Suryaa.co.in

Andhra Pradesh

ఏం చేసుకుంటారో చేసుకోండి

-జగన్‌ మారారు..చేసిన మేలు మరిచారు
-వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు నా పైనే వ్యక్తి గత దాడులు
-ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం
-ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకూ అంతే ఉంది
-ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌ షర్మిల

కడప : జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల ఆరోపించారు. వైసీపీ కోసం నిస్వార్థంగా పని చేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో సోమవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తనకు ఎప్పుడూ పదవీ కాంక్ష లేదని, ఎన్ని అవరోధాలు కల్పించినా రాష్ట్ర ప్రజల హక్కుల కోసం పోరాటం సాగిస్తానని స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా తన మార్క్ రాజకీయం, సంక్షేమ పాలన అందించారు. అదిప్పుడు జగనన్న పాలనలో ఎక్కడ ఉంది. వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు 3,200 కి.మీ పాదయాత్ర చేశా. అలాంటిది ఇప్పుడు నాపైన మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. రోజుకొకరితో నాపై వ్యక్తిగతంగా దూషణలు చేయిస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీతో నా భర్త అనిల్ కలిసి రాజకీయం చేశారని మాట్లాడుతున్నారు. జగన్‌ను జైల్లో పెట్టి నేను ముఖ్యమంత్రి కావాలని బ్రదర్ అనిల్ కోరినట్లు విష ప్రచారం చేస్తున్నారు. అదంతా అబద్ధం.

సోనియా గాంధీ దగ్గరికి అనిల్.. భారతి రెడ్డితో కలిసే వెళ్లేవారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రణబ్ ముఖర్జీ కుమారుడిని అడిగి తెలుసుకోండి. జగన్‌ పత్రికలో నా పైన వ్యక్తిగతంగా వార్తలు రాయిస్తున్నారు. ఆ పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో నాకూ అంతే ఉంది. ఆ విషయం మరిచి ఆ పత్రిక ఇష్టానుసారం వార్తలు రాస్తోంది. వైసీపీ నాయకులు ఏం రాసినా, ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండని షర్మిల తీవ్రంగా మండిపడ్డారు.

LEAVE A RESPONSE