తిట్టమని కలెక్టర్లకు నేరుగా చెప్పి… కొట్టమని పోలీసులకు ఇన్ డైరెక్ట్ గా చెప్పారా?

38

-నన్ను కొట్టించినట్లుగానే కొట్టించి, జగన్మోహన్ రెడ్డి చూసి ఆనందించాలనుకుంటున్నారా?
-స్మార్ట్ మీటర్ల కోసం ప్రజలపై వేల కోట్ల భారం సరికాదు
-జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి
-ప్రభుత్వాన్ని రద్దు చేసి తమ పార్టీ జూన్, జూలైలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం
-జగన్ కు రుణ దాహం ఎక్కువే… ధన దాహం ఉందో లేదో తెలియదు
-పారదర్శకత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయండి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

స్మార్ట్ మీటర్ల కోసం ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేయడం సరికాదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. స్మార్ట్ మీటర్ల సరఫరాను తమకు కావలసిన వారి కంపెనీకి ఇచ్చేస్తాం… వేల కోట్ల రూపాయలు ఆదాయం సమకూరే విధంగా చూస్తామంటే కుదరదు అన్నారు. స్మార్ట్ మీటర్ల పారదర్శకంగా ఏర్పాటు చేయడానికి సమాజంలోని ప్రముఖులైన జయప్రకాశ్ నారాయణ, జేడీ లక్ష్మీనారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

గతంలో అవినీతికి పేరుగాంచిన తమిళనాడు రాష్ట్రంలోనే మూడువేల రూపాయలకే
గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహణ భారంతో కూడుకుని వ్యవసాయ స్మార్ట్ మీటర్ల ధర 36 వేల రూపాయలు గా స్నిర్ణయించడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. పాతిక లక్షలస్మార్ట్ మీటర్లకు గాను, ఒక్కొక్కటి 36 వేల రూపాయల గా ధర నిర్ణయించి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని కొట్టేయడానికి ప్రణాళికలు రచించారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… స్మార్ట్ మీటర్ల సరఫరా కాంట్రాక్టును ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ యాజమానికి కట్టబెట్టాలని చూశారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానని చెప్పి, సదరు వ్యక్తి రెండున్నర లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని అడిగారని గుర్తు చేశారు. స్మార్ట్ మీటర్ల డీల్ సెట్ అయిందనుకునే లోపు, పత్రికలు నిజాలను ప్రజలకు చెప్పి పురిట్లోనే సంధి కొట్టాయని తెలిసిందన్నారు.

300% పెంచితే ఎలా?
స్మార్ట్ మీటర్ల ధరను పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే రెండింతలు పెంచినా పర్వాలేదని , కానీ 300% పెంచితే ఎలా అని ఒక ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిసిందని రఘురామకృష్ణంరాజు అన్నారు . 2025 నాటికల్లా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్దేశించింది. పొరుగు రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఎలా చేస్తున్నారన్నది రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేయాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ కార్పొరేషన్ తమిళనాడు రాష్ట్రంలో మూడువేల రూపాయలకే విద్యుత్ వినియోగదారుడికి స్మార్ట్ మీటర్ సరఫరా చేస్తోంది.

కేంద్ర ప్రభుత్వం, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు కొంత రాయితీని అందజేస్తోంది. మీటర్ల ఏర్పాటుకు వినియోగదారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం లేదు. ఎందుకంటే తొలుత మీటర్లను
బిగించుకున్నప్పుడు, వినియోగదారుడు మొత్తం డబ్బును జమ చేస్తాడు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ౧౮ వేల రూపాయల ధర నిర్ణయించగా, దానిలో సగానికి సగం తగ్గించినప్పటికీ, పెద్ద ఎత్తున ప్రజాధనం స్మార్ట్ మీటర్ల సరఫరా కంపెనీల జేబుల్లోకి వెళ్తుంది. రాష్ట్రంలో 200 నుంచి 500 యూనిట్ల విద్యుత్ వినియోగించేవారు, జీరో నుంచి 200 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులకు కోటిన్నర స్మార్ట్ మీటర్లు అవసరమవుతాయి.

స్మార్ట్ మీటర్ల ధర ప్రస్తుతం 18000 రూపాయలుగా ఉండగా పదివేల వరకు తగ్గించినా 7500 కోట్ల రూపాయల ప్రజాధనం ప్రైవేటు కంపెనీల పరం అవుతుంది. ఇలా ప్రైవేటు సంస్థలకు ప్రజాధనాన్ని కట్టబెట్టే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తుంది. వాహన దీవెన ద్వారా ఆటో డ్రైవర్ కు పదివేల రూపాయలు అందజేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, స్మార్ట్ మీటర్ల ద్వారా పదిహేను వేల రూపాయలను లాగేస్తుందేమో అని రఘురామకృష్ణం రాజు అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మూడు వేల రూపాయలకు స్మార్ట్ మీటర్లను అందజేస్తుంటే, రాష్ట్రంలో రెండున్నర వేల రూపాయలకే స్మార్ట్ మీటర్లను కొనుగోలు చేశామని చెబితే మంచిదన్నారు. స్మార్ట్ మీటర్లలో డబ్బులు కొట్టివేయాలని జగన్మోహన్ రెడ్డికి ఉందొ లేదో తెలీదు కానీ కిందివారికి ఉందేమోనన్నా అనుమానాన్ని వ్యక్తం చేశారు.

రతన్ టాటా కు భారతరత్న అవార్డు ఇవ్వాలి
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కు భారతరత్న అవార్డు ఇవ్వాలని, ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి లేఖ రాసినట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రపతికి రాసిన లేఖను నా సహచర ఎంపీలకు కూడా పంపాను. రతన్ టాటా కు భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్రపతి తో పాటు, ప్రధానమంత్రి, హోం మంత్రికి విన్నవించాలని సూచించాను. రతన్ టాటా లాంటి లివింగ్ లెజెండ్ ను గౌరవించడం అంటే, మనల్ని మనము గౌరవించుకోవడమే. ప్రజల విద్య, వైద్యం కోసం 66% షేర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని టాటా సన్స్ ఖర్చు చేస్తున్నారు. రతన్ టాటా 85వ జన్మదినోత్సవానికి పురస్కరించుకొని ఆయనకు రఘురామకృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

53 లక్షల మందికి గతంలోనే వృద్ధాప్య పింఛన్ల పంపిణీ
గత టిడిపి ప్రభుత్వ హయాంలో 53 లక్షల మంది వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లను పంపిణీ చేయడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు తెలి పారు. ఈ మూడేళ్లలో వృద్ధుల సంఖ్య 60 లక్షలకు చేరుకొని ఉంటుంది. కానీ గత ఐదేళ్ల క్రితం ఎంతమంది వృద్ధులకైతే పింఛన్లు పంపిణీ చేశారో… ఇప్పుడు కాస్త పెరుగుతారు కదా !గత ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వృద్ధులకు 2000 రూపాయల వృద్ధాప్య పింఛన్ పంపిణీ చేసిన విషయాన్ని ప్రస్తావించకుండా, తానే 1000 ఉన్న వృద్ధాప్య పింఛన్ ను 2000 రూపాయల వరకు పెంచినట్లు జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటు. వృద్ధాప్య పింఛను రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు కాదా?, 2019 జనవరిలో ముఖ్యమంత్రి ఎవరు??, జగన్మోహన్ రెడ్డా?..చంద్రబాబు నాయుడా?? అన్నది పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి స్పష్టత ఇవ్వాలి.

పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను తిట్టాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయడం విడ్డూరంగా ఉంది. కలెక్టర్లను తిట్లు తిట్టమని చెప్పడం ఒక్క జగన్మోహన్ రెడ్డి కే సాధ్యం. అందుకే ఆయన్ని అభినందిస్తున్నా. ఆరు నెలల క్రితం వృద్ధాప్య పింఛనుకు అర్హులైన వారు, ఆరు నెలల తర్వాత అనర్హులు ఎలా అవుతారు?. గతంలో ఇంటి విస్తీర్ణం 900 చదరపు అడుగులు ఉంటే, దాన్ని 10 50 చ అ గా చూపించి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. రెండు నెలల విద్యుత్ బిల్లును ఒకేసారి తీసి, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉందని అనర్హులుగా పేర్కొంటున్నారు. మనము తప్పుల్ని చేసి, ఆ తప్పులను ఎత్తి చూపిన జర్నలిస్టులను తిట్టాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయడం ఏమిటి?.

కలెక్టర్లకు నేరుగా తిట్టమని చెప్పి, పోలీసులకు ఇన్ డైరెక్ట్ గా కొట్టమని చెప్పారేమోనని సందేహం. అయినా జర్నలిస్టులు, పత్రికా యాజమాన్యాలు భయపడి నిజాలను చెప్పడం మానేస్తారని నేను అనుకోవడం లేదు. కలెక్టర్ల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు. దీనితో కలెక్టర్లు ఆయన్ని తిట్టలేక తెల్ల మొహం వేశారు. వైఎస్ 200 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పింఛను రాజశేఖర్ రెడ్డి హయాంలో ఐదు రెట్లు పెంచి 1000 రూపాయలుగా చేశారు. వెయ్యి రూపాయల వృద్ధాప్య పింఛను 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2000 చేశారు. 2000 వృద్ధాప్య పింఛను 3000 గా చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించలేదా?.

చివరకు 250 రూపాయలు పెంచి, జగన్ దశలవారీగా పెంచుతానని చెప్పలేదా?. రాష్ట్రంలోని వృద్ధుల కు వృద్ధాప్య పింఛన్లు తొలగించేందుకు నోటీసులు ఇవ్వలేదా?. నోటీసులు ఏమైనా సరదాకు ఇచ్చారా??. సంజాయిషీ ఇవ్వకపోతే వృద్ధాప్య పింఛన్లు తొలగించాలన్నదే ప్రభుత్వ ఆలోచన కాదా?. అదే విషయాన్ని వార్త రూపంలో రాస్తే, జర్నలిస్టులను తిట్టమని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయడం ఏమిటీ . సీనియర్ జర్నలిస్టులను, పత్రికా యజమానులను నన్ను కొట్టించినట్లుగానే కొట్టించి, జగన్మోహన్ రెడ్డి చూసి ఆనందించాలనుకుంటున్నారా?.

ప్రజలతో ఎలా మెలగాలన్న దానిపై ముస్సోరి లో ఐఏఎస్ అధికారులకు శిక్షణ ఇస్తారు. తాడేపల్లి ప్యాలెస్ లో మీరేమైనా తిట్లు తిట్టడంపై ఐఏఎస్ లకు శిక్షణ ఇస్తారా??. పోలీసుల కైతే కొత్తగా శిక్షణ అవసరం లేదని, నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన వీడియో చూపిస్తే చాలు. ఐఏఎస్ అధికారులు ఎలా తిట్టాలో… మంత్రి జోగి రమేష్ వంటి వారి చేత శిక్షణ ఇప్పించండి. లేదంటే తిట్లను శిక్షణను దిశా నిర్దేశం చేసినందుకు పొరపాటు జరిగిందని క్షమాపణలు చెప్పి ముందుకు వెళ్ళండి. జర్నలిస్టులను తిట్లు తిట్టాలని కలెక్టర్లకు దిశా నిర్దేశం చేయడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

అదే జరిగితే మా పార్టీకి కొన్ని స్థానాలైన వస్తాయి
ప్రభుత్వాన్ని రద్దు చేసి తమ పార్టీ జూన్, జూలైలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. అదే జరిగితే మా పార్టీకి కొన్ని స్థానాలైనా వస్తాయి. లేకపోతే అవి కూడా రావడం కష్టం. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఉపాధ్యాయులకు వచ్చే నెల కూడా 15వ తేదీ తర్వాతే జీతాలు చెల్లించనున్నట్లు తెలిసింది. పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వం అప్పులు తీసుకొని, దారి మళ్లించే అవకాశం లేకపోలేదు. పోర్ట్ నిర్మాణ ప్రగతిని చూసి అప్పులు ఇవ్వాలని కోరుతాను.

జగన్ రుణయాత్రలో భాగంగా ఆయనతోపాటు విజయసాయిరెడ్డి, అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిలు ఢిల్లీకి చేరుకున్నట్టు సాక్షి దినపత్రికలో చూశా. ఢిల్లీకి జగన్ ఎందుకు వచ్చినా కూడా, ఆయన పక్కన ఉన్నవారు మాత్రం… రాజధాని, విభజన సమస్యలు, పోలవరం నిధులు, స్పెషల్ కేటగిరి స్టేటస్, రైల్వే జోన్ అడగడానికి వచ్చారని చెబుతారు. ప్రధానికి జగన్ వినతిపత్రం ఇచ్చారని పేర్కొంటారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ప్రివిలేజ్ కమిటీ దృష్టికి తీసుకువెళ్లా…
హైదరాబాద్ లోని తన నివాసం వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు చెందిన ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి నిఘా పెట్టారని, తన నివాసం గేటు వద్ద నిఘా పెట్టడానికి కారణాలు ఏమిటో తెలియజేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని ఇంటి వద్ద తెలుగు యువత కార్యకర్తలు ఆందోళన నిర్వహించినందుకు, తమ పార్టీకి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇంటి వద్ద నిఘా కోసం ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి కాపలా గా ఉన్నారన్నారు .

అయితే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నివాసానికి, తన నివాసానికి మధ్య కిలోమీటరన్నర దూరం ఉంటుంది. అటువంటప్పుడు ఏఎస్ఐ తన ఇంటి గేటు వద్ద కాపలా ఉండడం దేనికి. హైదరాబాద్ రక్షణ వ్యవస్థ పూర్తిగా తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉంటుంది. అటువంటప్పుడు, హైదరాబాదులో నిఘా పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసుల అనుమతి తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నుంచి అనుమతి తీసుకునే విధంగా ఏపీ పోలీసులు ఏమైనా కరస్పాండెన్స్ నిర్వహించారా?. తెలంగాణ పోలీసులు వారికి అనుమతినిచ్చారా??. ఆధారాలతో కూడిన వివరాలను సేకరించమని లోక్ సభ ప్రివలేజ్ కమిటీ కోరాను.

ఈ మేరకు ఏపీ డీజీపీకి, ఇంటలిజెన్స్ చీప్ కు లేఖలు ప్రివలెజ్ కమిటీ లేఖ రాసింది . వివరాలు పంపించమని కోరింది. గతంలో నకిలీ పోలీసుల ద్వారా తనని కిడ్నాప్ చేయాలని చూశారు. తాను లోక్ సభ ప్రివలేజీ కమిటీకి ఫిర్యాదు చేసినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని తనకు తెలుసు. కానీ ఈ విషయాలు ప్రజలకు తెలియాలన్నారు.

ఒకరికి న్యాయం చేసేందుకు ఇద్దరికీ అన్యాయం
తన సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి న్యాయం చేసేందుకు, దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అధికారులకు జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఈ ఏడాదిని సామాజిక న్యాయ సంవత్సరంగా పాటిస్తుంది. ఏపీ సిపిడిఎల్ సిజిఎంగా శివ ప్రసాద్ రెడ్డి ని నియమించేందుకు, అడ్డంకి గా ఉన్న ఇద్దరు అధికారులను ప్రభుత్వమే సెలవులపై వెళ్ళమని ఆదేశించింది . సెలవులపై వెళ్లారన్న కారణంగా ఇద్దరు దళిత అధికారులకు ప్రమోషన్ ఇవ్వలేదు.

భవిష్యత్తులో ఎస్పీడీసీఎల్ చైర్మన్ పదవి పొందాలంటే, ఏపీ సిపి డియల్ సీజీఎం గా పనిచేసిన అనుభవం ఉండాలట . అందుకే శివప్రసాద్ రెడ్డికి సీజీఎంగా పదోన్నతి కల్పించారు. ట్విట్టర్ వేదికగా తనపై విమర్శలను గుప్పించిన దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, తమ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అధికారులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలి. ట్విట్టర్ ద్వారానైన ఈ అన్యాయాన్ని వారు ప్రశ్నించాలని రఘురామకృష్ణంరాజు సూచించారు.