• జగన్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది
• తల్లి, చెల్లి ఫోన్లు కూడా ట్యాప్ చేయించి దొంగ చెవులతో విన్న వ్యక్తి జగన్
• ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం విడ్డూరం
• కారుకింద నలిగి సింగయ్య చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా మానవత్వం లేకుండా వైసీపీ నేతలు ప్రవర్తించారు
• సింగయ్య మృతికి తాను కారణం కాదని జగన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలరా?
మంగళగిరి: సింగయ్య మృతికి తాను కారణం కాదని ప్రెస్ మీట్ పెట్టి, చెప్పే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్ కారు కింద సింగయ్యపడి నలిగిపోతున్నా పట్టించుకోకుండా.. ఒక వ్యక్తి ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా ముళ్లపొదల్లో పడేసి వెళ్లిపోయిన వైసీపీ నేతలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే..
తల్లి, చెల్లి ఫోన్లను కూడా ట్యాప్ చేయించి దొంగ చెవులతో విన్న వ్యక్తులు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తులు రాష్ట్ర గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించేది కేంద్రం. అది వైసీపీ నేతలకు తెలియదు. ఇది తెలియకుండా జగన్ కు భద్రతపై వైసీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారు. భద్రత విషయంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎంత ప్రోటో కాల్ ఇవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం అది కల్పిస్తుంది.
నిబంధనలు తుంగలో తొక్కి సింగయ్య ప్రాణాలు పోవడానికి కారణమై కూడా నిజం కళ్లముందు కనిపిస్తున్నా.. వైసీపీ నేతలు నిజాన్ని పక్కదారి పట్టిస్తూ ప్రచారం చేస్తున్నారు. సింగయ్యను చంపింది కాక కల్పిత కథలంటూ అబద్దాలతో మభ్యపెట్టాలని చూస్తున్నారు. మానవత్వం ఉన్న ఎవరైనా.. సింగయ్యను ముల్లపొదల్లో పడేసి వెళతారా?.. జగన్ వెనక అన్ని కార్లు ఉన్నాయి ఒక్కకార్లో అయినా ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్లకూడదా? ప్రమాదాలు సహజం.. జరిగిన తప్పు ఒప్పుకోకుండా… సమర్థించుకుంటున్నారు ఈ వైసీపీ నేతలు సిగ్గులేకుండా? నాడు వివేకా చావును ముందు గుండెపోటు అన్నారు.. మధ్యాహ్నానికి మర్డర్ అని ప్రచారం చేశారు.. సాయంత్రానికి నారాసుర రక్తచరిత్ర అని అబద్దాలను ప్రచారం చేశారు. అసలు హంతకులు తెలిసేసరికి ఆ హంతకులను జగన్ రెడ్డి రక్షిస్తున్నారు.
నాడు చంద్రబాబు నాయుడు కుప్పం పోయినప్పుడు అడ్డుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్డులో అడ్డుకున్నారు. అనపర్తి పర్యటనలో లారీలను అడ్డంపెట్టి అడ్డుకున్నారు. మాచర్లలో టీడీపీ కార్యకర్త పరామర్శకు వెళ్తుంటే.. చంద్రబాబు నివాసానికి తాళ్లుకట్టారు. జోగి రమేష్ వైసీపీ మూకలతో చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చాడు. చంద్రబాబు అంగళ్ల పర్యటనలో పెద్దిరెడ్డి కనుసన్నల్లో దాడులు చేశారు. అది మాకు సంబంధం లేకపోయినా హత్యయత్నం కేసులు పెట్టి హింసించారు. లోకేష్ పర్యటనను అడ్డుకుంటూ.. నానా ఇబ్బందులు పెట్టారు. ఈ సంఘటనలు ఎవరూ మరచిపోలేదు జగన్ రెడ్డి. ఇలాంటి మీరు ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతుంటే అందరూ సిగ్గుతో తలవంచుకుంటున్నారు.
జగన్ నోటి నుండి ప్రజాస్వామ్యం మంటూ మాటలొస్తుంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని ముక్కుమీద వేలేసుకునే పరిస్థితి. ఇప్పటికైనా.. గందరగోళాన్ని విడిచి వైసీపీ మూకలు ఏకాభిప్రాయానికి వచ్చి సింగయ్య మృతిపై వాస్తవాన్ని అంగీకరించాలి.