– అధికారంలోకి వచ్చాక ఆదుకోవాలని విన్నపం
మాడుగుల: మాడుగల శంఖారావంసభకు హాజరైన యువనేత లోకేష్ ను రావికమతం మండల దివ్యాంగుల సమాఖ్య సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తెలంగాణాలో మాదిరి ఎపిలో కూడా 6వేల పెన్షన్ ఇవ్వాలి. దివ్యాంగులకు సంక్షేమ శాఖ, సహకార సంస్థకు తగిన బడ్జెట్ కేటాయించాలి. దివ్యాంగులకు ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలి. అంత్యోదయ రేషన్ కార్డులు ఇచ్చి ఉచితంగా 35కిలోల బియ్యం ఇవ్వాలి.
దివ్యాంగుల హక్కుల చట్టం 2016లో ఉన్న అన్ని జిఓలను అమలుచేయాలి. నామినేటెడ్ పోస్టుల్లో 5శాతం రిజర్వేషన్ కల్పించాలి. దివ్యాంగులకు అన్నిరకాల ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకుంటే రూ.3లక్షల ప్రోత్సాహకాన్ని అమలుచేయాలి. ప్రతి మండలంలో దివ్యాంగుల సామాజిక భవనం నిర్మించాలి. దివ్యాంగులకు మెరుగైన విద్య, వైద్యం, క్రీడా సదుపాయాలు కల్పించాలి. అన్ని ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీచేయాలి.
70శాతం పైబడి వైకల్యం కలిగిన దివ్యాంగులకు త్రీవీలర్ స్కూటర్లను ఇవ్వాలి. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ప్రతిఏటా డిసెంబర్ 3వతేదీన అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని దివ్యాంగులు కోరారు. యువనేత లోకేష్ స్పందిస్తూ… దివ్యాంగుల సమస్యలన్నింటినీ పరిశీలించి రాబోయే ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.