Home » డీజీపీ, చీఫ్‌ సెక్రటరీని వెంటనే బదిలీ చేయాలి

డీజీపీ, చీఫ్‌ సెక్రటరీని వెంటనే బదిలీ చేయాలి

-అధికార పార్టీకి దాసోహమైన డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ
-మరో ఇద్దరు అధికారులపైనా చర్యలు తీసుకోవాలి
-కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడికి ఫిర్యాదు
-రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యమన్న వర్ల రామయ్య

కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్‌రావు మిశ్రాను ఆదివారం సాయం త్రం నోవాటెల్‌ హోటల్‌లో ఎన్డీయే కూటమి నేతలు కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యం లో అధికార పార్టీ అరాచకాలు, అధికారుల తీరుపై వివరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యాలపై సవివరింగా క్రోడీకరించిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి అధికారంలో కొనసాగితే ఎన్నికలు సజావుగా సాగే పరిస్థితి లేదని వారిద్ద రిని వెంటనే బదిలీ చేయాలని కోరారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు డీజీపీ ఆదేశాలతో ఏకపక్షంగా అధికార పార్టీకి మొగ్గు చూపుతున్న విషయాన్ని వివరించారు. రాష్ట్రం లో శాంతిభద్రతలు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఐఏఎస్‌ అధికారి రమేష్‌కుమార్‌ తన ప్రాణాలకు ముప్పు అని హైదరాబాద్‌కు మకాం మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

లిక్కర్‌ డంపులు వెలికి తీయించాలి

తెలుగుదేశం పార్టీ ఫిర్యాదులిస్తే ముద్దాయిలపై బెయిల్‌ వచ్చే కేసులు, అధికార పార్టీ ఫిర్యాదులిస్తే తెలుగుదేశం పార్టీపై బెయిలు రాని కేసులు నమోదు చేసి ఇబ్బంది పెడుతు న్నారని చెప్పారు. రాష్ట్రమంతటా లిక్కర్‌ డంప్‌లు ఏర్పాటు చేసి ఇతరులకు దొరకకుండా చేశారని, సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి చెందిన డంప్‌ను పట్టుకున్న విషయాన్ని వివరించారు. రాష్ట్రమంతా ఎస్‌ఈబీ అధికారులతో తనిఖీలు చేయించి లిక్కర్‌ డంప్‌లు వెలికి తీయాలని కోరారు. సోషల్‌ మీడియాలో టీడీపీ నాయకులను వారి ఇంటి మహిళలను కూడా బజారుకీడుస్తుంటే పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఫిర్యాదు చేశారు. అదే టీడీపీ వారిపై ఫిర్యాదులు వస్తే వెంటనే అరెస్టు చేసి జైళ్లకు పంపుతున్నారన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో ఇంకా ఆర్వోలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ధనుంజయరెడ్డి, సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోండి

అధికార పార్టీకి చెందిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరుతూ ఆధారాలు సమర్పించారు. దళితులకు మేనిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రిని అభినందిం చిన ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని విషయాలు విన్న ఆయన పోలీసు పరిశీలకులను కూడా కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

బీజేపీ నేత లంకా దినకర్‌ మాట్లాడుతూ 33 మంది వృద్ధుల మరణానికి కారణమైన చీఫ్‌ సెక్రటరీ గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ఐఏఎస్‌ అధికారి ధనుంజయరెడ్డిని, సునీల్‌ కుమార్‌లను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరినట్లు తెలిపారు. జనసేన ప్రధాన కార్యదర్శి టి.శివశంకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వ్యవహరిస్తున్న తీరు, పింఛన్ల పంపిణీ విధానంపై సీఎస్‌ వ్యవహార శైలి, డీజీపీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీల వ్యవహారశైలిని వివరించినట్లు చెప్పారు. తప్పనసరిగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ రైతు విభాగం అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌, తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీ, టీడీపీ నేత వల్లూరి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply