాయించింది. ఈ అంశంపై గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గీత కులస్తులకు 10 శాతం రిజర్వేషన్‌తో పాటు 335 దుకాణాలకు లైసెన్స్ ఫీజులో 50 శాతం రాయితీని అందించడం ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డారు.

గీత కార్మికుల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం “గీసేవానికే చెట్టు” పథకాన్ని తీసుకువస్తే, వైసీపీ ప్రభుత్వం “దోచుకునే వారిదే పాలసీ”ని అనుసరించిందని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పట్టణాలకు 55 కిలోమీటర్ల పరిధిలో ఉండాలని జీవో తీసుకొచ్చారు. గత ఐదేళ్ల పాలనలో జగన్ రెడ్డి జీవో నెం. 693 తీసుకొచ్చి 100 కిలోమీటర్ల దూరంలో కల్లు దుకాణాలు ఉండాలని నిబంధనలు పెట్టారని గుర్తు చేశారు.

గీత కార్మికులకు 50 సంవత్సరాల వయసులోనే పింఛన్ టీడీపీ హయాంలో ఇవ్వడం జరిగిందని అన్నారు. గీత కార్మికులకు రూ. 105 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో గీత కార్మికుల కోసం 60 ఎకరాల భూమిని కేటాయించి నీరా తాడి పరిశ్రమను స్థాపించేందుకు కృషి చేసినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పనలో బాగంగా రాబోయే ఐదేళ్లలో చిన్న పరిశ్రమల ద్వారా ఉద్యోగాలు సృష్టిస్తామని అన్నారు.

బీసీలకు స్థానిక సంస్థలలో 33 శాతం రిజర్వేషన్లు టీడీపీ ప్రభుత్వం కల్పించడం ద్వారా రాజ్యాధికారంలో భాగం కావడం సాధ్యమైందని చెప్పారు. గత వైసీపీ పాలనలో 10 శాతం రిజర్వేషన్ తగ్గించడం వల్ల 18 వేల మంది బీసీలు రాజకీయ పదవులకు దూరం అయ్యారని ఆరోపించారు. విదేశీ విద్య ద్వారా బీసీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదుకునే అవకాశం తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిందని అన్నారు
. బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో బీసీల అభివృద్ధి కోసం రూ. 37,970 కోట్లు కేటాయించడం జరిగిందని, రాబోయే రోజుల్లో కుట్టు మిషన్లు, పాడి గేదెలు, గోర్రెల పెంపకం, జనరిక్ మెడిసిన్ షాపులు ద్వారా బీసీలకు 50 శాతం అవకాశాలు కల్పించి వారి అభివృద్ధి కోసం కృషి చేస్తామని అన్నారు.

LEAVE A RESPONSE