Suryaa.co.in

Features

తెలుగు సాహిత్యపు మాగాణములను సస్యశ్యామలం చేసిన దివాకర్ల తిరుపతి శాస్త్రి

జెండాపై కపిరాజు….బావ ఎప్పుడు వచ్చితీవు… అదిగో ద్వారక… అయినను పోయి రావలె హస్తినకు… వంటి నాటక పద్యాలు వినని తెలుగువారు ఉండరు. తిరుపతి వేంకట కవుల కలంనుంచి జాలువారిన పాండవోద్యోగ విజయాలు నాటకంలోనివి అవి. తెలుగుభాష పదభూయిష్ఠమై నారికేళప్రాయంగా ఉన్న రోజుల్లో అలతి,అలతి పదాలతో పద్యాలు చెప్పి, రచనలుచేసి సామాన్యులకూ తెలుగు భాషా సాహిత్యం పట్ల మోజుపెంచిన కవితామూర్తులు వీరు……..

ఉత్తమమైన కవిత్వం అలవడితే…..

ఉత్తమమైన కవిత్వం అలవడితే. సామ్రాజ్యాలను ఆశించవలసిన పనిలేదని సంస్కృతంలో ఒక సూక్తి ఉంది. సాహిత్యం ఒక విశాల సామ్రాజ్యం. దానికి అధినేత మహాకవి. భారతీయ వాంగ్మయంలో ఎందరో సాహితీ సామ్రాజ్య చక్రవర్తులు ఉన్నారు. తెలుగు కవిత్వాన్ని ఊరూరా, వాడవాడలా ఊరేగించి తెలుగు పద్యానికి పట్టాభిషేకం చేయించిన జంట కవిరాజులు- తిరుపతి వేంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెళ్లపిళ్ల వేంకట కవి. చెళ్లపిళ్లవారు తిరుపతి శాస్త్రి కన్నా వయసులో ఏడాది పెద్ద అయినా వారు పరమ పదించిన తరవాత మూడు దశాబ్దాలు జీవించారు.

కవులకు మీసాలెందుకని……
తిరుపతి వేంకట కవులు మీసాలు పెంచారు. అదీగాక, కవులకు మీసాలెందుకని ఎవరో అధిక్షేపించినపుడు, సంస్కృతంలోనూ, తెలుగులోనూ తమను మించిన కవులు లేరని సవాలు చేస్తూ, మీసాలు ఎందుకు పెంచారో, వారి పద్యంలోనే విందాం!

దోసమటం బెరింగియు దుందుడు కొప్పగ పెంచినారమీ,
మీసము రెండు బాసలకు మేమె కవీంద్రులమంచు దెల్పగా
రోసము కల్గినన్ కవివరుల్ మము గెల్వుడు గెల్చిరేని యీ
మీసము తీసి మీ పద సమీపములం దలలుంచి మ్రొక్కమే.

అష్టావధాన, శతావధానాలు:

తెలుగు నేలపై సంచారం చేస్తూ అష్టావధాన, శతావధానాలు నిర్వహించారు. తెలుగునాట వీరు దర్శించని రాజాస్థానాలు లేవు. కాలుమోపని నగరాలు, గ్రామాలు లేవు. ఈ కవుల ‘పాండవోద్యోగ విజయాలు’ నాటకం పేరు చెప్పగానే తెలుగువారు ఆత్మీయంగా పులకరిస్తారు. ఈ నాటక పద్యాలు పండిత, పామరుల నాలుకపై నర్తిస్తాయి. వీరిద్దరూ చర్ల బ్రహ్మయ్య శాస్త్రి శిష్యులు. వీరు మహాకవులు, బహు గ్రంథకర్తలు, శాస్త్రద్రష్టలు,తాత్త్వికులు, లోకజ్ఞులు.

సామాన్యులు సైతం పులకించే సాహిత్యం అందించి ప్రజలలో మంచి చైతన్యం నింపిన మహనీయులు తిరుపతి వేంకటకవులు. ఆ కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు.

బాల్యం:

దివాకర్ల తిరుపతి శాస్త్రి ప్రజోత్పత్తి సంవత్సర ఫాల్గుణ శుద్ధ దశమి బుధవారం అనగా 1872 మార్చి 26న పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం వద్ద యండగండి గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.
తిరుపతిశాస్త్రి గారు పోలవరం రాజాగారి ఆస్థానంలో పండితునిగా ఉన్నారు.

జంట కవులు:

మొదటినుండీ తిరుపతి శాస్త్రి వాదనా పటిమ అసాధారణంగా ఉండేది. ఇక వేంకట శాస్త్రి పురాణ సాహిత్యాలపై ఉపన్యాసాలివ్వడంలోనూ, మెరుపులా పద్యాలల్లడంలోనూ దిట్ట. ఒకసారి వినాయక చవితి ఉత్సవాలకు చందాలు వసూలు చేయడంలో ఇద్దరూ తమ తమ ప్రతిభలను సమన్వయంగా ప్రదర్శించారు. ఒకరి ప్రతిభపై మరొకరికి ఉన్న గౌరవం వారి స్నేహాన్ని బలపరచింది.
జీవితాంతం ఆ సాహితీ మూర్తులు ఒకరికొకరు తోడున్నారు. తిరుపతి శాస్త్రి సదా వేంకటశాస్త్రిని తన గురువుగా భావించాడు. తిరుపతి శాస్త్రి మరణానంతరం కూడా వేంకట శాస్త్రి తన రచనలను జంట రచనలుగానే ప్రచురించాడు.

వీరిద్దరు ఇంచుమించుగా వంద సంస్కృత మరియు తెలుగు గ్రంధాలు, నాటకములు మరియు అనువాదాలు వ్రాశారు. అవధానాల్లో వీరి పాండిత్యం, ప్రతిభ, చమత్కార చాతుర్యం సాహితీ సమాజంలో తరతరాలుగా చెప్పుకొనబడుతున్నాయి. ఇక వీరి నాటకాలలో పాండవ ఉద్యోగ విజయములు నాటకంలోని పద్యాలు తెలుగునాట ఊరూరా పండితుల, పామరుల నోట మారుమ్రోగాయి.

చేతనున్న బంగారు కడియం కవితా దిగ్విజయాన్న సూచిస్తుంది. తిరుపతి శాస్త్రి గారిది కవితాధారణ అయితే, చెళ్లపిళ్లవారిని లౌక్య ప్రజ్ఞకు ప్రసిద్ధులుగా చెబుతారు. తిరుపతి శాస్త్రి గారిది సంస్కృత ప్రకర్ష అని, వేంకట శాస్త్రి గారి కవిత్వంలో తెనుగుదనం జాస్తి అని వారిని బాగా తెలిసినవారు చెబుతారు.

కారణజన్ములు..

ఈ జంటకవులు కారణజన్ములు. తమ కవితాధారా స్రవంతులతో తెలుగు సాహిత్యపు మాగాణములను సస్యశ్యామలం చేసిన మహానుభావులు. “అటు గద్వాలిటు చెన్నపట్టణము మధ్యం గల్గు దేశంబునన్….” అంటే తెలుగు నేల నాలుగు చెరగుల అవధాన దిగ్జయ యాత్రలు సలిపిన వారు..

అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే…..
అమ్మా! సరస్వతీదేవీ, కేవలం నీ దయవలనే మేము ఎన్నో సన్మానాలు అందుకొన్నాము అని చెప్పిన ఈ క్రింది పద్యాన్ని తిలకించండి, వారి వినయ విధేయతలు, కూడా ద్యోతకమవుతాయి.

ఏనుగు నెక్కినాము, ధరణీంద్రులు మ్రొక్కగ నిక్కినాము, స
న్మానము లందినాము, బహుమానములన్ గ్రహియించినార, మె
వ్వానిని లెక్క పెట్టక నవారణ దిగ్విజయంబొనర్చి ప్ర
జ్ఞా నిధులంచు బేరు గొనినాము, నీ వలనన్ సరస్వతీ!

అవధానాలలో ప్రత్యేకత:

వీరి అవధానాలలో అతి ప్రత్యేకమైనఝ విశేషమేమంటే, పద్యంలో మొదటి రెండు పాదాలు ఒకరు చెబితే, చివరి రెండు పాదాలు మరొకరు చెప్పేవారు. భౌతికంగా వారు ఇరువురైనప్పటికీ, మానసికంగా ఒక్కరే, అని అర్ధం చేసుకోవచ్చు! అలా వారు చెప్పిన పద్యాలు, వ్యాకరణ దోషాలు లేకుండా, నాలుగు పాదాలు ఒకరు చెప్పినట్లే అతికేవి. ఒకసారి వ్రాసిన పద్యాన్ని తిరిగి చూసుకుంటే, దానిలో ఎటువంటి తప్పులుండేవి కావు. వీరిద్దరూ బందరులో నిర్వహించిన అష్టావధానాలు, శతావధానాలు తెలుగు సాహితీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

సన్మానాలు:

ఇద్దరూ కలిసి అసంఖ్యాకంగా అవధానాలు నిర్వహించారు. సన్మానాలు అందుకొన్నారు. ‘ధాతు రత్నాకరం’ రచించారు. అడయారు వెళ్ళినపుడు అనీబిసెంట్ ప్రశంసలు అందుకొన్నారు. వెంకటగిరి, గద్వాల, ఆత్మకూరు, విజయనగరం, పిఠాపురం సంస్థానాలు సందర్శించి తమ ప్రతిభను ప్రదర్శించి సత్కారాలు గ్రహించారు.

పోలవరం జమీందారు వారి ప్రతిభను గురించి తెలిసికొని ఎడ్విన్ ఆర్నాల్డ్ రచించిన లైట్ ఆఫ్ ఆసియా గ్రంధాన్ని తెలుగులోకి అనువదించమని వారిని కోరాడు.

పాండవ ఉద్యోగ విజయాలు:

పాండవ ఉద్యోగ విజయాలు అజరామరమైన ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. ఎందరో పద్యనటులు తెలుగునేలపై పుట్టుకువచ్చారు. ఎందరో కళాకారులకు అన్నం పెట్టి, అనంతమైన ఖ్యాతిని అందించిన ఆధునిక పద్యనాటక రాజాలు ఈ పాండవ ఉద్యోగ విజయాలు. సంప్రదాయ పద్య కవిత్వ ప్రక్రియలోనే, భారత కథలను వాడుకభాషలో రాసి, వాడుకభాషను శిఖరంపై కూర్చోపెట్టిన ఘనత వీరిదే
సాహితీవేత్త మోదుగుల రవికృష్ణ ఈ నాటకాల విజయాన్ని గురించి చెప్తూ “పాండవోద్యోగ విజయాల ప్రదర్శన జరగని ఊరు ఆంధ్రదేశంలో లేదంటే అతిశయోక్తి కాదని” పేర్కొన్నారు. వాటిలో వారు రాసిన పద్యాలు జాతీయాలుగా నిలిచిపోయాయి. ప్రముఖ తెలుగు దినపత్రికల్లో “అయినను పోయి రావలె హస్తినకు” వంటివి ప్రముఖ ప్రయోగాలుగా, నిలిచిపోయాయి.
డాక్టర్ మీగడ రామలింగ స్వామి 1993లో తిరుపతి వేంకట కవుల పాండవ నాటక చక్రం – పరిశీలనాంశం” అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు.
దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మధుమేహం వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించారు.

వారి నాటకాల ద్వారా అనేక మంది నటులు ప్రఖ్యాతమైన పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యులు, బందా, అద్దంకి, సి.యస్.ఆర్. రఘురామయ్య, పీసపాటి, షణ్ముఖి, ఏ.వి. సుబ్బారావు, మాధవపెద్ది మున్నగు వారు. ప్రస్తుతం గుమ్మడి గోపాలకృష్ణగారు, ఎ.వెంకటేశ్వరరావు గారు,ఎ. కోటేశ్వరరావు మొదలైనవారు వీరి నాటకాన్ని తన చక్కని గాత్రంతో, హావ భావాలతో అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు.
బావా ఎప్పుడు వచ్చితీవు, చెల్లియో చెల్లకో, జెండాపై కపిరాజు, అలుగుటయే యెరుంగని… లాంటి పద్యాలు తెలుగు వారి చెవుల్లో ప్రతిధ్వనిస్తునే ఉంటాయి.

(తెలుగు కవి, అవధాని, నాటకకర్త. తెలుగులో అవధాన విద్యకు రూపురేఖలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులలో శ్రీ దివాకర్ల తిరుపతి శాస్త్రి గారి జయంతి సందర్భంగా )

సేకరణ
– డాక్టర్ ఏ.శ్రీనివాసరెడ్డి
9912731022
జడ్పీహైస్కూలు, మునుగోడు
అమరావతి మండలం
ఆంధ్రప్రదేశ్

LEAVE A RESPONSE