Suryaa.co.in

National

అయోధ్యలో పోటెత్తిన భక్తజనం

శ్రీరామ జన్మభూమి అయోధ్యాపురి భక్తజనసందోహంగా మారింది. వంద ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది భారతీయుల కల సాకారమవుతూ.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాలరాముడి రూపంలో శ్రీరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. దీంతో నేటి నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవ్యమైన రామ మందిరం లో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు.

భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే మందిరం వద్దకు చేరుకోగా.. ఉదయం 7 గంటల నుంచి ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇక మొదటి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది భక్తులు రామ్‌ లల్లాను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. మరో 3 లక్షల మంది దర్శనం కోసం వేచిఉన్నట్లు చెప్పారు. భక్తులకు నిరంతరం రాములోరి దర్శన భాగ్యం కల్పించేందుకు స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు.

మరోవైపు బాలరాముడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిపోయింది. ఈ క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. రద్దీని అదుపుచేసందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. రద్దీ నేపథ్యంలో రాములోరి దర్శనానికి సమయం పడుతుండటంతో భక్తులు సహనం కోల్పోతున్నారు.

ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని తోసుకుంటూ ఆలయంలోకి దూసుకెళ్తున్న దృశ్యాలు వైరల్‌ అవుతున్నాయి. అయితే, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

LEAVE A RESPONSE