Suryaa.co.in

Andhra Pradesh

ఆగస్టు, సెప్టెంబర్ లో అసెంబ్లీ రద్దు ?

-తెలంగాణతో పాటే ఆంధ్ర అసెంబ్లీ ఎన్నికలు
-ఆగస్టు, సెప్టెంబర్ లో అసెంబ్లీని ముఖ్యమంత్రి రద్దు చేసే అవకాశం
-గత ఎన్నికల్లో తమ పార్టీ అప్రహతిత విజయానికి కారణమైన రెండు కేసులు డ్రామా అని తేలితే…రానున్న ఎన్నికల్లో మా పార్టీ పరిస్థితి ఏమిటి?
-కోడి కత్తి కేసులో దళిత యువకుడికి బెయిల్ రాకుండా… వైఎస్ వివేక హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లకుండా ప్రయత్నాలు…
-జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రాథమిక చికిత్స చేయించుకోకుండానే విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు
-సిటీ న్యూరో సెంటర్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు నటించారు
-బుద్ధి ఉన్నవాడు ఎవరు న్యూరో సెంటర్ కు వెళ్లరు. ట్రామా సెంటర్ కు వెళ్తారు
-వైఎస్ వివేక కేసులో నిందితుల అరెస్టులను అడ్డుకోవద్దని హైకోర్టుకు విన్నవించిన సిబీఐ
-నోటీసు ఇచ్చిన వారిని వివరాల అడుగుతున్న సిఐడి… తమ వద్ద ఆధారాలేవీ లేవని చెప్పకనే చెబుతోందినరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

తెలంగాణతో పాటే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనసు మారకపోతే, డిసెంబర్ లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయమని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు . గత ఎన్నికల్లో తమ పార్టీ విజయానికి కారణమైన కోడి కత్తి కేసు తో పాటు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు తమ పార్టీ పెద్దలు ఆడించిన డ్రామా నేనని తేలితే, రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నది అంతు చిక్కడం లేదన్నారు. శుక్రవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇప్పటికే కోడి కత్తి కేసు డ్రామా అని ఎన్ ఐ ఏ తేల్చివేసింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా దాదాపు కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులోగా చార్జిషీట్ దాఖలు చేసి, ఈ కేసులో నిందితులుగా అనుమానిస్తున్న వారిని అరెస్టు చేస్తామని హైకోర్టుకు సిబిఐ తేల్చి చెప్పింది. అదే గనుక జరిగితే తమ పార్టీ పరిస్థితి కొంప కొల్లేరైనట్టేనని అన్నారు. పార్టీలో కొనసాగుతున్న సభ్యుడిగా తమ భవిష్యత్తు ఏమిటి?, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల ప్రజా ప్రతినిధుల, నాయకుల పరిస్థితి ఏమిటన్నది అంతుచిక్కడం లేదన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చే హక్కు హైకోర్టుకు లేదన్న సిబిఐ
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా తీర్పును ఇచ్చే హక్కు హైకోర్టుకు లేదని సిబిఐ అధికారులు వినమ్రంగా తెలియజేశారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. జస్టిస్ సురేందర్ బెంచ్ లో గత కొన్ని రోజులుగా కొనసా…గుతున్న ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి తరఫున టీ నిరంజన్ రెడ్డి గంటసేపు తన వాదనలను వినిపించారు. అనంతరం సిబిఐ తరఫున న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ, ఈ కేసుకు విచారణ అర్హత లేదన్నారు. భాస్కర్ రెడ్డిని ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా నిర్ధారించాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు, సుప్రీంకోర్టులలో కొట్టి వేసిన కేసులను , వింటూ వెళ్లడం సమంజసం కాదని మర్యాదపూర్వకంగా చెప్పారు. ఈ కేసులో సిబిఐ తన వైఖరిని విస్పష్టంగా చెప్పింది. సోమవారం డాక్టర్ సునీత తరపు న్యాయవాది, సిబిఐ తరఫు న్యాయవాది కూడా తమ వాదనలను వినిపించే అవకాశాలు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు తెలియజేశారు. ప్రత్యేక హోదా మీటింగ్ ఢిల్లీ పెద్దలతో ఫలప్రదంగా ముగిసిన నేపథ్యంలో, ఈ కేసు అటకెక్కినట్లేనని ప్రజలందరూ భావించారు. కానీ భవిష్యత్తులో కొందరు నిందితుల అరెస్టులైనా ఉంటాయని తాను చెప్పానని గుర్తు చేశారు.

ఆరోజే విచారణ సజావుగా సాగి ఉంటే నిజాలు బయటకు వచ్చేవి
వైఎస్ వివేకా హత్య కేసు అనంతరం విచారణ సజావుగా సాగి ఉంటే అప్పుడే నిజాలు వెలుగులోకి వచ్చి ఉండేవని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైయస్ భారతి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో ప్రధాన కాంపౌండర్ గా పని చేసే గజ్జల జయప్రకాశ్ రెడ్డి తనయుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తో పాటు, అదే ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ మధుసూదన్ ను విచారించడానికి కడప తీసుకు వెళుతుండగా, మార్గమధ్యలో ఒక ఫోన్ కాల్ రావడం వల్ల, వారిని తిరిగి తీసుకువచ్చి పులివెందులలో వదిలిపెట్టారని డాక్టర్ సునీత, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో తాను చదివానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. వైఎస్ వివేకానంద రెడ్డి ని చనిపోయిన విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి వైఎస్ వివేక చనిపోయినట్లుగా పక్కింటి వారితో చెప్పడం జరిగింది. ఉదయ్ కుమార్ రెడ్డి ని సిబిఐ అధికారి రామ్ సింగ్ విచారించిన 30 రోజుల తర్వాత, ఆయన తనని ఇబ్బందులకు గురి చేశారని ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడం, సిబిఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేయడం జరిగింది.

దళిత యువకుడి కేసులో బెయిల్ రాకుండా అడ్డుపడుతున్న వారు, వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లకుండా కాపాడుతున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు కేసులే మా పార్టీ గెలుపుకు దోహదపడ్డాయి. కోడి కత్తి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చినా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు జైలుకు వెళ్లిన తమ పార్టీకి రిస్క్. హూ కిల్డ్ బాబాయ్ స్టోరీలో ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ అతి ముఖ్యమైన అంకం. ప్రజలు ఊహిస్తున్న క్యారెక్టర్ల అరెస్టు ఎంత ముఖ్యమో… ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ కూడా అంతే ముఖ్యం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విస్తృత కుట్ర కోణాన్ని ఒక దశకు తీసుకొచ్చామని సిబిఐ అధికారులు పేర్కొనడం, ఈ నెలాఖరులోగా చార్జిషీట్ దాఖలు చేస్తామని సుప్రీం కోర్టుకు చెప్పినట్లుగా హైదరాబాద్ హైకోర్టుకు వెల్లడించడం జరిగింది. అరెస్టులకు అడ్డు రావద్దని హైకోర్టుకు సిబిఐ అధికారులు విన్నవించడంతో, ఈనెల 25వ తేదీ వరకు ఈ కేసులో కీలక అరెస్టులు ఉండవచ్చునని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు రఘురామకృష్ణం రాజు వెల్లడించారు.

వైఎస్ వివేకాను హత్య చేసింది మా పార్టీ సానుభూతిపరులు, ఆషాడ బూతులే
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని తమ పార్టీ సానుభూతిపరులు, ఆషాడభూతులే హత్య చేశారని రఘురామకృష్ణం రాజు అన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించారని తొలిత పేర్కొన్నప్పటికీ, తరువాత గొడ్డలిపోటుతో మరణించినట్లుగా చెప్పారు. గొడ్డలి పోటుతో మరణించిన వ్యక్తిని ఫ్రీజర్ లో పెట్టడానికి వీలు లేదని సీఐ శంకరయ్య వారించారు .వైఎస్ వివేక గాయాలకు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి కట్లు వేసిన అనంతరం శవాన్ని ఫ్రీజర్ లో పెట్టాలనుకున్నారు .వైయస్ వివేక హత్యకు ఉపయోగించిన గొడ్డలి కొనుగోలుకు ముందు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలతో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలిసింది. గూగుల్ టేక్ అవుట్ ను నమ్మమని కొంతమంది చెబుతున్నప్పటికీ, కేసు ట్రయల్స్ కు వచ్చినప్పుడు ఆ విషయాన్ని చెప్పుకోండి. వైఎస్ వివేక హత్య కోసం నిందితులకు ఇచ్చిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. తన తల్లిని వేధించాడని సునీల్ కుమార్ కోట్ల రూపాయల డబ్బు ఖర్చు చేసి హత్య చేశాడు అంటే బుద్ధి ఉన్న ఏ ఒక్కరూ నమ్మరని రఘురామకృష్ణంరాజు అన్నారు.

తండ్రి లేని పిల్లోడిపై హత్యా ప్రయత్నం ఎంత దారుణమని అనుకున్నాం
విశాఖ విమానాశ్రయంలో జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తితో దాడి సంఘటన సందర్భంగా తండ్రి లేని పిల్లోడి పై హత్యా ప్రయత్నం ఎంత దారుణమని అందరిలాగే గుండెలు బాదుకున్న వారిలో తాము కూడా ఉన్నామని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అయితే కోడి కత్తి కేసు ఒక డ్రామా అని ఎన్ఐఏ నిగ్గు తేల్చింది. కత్తి లేదు… కత్తి గుచ్చింది లేదు. రక్తం కూడా వచ్చింది లేదు. కోడి కత్తి దాడి జరిగిందని చెప్పినచోట టమాటా సాస్ పూశారని కొందరు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పై కోడి కత్తి దాడి జరిగి ఉంటే చొక్కా చిరిగి ఉండాలి. శరీరంపై ఉన్న మొటిమను గిల్లితే ఎంత రక్తం వస్తుందో, అంతకంటే తక్కువే రక్తం వచ్చిందన్నారు. కోడి కత్తి ఘటన అనంతరం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రాథమిక చికిత్స చేయించుకోకుండానే విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. సిటీ న్యూరో సెంటర్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నట్లు నటించారు. బుద్ధి ఉన్నవాడు ఎవరు న్యూరో సెంటర్ కు వెళ్లరు. ట్రామా సెంటర్ కు వెళ్తారు. గాయం అయినట్లుగా చెప్పిన చోట పెద్ద కట్టు కట్టారు.

ఇటీవల గన్నవరం సీఐ కి దెబ్బ తగలకపోయినా తగిలినట్లుగా చెప్పి కట్టిన కట్టు మాదిరిగానే జగన్మోహన్ రెడ్డికి డాక్టర్ సాంబశివ రెడ్డి కట్టారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంబశివారెడ్డికి రెండు కీలకమైన పదవులను ఆయన కట్టబెట్టారు. ఆరోగ్యశ్రీ వైస్ చైర్మన్ గా, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ గా హైదరాబాదులో ఆసుపత్రులు నిర్వహించుకుంటున్న వ్యక్తికి కట్టబెట్టవలసిన అవసరం ఏమొచ్చింది?. కోడి కత్తి కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ముఖ్యమంత్రిని కోరగా, తాను కోర్టుకు హాజరయితే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని, తాను రాలేనని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఈ దాడి వెనుక టిడిపి కుట్ర ఉంది అని, సరైన విచారణ జరపలేదంటూ చేసిన వాదనలను ఎన్ ఐ ఏ తోసి పుచ్చింది. రానున్న ఎన్నికలకు కూడా ఈ కేసును వాడుకోవాలని తమ పార్టీ పెద్దలు ప్రయత్నించినప్పటికీ, ప్రస్తుతం తమ పార్టీ పెద్దలకు టైం కలిసి రావడం లేదు. ఇదంతా డ్రామానే అని ఎన్ ఐ ఏ తేల్చేయడంతో పాటు, బాధితుడు వేసిన పిటీషన్ ను కొట్టివేయాలని సూచించారు. కోడి కత్తి దాడిలో పాల్గొన్నట్లుగా చెబుతున్న శ్రీనివాసరావు, క్యాంటీన్ నిర్వాకుడైన హర్షవర్ధన్ లు టిడిపి సానుభూతిపరులు కాదని ఎన్ ఐ ఏ విచారణలో స్పష్టం చేసి, క్లీన్ చీట్ ఇచ్చింది.

శ్రీనివాసరావును గత నాలుగు సంవత్సరాలుగా జైలులోనే నిర్బంధించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఆయనకు బెయిల్ లభించగా, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే బెయిలు రద్దు చేయించి, జైలుకు పంపించారు. దళిత యువకుడిని హత్య చేసి పార్సల్ చేసిన కేసులో ఎమ్మెల్సీ కి నాలుగు నెలల్లోనే బెయిల్ లభించగా, శ్రీనివాసరావు మాత్రం నాలుగేళ్లు గా జైల్లో మగ్గాల్సిన దుస్థితి నెలకొంది. కోడి కత్తి కేసు ఒక డ్రామా. ఈ డ్రామాలో కత్తి కుచ్చినట్లుగా శ్రీనివాసరావు కత్తితో పొడిపించుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి నటించారు. ఎన్ఐఏ నివేదికలోని ఎనిమిదవ పేజీ నాలుగవ పేరాలో సానుభూతి ద్వారా జగన్మోహన్ రెడ్డి విజయం సాధించడం కోసమే తాను ఆ రకంగా చేయవలసి వచ్చిందని శ్రీనివాసరావు పేర్కొన్నట్లు స్పష్టం చేసింది. శ్రీనివాసరావు ఆలోచనల వెనుక ఆర్థిక కోణం ఏమైనా ఉన్నదా?, ఆ డబ్బులను సమకూర్చింది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానాలు లభించాల్సి ఉంది. బాధితుడు కోర్టుకు రాలేనని చెబితే, ఈ కేసు లో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇస్తామంటే ఏదో అన్యాయం జరిగిపోతుందని అధికార పార్టీ నేతలు అంటున్నారు ఇదెక్కడి విడ్డూరం. కోర్టుకు నేరుగా బాధితుడు హాజరు కాలేకపోతే, కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానైనా కోర్టు ప్రొసీడింగ్స్ కు హాజరు కావాలి. ఒక దళిత యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఇదంతా చేశానని అంటున్నాడు. ఈ విషయాన్ని గతంలోనే ఠాగూర్ అనే అధికారి చెబితే అతన్ని, లూప్ లైన్ లో వేసి ఆ పోస్టులోనే రిటైర్డ్ అయ్యేవిధంగా చూశారని అన్నారు.

ప్రతిపక్షాలు కలవక ముందే ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్
రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఐక్యం కాకముందే ఎన్నికలకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ గా కనిపిస్తోంది. అయితే ఓట్లున్న ప్రతిపక్షాలు కలవడం ఖాయం. పవర్ లో ఉన్న పార్టీ కూడా వారితో కలిసే అవకాశాలు ఉన్నాయని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. జై భీమ్ వ్యవస్థాపకుడు శ్రావణ్, రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురికి సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. చార్టెడ్ అకౌంటెంట్ ను అరెస్టు చేయడం తప్పని సమావేశాలు నిర్వహించారు.. ఏ ప్రాతిపదికన ఈ సమావేశాన్ని నిర్వహించారో, మీ వద్ద ఉన్న వివరాలు ఏమిటో తీసుకొని 15 వ తారీఖు సిఐడి కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. వీళ్లను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారని అంటే, వారి వద్ద ఇన్ఫర్మేషన్ లేదని స్పష్టం అవుతుంది. ఇటీవల రైడ్ చేసినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఇందులో అల్లరి చేయాలని కోరిక తప్ప ఏమీ కనిపించడం లేదు. ఈ నోటీసులు ఇవ్వడం వెనుక వారిని భయపెట్టాలని ఉద్దేశమైన ఉండి ఉండాలి. లేకపోతే ఇతరులెవరు వారికి మద్దతుగా మాట్లాడరాదన్న భయానకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు అయిన ఇచ్చి ఉండాలి. చిట్ ఫండ్ వ్యాపారులు కూడా సిఐడి పోలీసుల చర్యలను ఖండించారని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. చార్టెడ్ అకౌంటెంట్ రిమాండ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని ఆయన గుర్తు చేశారు. మెజిస్ట్రేట్ అనుసరించిన విధానాన్ని తప్పు పట్టడమే కాకుండా, సిఐడి డి.ఎస్.పి కి ఏ కోర్టుకు తీసుకువెళ్లాలో కూడా తెలియదా అని ఆక్షేపించిందన్నారు. హైకోర్ట్ ఎక్కడికితీసుకెళ్ళలో తెలియని సీఐడీ డి ఎస్ పి పై అధికారం లేకపోయినా ఆర్డర్ ఇచ్చిన మేజిస్ట్రేట్ పై చర్యలు తీసుకోవాలి అని అన్నారు .

LEAVE A RESPONSE