• ధర్మారెడ్డి అక్రమాలపై న్యాయవిచారణ చేయాల్సిందే
• కరుణాకరెడ్డి రిజైన్ చేసినా, ధర్మారెడ్డి రిటైర్డ్ అయినా చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి?
• ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ఎక్కడికి జంప్ అయినా తప్పించుకోలేరు
• తిరుమల నుండి రాష్ట్రంలో ప్రక్షాళన మొదలైంది
• ధర్మా రెడ్డి రిటైర్మెంట్, కరుణాకర రెడ్డి రిజైన్ చేస్తే…. ఇద్దరూ శుద్ధపూసలు అయిపోతారా?
• శ్రీవాణి ట్రస్ట్ ల పేరుతో, సమరత సేవా ట్రస్ట్ కు నిధుల పేరుతో దోపిడీ
• ఈ ఐదేండ్లలో తిరుమలలో హిందూ వ్యతరేక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు ఎన్నోజరిగాయి
• ధర్మారెడ్డి, వైవీసుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డిల నేతృత్వంలో తిరుమలను భ్రష్టుపట్టించారు
• టీటీడీ లో అదనపు నిధులు, బడ్జెట్, ఆమోదం లేకుండా, రూ. 1233కోట్ల కాంట్రాక్ట్ వర్కులు, మూడు నెలల్లో కరుణాకర రెడ్డి, ధర్మా రెడ్డిలు కలిసి ఇచ్చేస్తే అది ఎలా సక్రమం అయిపోతుంది?
• కమీషన్ లు దండుకోవడానికి వర్క్ లు కట్టబెట్టి దాదాపు రూ. 100 కోట్లకు పైగా కొట్టేశారు
• ఎక్కడ దొరికిపోతామోనని బోర్డు తీర్మానాలు, ఇంజనీరింగ్ పనులన్నీ వెబ్ సైట్ నుండి మాయం చేశారు
• చేసిన పాపాలకు మూల్యం చెల్లించుకోక తప్పదు
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్
టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి రాజీనామా చేసినా, ఈఓ ధర్మారెడ్డి రిటైర్ అయినా… చేసిన తప్పుల నుండి తప్పించుకోలేరని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉన్న నిర్మాణాలు కూల్చి కమీషన్ దండుకోవడానికి కొత్త నిర్మాణాల పేరుతో కుయుక్తులు పన్ని వందలకోట్లు కొల్లగొట్టారన్నాని ధ్వజమెత్తారు.
నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. 2023-24 లో టీటీడీ ఇంజనీరింగ్ బడ్జెట్ రూ.300 కోట్లు మాత్రమే ఉండగా సెప్టెంబర్ లో చైర్మన్ బాధ్యలు చేపట్టిన భూమన కరుణాకర్ రెడ్డి మూడు నెలల్లోనే రూ. 1,233 కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేసి భారీ అక్రమాలకు తెరతీశారు. ఇంజనీరింగ్ బడ్జెట్ పరిమితిని అధిగమించి ముందున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రూ. 475 కోట్లకు పెంచగా.. అనంతరం ఛైర్మన్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి భారీగా రూ.1,772 కోట్లకు పెంచి తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారు.
ధర్మా రెడ్డి ఈవోగా ఉండి కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉండి ఏ ఒప్పందం ప్రకారం, ఏ అనుమతి ప్రకారం దాదాపు రూ.1,233 కోట్లను మూడు నెలల్లో ఏవిధంగా శాంక్షన్ చేశారు? సంవత్సరం మధ్యలో కేవలం మూడు నెలల్లో ప్రభుత్వం నుండి ఏ విధమైన అనుమతి లేకుండా ఎలా శాంక్షన్ చేశారు? అందులో ఎంత తిన్నారు? ఉన్న సత్రాలను నేలమట్టం చేయాల్సిన అవసరం ఏముంది?
స్విమ్స్ లో అడిషనల్ బ్లాక్ లు, సత్రాల పేరుతో ఇలా ఏడు, ఎనిమిది వర్క్ లు కట్టబెట్టి అడ్వాన్స్ లు ఇచ్చాక వాళ్ల దగ్గర నుండి కరుణాకర్ రెడ్డి 18 % చొప్పున 100 కోట్లకు పైగా కమీషన్ లు దండుకున్నారు. ఈవోకు ధర్మారెడ్డికి తెలిసే కరుణాకర్ రెడ్డి కుమారుడికోసం ఇదంతా చేశారు.
జగన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి లు దుర్మార్గపు ఆలోచనలతో కాంట్రాంక్టులు కట్టబెట్టి కమీషన్ లు దండుకున్నారు. ఓడిపోతామనే తెలిసే బడ్జెట్ ను రూ.1,772 కోట్లకు పెంచి దోచుకున్నారు. వర్క్ వివరాలును బోర్డు వెబ్ సైట్ లో ఎందుకు నమోదు చేయలేదు? ధర్మారెడ్డి ఛార్జ్ తీసుకున్నాక 2021 -22 నుండి ఇంజనీరింగ్ పనుల వివరాలను దేవస్థానం వెబ్ సైట్ లో పెట్టలేదంటే ఏమనుకోవాలి? కట్టబెట్టిన వర్క్ లు బోర్డు అమోదించిందో లేదో… కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలకు మాత్రమే తెలుసు.
చేసిందంతా చేసి దోచుకోవాల్సింది దోచుకుని చిత్తుకాగితంపై రిజైన్ అని మూడు లైన్లు రాస్తే సరిపోతుందా? ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా ఆర్టీఐ వస్తుంది. ధర్మారెడ్డి మాత్రం దేవస్థానం ఆర్టీఐ కిందకు రాదని చెబుతాడు. అందుకే ఏ సమాచారం ఇవ్వడటా? కరుణాకర్ రెడ్డి వచ్చాక బోర్డు రిజల్యూషన్లు పెట్టడం మానేశారు. ఇంజనీరింగ్ వర్క్ 2021 -22 వివరాలు మాత్రమే ఉన్నాయి. 2022 -23, 2023 -24 వివరాలు లేవు.
దొంగ ఇంట్లోకి వచ్చేప్పుడు సీసీ కెమెరాలు ఆపి వచ్చినట్లు .. బోర్డులో వర్క్ వివరాలు ఉంటే తమ గుట్టు బయటకు పడుతుందని కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు బోర్డు తీర్మానాలు వెబ్ సైట్ లో లేకుండా చేశారు. దాదాపు రూ. 150 కోట్లు కమీషన్ల రూపంలో కొట్టేశారు. వీటిని సమీక్షించాల్సిన ఛీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, దేవాదాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాలవలవన్, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లప్పగించి చూస్తూ సహకరించారు . తప్పులకు సహకరించిన ఫైనాన్స్ సెక్రటరీ సత్యనారాయణ ఎక్కడికి జంప్ అయినా తప్పించుకోలేరు.
శ్రీవాణి సేవ లో సమరత సేవ ట్రస్ట్ కు ఇచ్చిన రూ. 32 కోట్ల మతలబు ఏంటి ?
శ్రీ వాణి ట్రస్ట్ గురించి గత సంవత్సరం జూన్ లో టీటీడీ ఒక శ్వేత పత్రం విడుదల చేసింది. ఆ పత్రం ప్రకారం..శ్రీవాణి ట్రస్ట్ కు వచ్చిన నిధుల ద్వారా మొత్తం 2,273 దేవాలయాలను కడతామని.. అందులో 1,953 దేవాలయాలు దేవాదాయ శాఖ ద్వారా, 320 గుడులు సమరత సేవ ట్రస్ట్ ద్వారా నిర్మించనున్నట్లు చెప్పారు. ప్రతి గుడికి రూ. 10 లక్షల వంతున కేటాయించినట్లు శ్వేతపత్రంలో తెలియజేశారు. అంటే దాదాపు 32 కోట్లు సమరత సేవా ట్రస్ట్ కు ఇచ్చారు.
కానీ ఆ సమరత సేవా ట్రస్ట్ వెబ్ సైట్ కు వెళ్లి చూస్తే.. ప్రతి గుడికి 5 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు, అది కూడా 2015-18 మధ్యలో టీటీడీ ఇచ్చిన 25 కోట్ల గ్రాంటు కింద అని వెబ్ సైట్ లో ఉంది. వాళ్ల వెబ్సైట్ ప్రకారం 2015- 18 మధ్యలో టీటీడీ 502 దేవాలయాల నిర్మాణానికి నిధులు శాంక్షన్ చేసిందని.. 502 గుళ్లను 13 జిల్లాల పరిధిలో 278 మండలాల పరిధిలో కట్టామని చెప్పారు.
సమరసత సేవ ట్రస్ట్ వివరాలు కేవలం 2020 దాకా మాత్రమే ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో టీటీడీ నుంచి 320 గుళ్ల కోసం గుడికి 10 లక్షల చొప్పున తీసుకున్నట్లు ఎక్కడా చెప్పలేదు. 2020 తర్వాత ఏ రకమైన అకౌంట్లు, ఆడిట్ రిపోట్లు, వార్షిక నివేదికలు సమరత సేవా ట్రస్ట్ వెబ్సైట్లో కనిపించలేదు. 2020 సంవత్సరం తర్వాత వెబ్ సైట్ ఆపరేట్ చేస్తున్నట్లే కనపడలేదు. కనీసం టీటీడీ ఇచ్చిన శ్వేత పత్రం లో కూడా సమరత సేవా ట్రస్ట్ ఎన్ని జిల్లాలలో ఎన్ని మండలాల్లో, ఎక్కడెక్కడ గుళ్లను కట్టించి చెప్పలేదు.
2018 దాకా ఒక గుడి కట్టడానికి పునరుద్ధరణకు అప్పటి ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చినప్పుడు.. మీరు 2019 లో పది లక్షలు ఎందుకిచ్చారు ? ఒకే సారి రెండింతలు చేయడం వెనకాల కారణం ఏమిటి? 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో జనరల్ అకౌంట్ లో నుంచి ఇచ్చినప్పుడు.. వైకాపా ప్రభుత్వంలో కొత్తగా శ్రీవాణి ట్రస్ట్ అంటూ ఏర్పరచి, దానిలో నుంచి నిధులు ఇవ్వాల్సిన అవసరమేముంది? మొదట పీవీఆర్కే ప్రసాద్ ద్వారా ప్రారంభింపబడి.. ఆ తర్వా ఎమ్జీకే మూర్తి ఐఏఎస్, దాసరి శ్రీనివాసుల ఐఏఎస్ ల ద్వారా నడపబడిన ఈ ట్రస్ట్, ఆ పిమ్మట ఐఏఎస్ లు పోయి మామూలు వ్యక్తులు వచ్చి చేరారు. కనీసం వెబ్ సైట్ కూడా 2019 తర్వాత ఎందుకు నిర్వహించలేదు ?ఇక దేవాదాయ శాఖ ద్వారా ఏమి చేస్తున్నారో, కొత్తగా వచ్చిన ఈఓ చూసుకోవాలి.
కోస్టల్ రెగులేషన్ జోన్ నిబంధనలు వ్యతిరేకంగా.. నేషనల్ గ్రీన్ ట్రిబునల్ లో కేసు ఉన్నప్పటికీ నవీ ముంబై లోని మడ అడవుల్లో శ్రీవారి గుడి ఎందుకు కడుతున్నారు ? కాస్టింగ్ యార్డ్ నిర్మాణానికి నవీ ముంబై తీర ప్రాతంలోని మడ అడవుల్లో 16 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం L&T కి కేటాయిస్తే దాంట్లోని 10 ఎకరాలను ఇప్పుడు శ్రీవారి గుడికి కేటాయించింది. మడ అడవుల్లో సీఆర్ జెడ్ నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టడం చట్ట విరుద్ధం. అక్కడ పర్యావరణ నిషేధాలు ఉన్నాయని టీటీడీకి రెండేళ్ల క్రితమే తెలుసు. మహారాష్ట్ర ప్రజలు రెండేళ్ల క్రిందటే ఉద్యమాలు చేసి మడ అడవుల్లో శ్రీవారి ఆలయం కట్టకూడదని అభ్యంతరం చెప్పారు, కేంద్రానికి ఫిర్యాదు కూడా చేశారు.
ఫిర్యాదుల ఫలితంగా 40 వేల చదరపు అడుగుల్లో ఆలయ నిర్మాణం చేపట్టాలని టీటీడీ భావిస్తే, కేంద్రం కేవలం 11 వేల చదరపు అడుగులకే అనుమతి ఇచ్చింది. ఆపై పర్యావరణ వాదులు ఈ మడ అడవుల్లో శ్రీవారి ఆలయం గురించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్లో ఫిర్యాదు చేశారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మూడు రోజుల క్రితం మహారాష్ట్రలోని పర్యావరణ వాదులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సైతం ఫిర్యాదు చేయడం జరిగింది.
తిరుమలలో ప్లాస్టిక్ వాడరాదని చెప్పే టీటీడీ.. మహారాష్ట్రలో నవీ ముంబై లో శ్రీవారి ఆలయ విషయంలో పర్యావరణ నిబంధనలను ఎందుకు పాటించడం లేదు? కేంద్రంతో ఎందుకు మొట్టికాయలు వేయించుకుంటూ తిరుమల పరువును ధర్మారెడ్డి ఎందుకు తీయాల్సి వచ్చింది?
అమరావతిలో శ్రీవారి ఆలయానికి 150 ఎకరాలు కేటాయిస్తే వైసీపీతో కలిసిపోయిన ధర్మారెడ్డి 30 ఎకరాల్లో చాలని చిన్న ఆలయాన్ని నిర్మింపచేశారు. మహారాష్ట్రలో మాత్రం సీఆర్జెడ్ నిబంధనలు కాదని మరీ ఆలయ నిర్మాణం చేపడుతారా? ఎంత చేతులు మారింది? చివరికి జాతీయ హరిత ట్రిబ్యునల్ తిట్టినా, కేసు వేసినా ఎందుకు ముందుకెళ్లారు?
రాష్ట్రం లో జగన్ సలహాదారులు.. టీటీడీలో ధర్మా రెడ్డి సలహాదారులు
టీడీపీ హయాములో లేని సలహాదారుల విధానాన్ని టీటీడీ లోకి ధర్మా రెడ్డి తీసుకొచ్చి తనకిష్టం వచ్చినోళ్ళని సలహాదారులుగా టీటీడీ లోని కీలక విభాగాల్లో నింపేశారు. ధర్మారెడ్డి పెట్టుకున్న సలహాదారుల లిస్ట్ చాంతాండ ఉంది. అకౌంట్స్ విభాగంలో నరసింహ మూర్తి, ఇంజనీరింగ్ విభాగంలో కొండల రావు, రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, రామ చంద్ర రెడ్డి, బర్డ్ హాస్పటిల్ విభాగంలో హాస్పిటల్ లో గురవా రెడ్డి, విజిలెన్స్ విభాగంలో ప్రభాకర్, ఫైబర్ విభాగంలోసందీప్, ఎస్టేట్ విభాగంలో మల్లికార్జున, SVBC విభాగంలో మంగ్లీ, విజయ కుమార్, ప్రజా సంబంధాల విభాగంలో సాక్షి నుండి నాగేష్, విద్యా శాఖ, ధర్మ ప్రచార పరిషత్ విభాగాల్లో అడ్డగోలు నియామకాలు వంటివి విచ్చలవిడిగా చేస్తూ ధర్మారెడ్డి టీటీడీని తన జేబు సంస్థగా మూర్చుకున్నారు.
ఇక శానిటేషన్ పేరుతో దోపిడీకి యత్నం, రోజాకి ప్రతి వారం 50 నుంచి అరవై దర్శనం లెటర్లు దగ్గర నుంచి, వైజాగ్ స్వరూపానంద ఆశ్రమానికి నూరు శాతం అతిక్రమణలతో భవన అనుమతులు దగ్గర నుంచి. వేల కొలది అభియోగాలు ధర్మా రెడ్డి మీద ఉన్నాయి. ఈ అయిదేళ్ల లో ఖచ్చితంగా టీటీడీ లో దేవుడికి రెండో స్థానమే ఇచ్చి రాజకీయాలకు అవినీతికి మొదటి స్థానం ఇచ్చారు ధర్మారెడ్డి.
కొత్త ఈవో శ్యామలరావు నియామకం జరిగింది. ప్రభుత్వానికి మా వినతి ఏంటంటే.. ఐదేళ్ల ధర్మారెడ్డి లీలలన్నీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీతో తేలే విషయాలు కావు. ఎందుకంటే ప్రతి అవినీతికి మూలాలు చాలా పొడవుగా ఉన్నాయి. అందుకని ధర్మా రెడ్డిని రిలీవ్ చెయ్యకుండా, ఆయన హయాములో జరిగిన అన్నీ విషయాల మీద ఒక న్యాయ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము