Suryaa.co.in

Andhra Pradesh

నీచ పోస్టింగులు… C/O వైసీపీ సోషల్ మీడియా!

– లా అండ్ ఆర్డర్ ని వైసీపీ దిగజార్చింది
– జగన్ ప్రజాస్వామ్యం గురించి మట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు
– వైసీపీ అరాచకాలను ప్రశ్నించిన ఎంపీకి చిత్ర హింసలు
– సొంత తల్లి, చెల్లిపై పోస్టీంగులు పెట్టినా చర్యల్లేవు
– జగన్‌ పాలనలో బీసీలపై 300, ఎస్సీలపై 192, ఎస్టీలపై 58, మైనార్టీలపై 11, మహిళలపై 2027, టీడీపీ కార్యకర్తలపై 2005 కేసులు
– ఎన్నికల కోడ్ సమయంలో 13 హత్యలు
– సీఐడీని సొంత సంస్థగా వాడుకున్నారు.
– సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిప్పులు

మంగళగిరి: లా అండ్ ఆర్డర్ ని నీచ స్థితిని దిగజార్చింది వైసీపీ ప్రభుత్వమే అని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దుమ్మెత్తిపోశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇక్కడి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మట్లాడుతుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. జీవితకాలం వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా ఉండాలని తీర్మానం చేయించుకున్నారు. కానీ, ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదని ఎలక్షన్ కమిషన్ చెప్పిందన్నారు. ఇంకా, మంత్రి ఏమన్నారంటే…

రాష్ట్రంలో వైసీపీ కొంత మంది పోలీసులను ఉపయోగించుకొని చేసిన అరాచకాలను దేశ ప్రజలందరూ చూశారు. వైసీపీ అరాచకాలను ప్రశ్నిస్తున్నారని ఒక ఎంపీని అతిక్రూరంగా హింసించారు. ఇలాంటి ఘటన దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. జగన్ పాదయాత్రకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదు. కాని లోకేష్ పాదయాత్రకు జగన్ అడ్డంకులు సృష్టించారు. వైసీపీ సోషల్ మీడియా నీచమైన పోస్టింగులు పెడుతోంది. సొంత తల్లి, చెల్లిపై కూడా వైసీపీ సోషల్ మీడియా నీచంగా మాట్లాడుతుంటే కనీసం వారిపై చర్యలు కూడా తీసుకోలేదు. ఆయన పార్టీ నాయకులు ప్రతిపక్ష సభ్యులను బూతులు తిడుతుంటే కనీసం ఖండించకుండా ప్రోత్సహించారు. జోగి రమేష్ అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంటిపై దాడికి వెళితే చర్యలు తీసుకోపోగా మెచ్చుకున్నారు.

వైసీపీ హయాంలో దౌర్జన్యాలు చేశారు. బీసీలపై 300, ఎస్సీలపై 192, ఎస్టీలపై 58, మైనార్టీలపై 11, మహిళలపై 2027, టీడీపీ కార్యకర్తలపై 2005 కేసులు, ఎన్నికల కోడ్ సమయంలో 13 హత్యలు చేశారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో నోటీసులు ఇచ్చి చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా గాని చర్యలు తీసుకున్నారా? సైకోలుగా అరాచకవాదులుగా వ్యవహరిస్తున్న వైసీపీ సోషల్ మీడియా వారిపై చర్యలు తీసుకుంటాం. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన 150 మంది టీడీపీ కార్యకర్తలపై, సోషల్ మీడియా వారిపై 100 కేసులు పెట్టి కనీసం మంచినీరు ఇవ్వకుండా హింసించారు. 70, 80 సంవత్సరాలు ఉన్న వారిని కూడా చిత్రహింసలు పెట్టారు.

వైసీపీ హయాంలో ప్రతిపక్ష నాయకులను హింసించడానికి సీఐడీని ఉపయోగించుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడానికి ఉపయోగించలేదు. కుటుంబ సభ్యులపై నీచంగా మాట్లాడితే ఖండిస్తారా లేదా ? అనేది జగన్ సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో కక్షపూరిత రాజకీయాలు గాని, కక్షసాధింపులు గాని ఉండవు. ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తోంది.

LEAVE A RESPONSE