విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారా పురందేశ్వరీ

ఎంపీ విజయసాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి విభజన సమస్యలు పరిష్కరించమని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని కేంద్రాన్ని ఏనాడైనా డిమాండ్ చేశారా అని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఈ మేరకు గురువారం ఈ అంశంపై తనదైన శైలిలో స్పందించారు.

గతంలో కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా, ప్రస్తుతం బీజేపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నత పదవులు చేపట్టి ఏమి వెలగబెట్టారని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో జాతి నాయకురాలిగా మిగిలిపోవడం తప్ప పురందేశ్వరి చేసిందేమీ లేదని అన్నారు. నాగార్జున సాగర్ లో ఏపీ నీటి వాటా కోసం ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే పోలీసులను ఎందుకు పంపారని పురందేశ్వరి ప్రశ్నించడం ఆమె అవివేకమని అన్నారు. చంద్రబాబు నాయుడు మాదిరి ఆంధ్రప్రదేశ్ రైతులంటే పురందేశ్వరి ఎందుకంత కోపమని ప్రశ్నించారు.

కాంగ్రెస్ తో అంటకాగుతున్న చంద్రబాబు, పురందేశ్వరి
గతంలో కాంగ్రెస్ నేత సుబ్బిరామి రెడ్డి ఇంటికి ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి కేవలం భోజనానికి వెళ్లినంత మాత్రాన టీడీపీని కాంగ్రెస్ లో కలిపేస్తున్నారంటూ చంద్రబాబు, పురందేశ్వరి ప్రచారం చేశారని, తెలుగువాడన్న అభిమానంతో పీవీ నరసింహారావుకు ఎన్టీఆర్ అనుకూలంగా మాట్లాడితే వీళ్ళు తట్టుకోలేకపోయారని చెప్పారు. అటువంటి వీరిద్దరూ ఇప్పుడు అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీతో ఎలా అంటకాగుతున్నారని, చంద్రబాబు, పురందేశ్వరి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోయారా అని ప్రశ్నించారు.

చిత్తూరులో ఎలక్ట్రిక్ బస్ తయారీ యూనిట్
చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ తయారీ యూనిట్ ఏర్పాటు కాబోతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. రూ.4640 కోట్లు పెట్టుబడితో 800 ఎకరాల్లో భారీ యూనిట్ ఏర్పాటు కాబోతుందని అన్నారు. ఏడాదికి 30 వేల బస్సులు, ట్రక్కులు తయారీ సామర్ధ్యంతో పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సు, ట్రక్ క్లస్టర్ ఏర్పాటు చేస్తోందని అన్నారు.

ఆవుకు రెండో సొరంగం పూర్తి
అత్యాధునిక పరిజ్ఙానంతో అవుకు రెండో సొరంగం పూర్తి చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారని అన్నారు. 20వేల క్యూసెక్యుల తరలింపుకు లైన్ క్లియర్ అయ్యిందని, కేవలం 15 రోజుల్లోనే గండికోట రిజర్వాయర్ నింపేందుకు మార్గం సుగమం అయ్యిందని అన్నారు. దీంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. అలాగే 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు.

Leave a Reply