Suryaa.co.in

Andhra Pradesh

శ్రీవారి అన్న‌ప్ర‌సాదం అధ్వానం

– నాణ్య‌త‌లేని ఆహారంపై భ‌క్తులు ఆగ్ర‌హం… ప‌ట్టించుకోని టిటిడి
– టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం

క‌ళ్ల‌కు అద్దుకుని, ఆ దేవ‌దేవుడు అందించిన‌దిగా శ్రీవారి భ‌క్తులు భావించే అన్న‌ప్ర‌సాదం ప‌ర‌మ అధ్వానంగా త‌యార‌వ‌డంపై టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరుమ‌ల వెంగమాంబ అన్న‌ప్ర‌సాదశాల‌లో త‌మ‌కు నాసిర‌క‌మైన భోజ‌నం పెట్ట‌డంపై భ‌క్తులు ఆందోళ‌న దిగ‌డం తిరుమ‌ల కొండ‌పై జ‌రుగుతున్న అవినీతికి నిద‌ర్శ‌నం అని లోకేష్ ఆరోపించారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న మంగ‌ళ‌వారం విడుద‌ల చేశారు.

తిరుమలలో శ్రీవారి అన్నదాన నిలయాన్ని మా తాత‌గారైన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఏప్రిల్ 6, 1985న ప్రారంభించార‌ని, అప్ప‌టి నుంచి అంచెలంచెలుగా అంద‌రి స‌హ‌కారంతో అన్న‌దాన స‌త్రాలు విస్తృతంగా ఏర్పాటై ఇప్ప‌టివ‌ర‌కూ కోట్లాది మందికి అన్న‌ప్ర‌సాదాన్ని అందించి ఆక‌లి తీర్చాయ‌న్నారు. దాత‌ల విరాళాల‌తో అప్ర‌తిహ‌తంగా సాగుతున్న అన్న‌ప్ర‌సాద‌శాల‌లు వైకాపా స‌ర్కారు వ‌చ్చాక అవినీతి కేంద్రాలుగా మారాయ‌ని, అన్న‌ప్ర‌సాద నాణ్య‌త స్ప‌ష్టం చేస్తోంద‌ని ఆరోపించారు.

దేశ‌వ్యాప్తంగా వ‌చ్చే శ్రీవారి భ‌క్తులు తిరుమ‌ల-తిరుప‌తిలో అన్న‌ప్ర‌సాద‌శాల‌లో ఆహారం అంటే..ప్ర‌సాదం కంటే ప‌ర‌మ‌ప‌విత్రంగా భావిస్తార‌ని తెలిసి, ఇంత నాసిర‌కంగా పెడుతున్న టిటిడి భ‌క్తుల‌కు స‌మాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. త‌న కుమారుడు నారా దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా ప్ర‌తి ఏటా ఆ రోజు అన్న‌దానానికి రూ.30 లక్షలను విరాళంగా ఇస్తుంటామ‌ని, త‌న‌లాగే ల‌క్ష‌ల మంది దాత‌లు ఇస్తున్న విరాళాలు ఏమ‌వుతున్నాయ‌ని, అన్న‌ప్ర‌సాదం ఇంత అధ్వానంగా త‌యారు చేశార‌ని లోకేష్ ప్ర‌శ్నించారు.

నాసిర‌క‌మైన అన్న‌ప్ర‌సాదాలు అందిస్తూ భ‌క్తుల మ‌నోభావాలు గాయ‌ప‌రుస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్న అవినీతి గ‌ద్ద‌ల‌ను ఈ వైసీపీ స‌ర్కారు కాపాడ‌వ‌చ్చు కానీ, ఆ శ్రీవారు శిక్షించి తీరుతార‌ని హెచ్చ‌రించారు. తిరుమ‌ల‌-తిరుప‌తి ప‌విత్ర‌త‌ని అడుగడుగునా దెబ్బ‌తీసిన వైకాపా స‌ర్కారు, దాని క‌నుస‌న్న‌ల్లో న‌డిచే పాల‌క‌మండ‌లి త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్ప‌ద‌న్నారు.

టిటిడిలో అవినీతి, అవ‌క‌త‌వ‌క‌ల‌పై మాట్లాడితే కేసులు పెడ‌తామ‌ని పాల‌కులు బెదిరించ‌డం వారి హ‌స్తం ఉంద‌నే అనుమానించాల్సి వ‌స్తుంద‌న్నారు. చిన్నారిని చిరుత‌పులి చంపేస్తే..త‌ల్లిదండ్రుల‌పైకి వేలు చూపించిన వైకాపా ఎమ్మెల్యేలు, ఆ చిన్నారి కుటుంబానికి కోర్టు ఆదేశించినా ప‌రిహారం ఇవ్వ‌క‌పోవ‌డం దారుణమ‌న్నారు. ప్ర‌పంచంలోనే అత్యంత ఆదాయం వ‌చ్చే, టిటిడి వ‌ద్ద 5 ల‌క్ష‌లు లేవా? అని నిల‌దీశారు.

తిరుమ‌ల వెళ్లే ఆర్టీసీ చార్జీలు పెంచేశార‌ని, క్యూలైన్ల‌లో భక్తులకు టిఫిన్, పిల్లలకు పాలు ఇవ్వ‌డం ఆపేశార‌ని, లడ్డూ నాణ్యత త‌గ్గించి ధ‌ర పెంచేశార‌ని…రూము రెంట్ వంద నుంచి వెయ్యి చేయ‌డం వంటివ‌న్నీ శ్రీవారికి భ‌క్తుల‌ను దూరం చేసే కుట్ర‌లు కావా? అని నారా లోకేష్ ప్ర‌శ్నించారు.

LEAVE A RESPONSE