-మార్తి సుబ్రహ్మణ్యం
నో… అలా జరగటానికి వీల్లేదు. అందరి మాదిరిగా జగనన్న ఉండకూడదు. అన్న చెప్పాడంటే చేస్తాడంతే. మాట తప్పడం, మడమ తిప్పటం జగనన్న డిక్షనరీలోనే ఉండదు. ఉండకూడదు. జగనన్న అంటే ఒక శిఖరం. ఆయన రేంజే వేరు. ఇక విలువలు, నైతిక రాజకీయాలకు జగనన్న కేరాఫ్ అడ్రస్. చెప్పింది చేయటంలో జగనన్నకు ఏ నాయకుడైనా వందల కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిందే. అసలు విశ్వసనీయత-నైతిక విలువలు-మాట తప్పకపోవడం-మడమ తిప్పకపోవడం అనే పదాలు జగనన్నను చూసే పుట్టాయన్నది ప్రపంచంలో ఒక సామెత. అలాంటి జగనన్నపై ఇన్నేసి నిందలా? మాట తప్పాడన్న అపనిందలా? .. ఇవీ జగనన్న అభిమానులు భరించలేని విమర్శలు.
ఇవన్నీ అబద్ధాలు అయితే బాగుండును. ఇదంతా ఒక కలయితే బాగుండును. ఇవన్నీ అభూతకల్పనలు అయితే బాగుండును. ఇదీ జగన్ అన్న అభిమానులు, ఇప్పటివరకు ఆయన గురించి చేస్తున్న ప్రార్థనలు. కానీ జరగాల్సిన డ్యామేజంతా జరిగిపోయింది.. తమ ఊహా చిత్రంలో, మాటతప్పని వీరుడైన జగనన్న మాట తప్పేశారే? ప్రపంచం తలకిందులైనా కూడా మడమ తిప్పని జగన్ అన్న ,అందరూ చూస్తుండగానే మడమ తిప్పేశారు. ఎలా ? ఇప్పుడు ఎలా? అలా అయితే ఎలా? సోషల్ మీడియాలో మా మొహం ఎలా చూపించాలి? అసలు అన్న ఇమేజ్ ఏం కాను? జగనన్న వీరత్వం గురించి రచ్చబండల వద్ద తొడగొట్టి సవాల్ చేసే తాము, ఇకపై మొహం ఎక్కడ పెట్టుకోవాలి? ఇదీ …జగన్ అన్న వీరాభిమానుల పితలాటకం.
అవును.. విశ్వసనీయతకు ప్యాంటు షర్టు వేస్తే అది కచ్చితంగా జగనన్న అవుతుంది. అలాంటి జగనన్న శాసన మండలి రద్దు, మూడు రాజధానుల బిల్లు వాపసుపై పిల్లి మొగ్గలు వేయడాన్ని.. రఘురామ కృష్ణంరాజు లాంటి వీరాభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. తూచ్.. శాసన మండలి రద్దు చేయటం లేదని ,మళ్లీ ఇంకో కొత్త తీర్మానం చేసిన జగనన్న విశ్వసనీయత.. కృష్ణానదిలో కలవడాన్ని, జగనన్న వీరాభిమానులు తట్టుకోలేకపోతున్నారు. శాసన మండలి వల్ల, ఏడాదికి 60 కోట్ల రూపాయలు బొక్కసానికి బొక్క పడుతుందన్న అదే జగనన్న.. ఇప్పుడు మాట తప్పి, రద్దు చేసిన ఆ మండలే ముద్దని చెప్పటం జగనన్న ఇమేజిని, భారీ స్థాయిలో డ్యామేజీ చేసిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోనియానే ఎదిరించిన జగనన్న.. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న జగనన్న.. ఆఫ్ట్రాల్ కోర్టులకు భయపడి, మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడం ఏమిటని అన్న అభిమానులు తెగ ఇదయిపోతున్నారు. అసలు మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్నప్పుడు చేసిన ప్రకటనను… అంతకు ముందు అదే అసెంబ్లీలో, అదే రాజధానిపై జగన్ అన్న చేసిన వీడియో ప్రసంగాలు చూస్తుంటే, తల కొట్టేసినంత పని అయిందని సీమ సింహాలు తలపట్టుకుంటున్నాయి. జగనన్న ఏంటి ? మాట తప్పి మడమ తిప్పడం ఏమిటన్నది ఇప్పుడు సీమ సింహాల ఆవేదన.
సరే.. శాసన మండలి రద్దు బిల్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదించలేదు కాబట్టి, మళ్లీ ఆ బిల్లు వెనక్కి తీసుకున్నాం అనడం బాగానే ఉంది. మరి మాదిగ రిజర్వేషన్ బిల్లు కూడా అదే హోం మంత్రిత్వ శాఖ వద్ద పెండింగ్లో ఉంది. దాన్ని కూడా వెనక్కి తీసుకుంటారా? పైగా అది రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి కాలం నుంచి చంద్రబాబు జమానా వరకు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ఫైలే. ఇక చంద్రబాబు సర్కారు హయాంలో , కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ల తీర్మానం కూడా కేంద్రానికి పంపిస్తే, అది కూడా పెండింగ్లోనే ఉంది. మరి దాన్ని కూడా వాపస్ తీసుకున్నట్లు తీర్మానం చేస్తారా? అన్నీ వాపస్ తీసుకుని …ఆ రెండు మాత్రమే ఎందుకు అట్టి పెట్టడం అన్నది జగన్ అన్న అభిమానుల డౌటనుమానం. తీరిస్తే పోలా?