Suryaa.co.in

Andhra Pradesh

అభివృద్ధి అంటే వైసీపీ ప్రజాప్రతినిధులకు తెలుసా?

-ఈమని గ్రామం నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం!
-దుగ్గిరాలలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుచేస్తాం
-18న మంగళగిరి ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు
-దుగ్గిరాల, తాడేపల్లి రూరల్ మండలాల రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్

దుగ్గిరాల/ తాడేపల్లి రూరల్: రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక ఈమని నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతానని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం ఈమని, తాడేపల్లి రూరల్ చిర్రావూరు, గుండిమెడ గ్రామాల్లో జరిగిన రచ్చబండ సభల్లో యువనేత లోకేష్ పాల్గ్లొన్నారు.

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ఎంపిటిసిలు, సర్పంచ్ స్థానాల్లో ఇక్కడ టిడిపి అభ్యర్థులను గెలిపించారు. ఎన్నికల్లో గెలుపొందాక అభివృద్ధి పనులతో ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటా. దుగ్గిరాల ప్రాంతంలో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుతో ఇక్కడి రైతులను ఆదుకుంటాం. గత ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న ఆర్కే… అయిదేళ్లపాటు కన్పించకుండా పోయారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా ఆర్కే నెరవేర్చారా? 5ఏళ్ల తర్వాత రోడ్లపై ఇప్పుడు ప్యాచ్ వర్క్ లు చేసి గోతులు పూడుస్తున్నారు. అభివృద్ధి అంటే ఎలాఉంటుందో వైసిపి ప్రభుత్వానికి తెలుసా?

ధనదాహంతో ఇసుకను అందుబాటులో లేకుండా చేయడంతో 70మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను గత ఎన్నికల్లో ఓడిపోయినా మంగళగిరి సొంతం అనుకొని అంటిపెట్టుకొని సేవలు చేస్తున్నా. 29సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నా. 25 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వారు నేను చేసిన పనుల్లో పదోవంతైనా చేశారా? భూగర్భ డ్రైనేజితో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాం. కృష్ణానది జలాలతో ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం. మంగళగిరి – తెనాలి, తెనాలి – ఈమని రోడ్ల నిర్మాణం చేపడతాం. ఈనెల 18వతేదీన మంగళగిరి ప్రజల సమక్షంలో నామినేషన్ దాఖలు చేయబోతున్నా. రాబోయే ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా తనను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకేష్ కోరారు.

లోకేష్ దృష్టికి ఈమని, చిర్రావూరు ప్రజల సమస్యలు
ఈమని గ్రామస్తులు తమ సమస్యలు లోకేష్ దృష్టికి తెచ్చారు. గ్రామంలోని పిహెచ్ సిని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయాలి. దీనిద్వారా 18 గ్రామాల ప్రజలకు వైద్యసౌకర్యం అందుతుంది. పొలాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది, డొంకరోడ్లను బాగుచేయండి. మార్కెట్ యార్డు నిధులతో లింకు రోడ్లను అభివృద్ధి చేయాలి. కాల్వ ఆవలఉన్న రంగాబజార్ వంతెన నిర్మాణం చేపట్టాలి, దీనిద్వారా 2వేల ఎకరాల రైతుల కష్టాలు తీరుతాయి. గతంలో వెయ్యిరూపాయలు ఉండే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 7వేలు అయింది.

ఇసుక అందుబాటులో లేకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలుపెరగడంతో నిర్మాణాలు ఆగిపోయి పనుల్లేక కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పించండి. ఈమని గ్రామంలో బిసి కమ్యూనిటీ హాలును కబ్జాచేసి సచివాలయం ఏర్పాటుచేశారు. మా భవనం మాకు ఇప్పించాలి. దుగ్గిరాల – ఈమని నడుమ డబుల్ రోడ్డు నిర్మించాలి. ఎటువంటి కొర్రీలులేకుండా ఆరోగ్యశ్రీని అన్ని కుటుంబాలకు అమలుచేయాలి. దళితుల శ్మశాన వాటికకు ప్రత్యేకంగా స్థలం కేటాయించాలి. జగనన్న కాలనీకి వెళ్లే రహదారి మెయిన్ రోడ్డుతో అనుసంధానం చేయాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి.

స్లోపాయిజన్ లా వ్యాపిస్తున్నగంజాయిని అరికట్టాలని కోరారు. చిర్రావూరు గ్రామస్తులు సమస్యలు చెబుతూ పశువుల ఆస్పత్రిని అభివృద్ధి చేసి వెటర్నరీ డాక్టర్ ని నియమించాలి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం శ్మశాన వాటికలకు వేర్వేరుగా స్థలాలను కేటాయించాలి. కరకట్టకు ప్రహరిగోడ, కట్ట మీదకు వెళ్లడానికి రహదారి ఏర్పాటుచేయాలి. చిర్రావూరును పంచాయితీగానే కొనసాగించాలి. కొర్రీలు లేకుండా పెన్షన్లు ఇవ్వాలి. గతంలో ఇసుక క్వారీ ద్వారా రోజుకు 1500 ఆదాయం లభించేది. ప్రస్తుతం పనుల్లేక మహిళలు పాచిపనులకు వెళ్లాల్సివస్తోంది. డ్రైనేజి,తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

యువనేత లోకేష్ స్పందిస్తూ…ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా పుంతరోడ్లను అభివృద్ధి చేస్తాం. వందరోజుల్లో బిసి భవనాన్ని వారికి అప్పగిస్తాం. పాత ఇసుక విధానంతో నిర్మాణరంగానికి గతవైభవం తెస్తాం. పేదల కాలనీలో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. జనాభా దామాషా ప్రాతిపదికన శ్మశానవాటికలకు స్థలాన్ని కేటాయిస్తాం. చిర్రావూరులో పశువుల ఆసుపత్రిని అభివృద్ధిచేస్తాం, పాత ఇసుక విధానం అమలుతో ఇసుక అందుబాటులోకి తెస్తాం. మంగళగిరి పరిధిలో ఇళ్లు లేనివారికి 20వేల ఇళ్లు నిర్మించి ఇస్తాం. వందరోజుల్లో గంజాయిని అరికడతామని లోకేష్ చెప్పారు.

LEAVE A RESPONSE